– ఆరు గ్యారెంటీలపై కేరళంలో అసత్య ప్రచారం
– కేసీఆర్ లాగే అబద్దాల ప్రచారం అందుకున్న రేవంత్
- తెలంగాణలో అమలు చేయని పథకాలను ప్రచారం చేస్తారా
– ఇది క్షమించరాని మహాపరాథం
– ప్రజలను మోసం చేసే యత్నం
– రేవంత్ ప్రచారంపై మండిపడ్డ కిషన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 3: కేరళంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్దాల ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలు తెలంగాణలో పూర్తిగా విఫలమయ్యాయని, ఒక్క పథకం కూడా సమర్థవంతంగా అమలు కాలేదని అన్నారు. అమలు చేయని పథకాలను అమలు చేసినట్టు చెప్పడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని మండిపడ్డారు. ఇక్కడ ఆరు గ్యారెంటీలు అమలు చేశామని, కావాలంటే కేరళ ప్రజలు వచ్చి చూడాలని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇది సాధారణ అబద్ధం కాదని.. ప్రజలను మోసం చేసే ప్రయత్నమని ఆగ్రహించారు. గతంలో కేసీఆర్ ఎలా హామీలు ఇచ్చి అమలు చేయలేదో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే మార్గంలో నడుస్తున్నారు. అమలు చేయకపోయినా ’చేశామని అనుకోండి’ అనే ధోరణి ప్రమాదకరం అని హెచ్చరించారు. బీసీలకు రూ.లక్ష కోట్లు కేటాయిస్తామని చెప్పారు.. రెండేళ్ల పాలనలో ఒక్క ఏడాది కూడా రూ.20 వేల కోట్లు ఇవ్వలేకపోయారు. ఇవన్నీ కేరళ ప్రజలకు చెప్పగలరా?. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయకపోవడం మోసమైతే.. అమలు చేశామని చెప్పడం మరింత పెద్ద మోసం. తప్పుడు ప్రచారం, అబద్దాలు చెప్పడం ప్రజలను దగా చేయడమేనన్నారు. కాంగ్రెస్ మాటలను నమ్మకండి.. ఇప్పటికే లెప్ట్ పార్టీలు కేరళం ప్రజలను మోసం చేశాయి. గత పదేళ్లుగా అభివృద్ధిని అడ్డుకున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే అవినీతి మరింత పెరుగుతుందని అన్నారు. రేవంత్ రెడ్డి మాటలకు కేరళంలో విలువ లేదు. ఆయన ఎందుకు అక్కడికి వెళ్లారో అందరికీ తెలుసు. తెలంగాణ నుంచి డబ్బులు పంపుతున్నారనే అనుమానాలు ప్రజల నుంచి వస్తున్నాయి. అందుకే ఆ పార్టీ నాయకులను అక్కడికి పిలుస్తున్నారు. ఉపన్యాసాలు ఇవ్వమని పిలుస్తున్నారు కానీ ఓట్లు మాత్రం పడవని అందరికీ తెలుసున్నారు. 2014కి ముందు బీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం భద్రాచలం ముంపు ప్రాంతాలను అన్యాయంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిందని పేర్కొన్నారు. విభజన చట్టంలో ఉన్న అంశాలు కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వ నిర్ణయాల వల్లే జరిగాయి. దీనికి బీజేపీ లేదా కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్ విషయంలో పూర్తిస్థాయి దర్యాప్తు కోరుతున్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఒక మేడిగడ్డ లేదా కొన్ని పిల్లర్ల విషయంపై మాత్రమే మాట్లాడుతున్నారు. ప్రాజెక్టు మొత్తంగా సీబీఐ విచారణకు ఇవ్వాలి. ప్రస్తుతం ఈ అంశం హైకోర్టులో ఉంది. పూర్తి నిజాలు బయటకు రావాల్సి ఉందన్నారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేక ఆరోపణలు చేసింది. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాల కేసుల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, కేసీఆర్ కుటుంబంపై కేసులు పెడతామన్నారు. జైలుకు పంపుతామని, రూ.లక్ష కోట్లు వసూలు చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకూ ఒక్క కేసులోనూ చర్యలు తీసుకోలేదు. మరి ఆ ఆరోపణలు ఏమయ్యాయి?, దర్యాప్తు ఎక్కడికి పోయింది?. ఇప్పుడు తమ అసమర్థతను దాచుకోవడానికి బీజేపీపై నెపం వేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన పార్టీగా బాధ్యత కాంగ్రెస్‌దే. వేరే వాళ్లపై నెట్టడం కాదు అని కిషన్ రెడ్డి అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.