అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో గ్రామ సభలను నిర్వహించాలి
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి దామోదర రాజనర్సింహ.
మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, జనవరి 16: ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు జరిగేలా లబ్ధిదారులను ఎంపిక చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి , ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి, ప్రత్యేక అధికారి రవి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, వాకిటి శ్రీహరి, మధుసూదన్ రెడ్డి, కూచుకుళ్ల రాజేష్, మేఘా రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, విజయుడు, కసిరెడ్డి నారాయణ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ విష్ణు వర్ధన్ రెడ్డితో కలిసి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల,రేషన్ కార్డుల జారీ వంటి సంక్షేమ పథకాల అమలుపై జరిగిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కార్యాచరణ సమన్వయ సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్షించారు.
ఈమేరకు కలెక్టర్లు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి జిల్లా కలెక్టర్లు విజయేంద్ర బోయి, బదావత్ సంతోష్, ఆదర్శ్ సురభి,బి.ఎం. సంతోష్, ఆయా జిల్లాల ఆదనవు కలెక్టర్లు, సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, తదితర అంశాలపై గ్రామ, వార్డు సభల నిర్వహణ, అధికారుల బృందాలకు సంబంధించిన వివరాలను కలెక్టర్లు మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి దామోదర మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జనవరి 26న నాలుగు పథకాలను ప్రారంభించనుందన్నారు. పథకాల అమలులో భాగంగా నిర్వహించే గ్రామ సభల్లో ఎమ్మెల్యేలు, ఇందిరమ్మ కమిటీలను భాగస్వాములను చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలపై ప్రచార లోపం, సమన్వయం లోపం ఉండొద్దన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పథకాలను అమలు చేయాలన్నారు. కొత్తగా ప్రారంభించబోయే నాలుగు పథకాలు ఓ అద్భుతమని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో జరిగే గ్రామ సభల్లో తనతోపాటు, జూపల్లి కృష్ణారావు పాల్గొంటామని ఆయన తెలిపారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ఉన్నవారికి పథకాల వర్తింపుపై క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాలన్నారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ నాలుగు పథకాల అమలు లోపాలు లేకుండా పకడ్బందీగా లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. లబ్దిదారుల ఎంపికకు క్షేత్ర పరిశీలన, గ్రామ సభల నిర్వహణలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఆన్ లైన్ లో టిక్ చేయకపోవడం వల్ల అర్హులు కాకుండా పోతున్నారని చెప్పారు. వినియోగించుకోవాలని సూచించారు. వనపర్తి జిల్లాలోని చిన్నంబావి మండలంలోని ఓ గ్రామంలో రేషన్ కార్డుల దరకాస్తులలో వ్యత్యాసం వొచ్చిందని మంత్రి ఉదహరిస్తూ చెప్పారు. నాలుగు పథకాలలో ఎక్కడా కూడా ల్యాప్స్ లేకుండా చూడాలన్నారు. గ్రామాల్లో సభలు పెట్టేముందు ప్రజా ప్రతినిధులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. గ్రామ సభల్లో ఇందిరమ్మ కమిటీలను, గ్రామైక్య సంఘాలను భాగస్వాములు చేయాలని సూచించారు. అంతకు ముందు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతు ఆత్మీయ భరోసా ఒక గొప్ప పథకమని తెలిపారు. ఆ పథకం వర్తించని వారు నిరాశ చెందకుండా వారిని ఉపాధి పనికి వెళ్లాలని సూచించారు. మరోసారి దరఖాస్తు చేసుకునే విధంగా అధికారులు అవగాహన కల్పించాలన్నారు.
ఈ పథకం గురించి ఫీల్డ్ అసిస్టెంట్లు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్లు తన దృష్టికి వొచ్చిందని తెలిపారు. అలాగే సొంత స్థలం లేని వారికి మలి దఫా లో ఇళ్ళు వొస్తాయని జాగ లేని నిరుపేదలకు సర్ది చెప్పాలన్నారు. కొత్త పథకాల అమలులో అర్హుల ఎంపిక సమర్థవంతంగా జరగాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కోరారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొని వారికి కూడా ప్రభుత్వ పథకాల వర్తింపులో అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కోరారు. క్షేత్రస్థాయిలో సర్వే జరిగిన చోటే స్క్రూటినీ కూడా అక్కడే చేయాలని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కోరారు. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉందని, అక్కడి ప్రభుత్వంతో చర్చించి జూరాలకు 5 టీఎంసీల నీటిని వదిలేలా చూడాలని జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహను కోరారు. జర్నలిస్టులు కూడా ఇందిరమ్మ ఇండ్లను అడుగుతున్నారని ఒకసారి పరిశీలించాలని, అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు జారీ చేయాలని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కుచు కుళ్ళ రాజేష్ రెడ్డి కోరారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో టెక్నికల్, ప్రాక్టికల్ సమస్యలు తలెత్తుతున్నాయని, క్షేత్రస్థాయిలో ఫిల్టర్ చేసిన జాబితాను గ్రామ సభలో పెట్టాలని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి కోరారు. ఎస్సి నియోజకవర్గంలో ఎక్కువ ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మంత్రులను కోరారు.



ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే