మజ్లిస్ ‘వందేమాతరం’ ఉల్లంఘనపై చర్యలేవి?

– మీరు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారనేది మ‌రిచారా?
– స్పీకర్‌ను ప్రశ్నించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17: పవిత్రమైన అసెంబ్లీ వేదికగా మజ్లిస్ నేతలు వందేమాతరం గేయాన్ని అవమానిస్తే స్పీకర్ ప్రేక్షక పాత్ర వహించడాన్ని కేంద్ర హోం శాఖ‌ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆక్షేపించారు. వందేమాతరం గేయం ఆలపించేటప్పుడు సభ్యులంతా తప్పనిసరిగా లేచి నిలబడి గౌరవించాలనే సంగతి మీకు తెలియనిది కాదన్నారు. రాజ్యాంగ పరిరక్షకులైన గవర్నర్, స్పీకర్, మండలి చైైర్మన్ సాక్షిగా మజ్లిస్ నేతలు వందేమాతరం గేయాన్ని అవమానించినా మీకు పట్టదా అని అడిగారు. రాష్ట్రపతి, గవర్నర్ అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం తప్పనిసరి చేస్తూ 2026లోనే కేంద్రం ఉత్తర్వులిచ్చిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. వందేమాతరం గేయ ఆలాపన సమయంలో అసెంబ్లీ నుండి వాకౌట్ చేసిన మజ్లిస్ నేతలకు ఇంతవరకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదంటూ కాంగ్రెస్ పార్టీకి మజ్లిస్ దోస్త్ కాబట్టి నోటీసులివ్వడానికి భయపడుతున్నారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో స్పీకర్ ఇచ్చిన తీర్పుతో శాసన వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సడలిందని, ఇపుడు స్పీకర్ సాక్షిగా నిండు సభలోనే మజ్లిస్ ఎమ్మెల్యేలు వందేమాతరం అవమానించినా చర్యలు తీసుకోవడం లేదంటే ఏమనుకోవాలి అని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గారూ.. మజ్లిస్ నేతలు వందేమాతరం గేయాన్ని అవమానిస్తున్నప్పుడు మీతోసహా మంత్రులంతా సభలోనే ఉన్నారు.. సభ నియమనిబంధనలను, కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయాల్సిన బాధ్యత మీకు లేదా అని బండి ప్రశ్నించారు. మీ నాయకుడు రాహుల్ గాంధీ రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకుని తిరుగుతున్నారు కదా.. ఆ రాజ్యాంగానికి అనుగుణంగా ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలనే సోయి మీ ప్రభుత్వానికి లేదా అని నిలదీశారు. రాష్ట్రంలో మొట్టమొదటి రాజ్యాంగ పరిరక్షుడైన గవర్నర్ సమక్షంలోనే ఉల్లంఘన జరిగినా చర్యలు తీసుకోకపోతే ప్రజల్లోకి ఏ సందేశాలు పంపుతున్నారని అడిగారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించిన మజ్లిస్ ఎమ్మెల్యేలపై తక్షణమే చర్యలకు ఆదేశించాలని సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *