– ఈ నెలలో ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ పూర్తి చేయాలి
– పిల్లలకు మధ్యాహ్న భోజనంలో చికెన్ బదులు చేపలు
– రాష్ట్ర మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి
– విద్యార్ది దశ నుంచి క్రీడలు భాగస్వామ్యం చేయాలి : ఎమ్మెల్యే కూనంనేని
– ఖమ్మం, భద్రాద్రి జిల్లా అధికారుల సమీక్ష సమావేశం
ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 6 : ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు సంయుక్తంగా విజయవంతం చేయాలని మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచించారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్ లో 99 రోజుల కార్యాచరణపై ఉమ్మడి జిల్లా పరిధిలో ఇంచార్జ్ మంత్రి శ్రీహరి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే జారే ఆది నారాయణ, మాలోతు రాందాస్ నాయక్, తెల్గం వెంకట్రావు, కోరం కనకయ్య, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు. 99 రోజుల కార్యక్రమంలో చేపట్టే కార్యాచరణను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఖమ్మం కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు 99 రోజుల కార్యాచరణను ప్రణాళిక ప్రకారం అమలు చేయాలన్నారు. రాజకీయాలకతీతంగా అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందాలన్నారు. రైతులు పండించే పంటకు బోనస్ అందించి వారిలో విశ్వాసం కల్పించడమేకాక పేదలకు నాణ్యమైన సన్న బియ్యం రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్నదన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో మంజూరు చేసే ఇందిరమ్మ ఇండ్లలో పేదల పట్ల అధికారులు మానవతా దృక్పథంతో పనిచేయాలన్నారు. క్రీడలలో భవిష్యత్తు ఉంటుందనే భావన యువతకు కలిగేలా అవసరమైన ఇన్ ఫ్రా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పిల్లలకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ప్రతివారం అందించే చికెన్ స్థానంలో చేపలు పెట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కోతులు, కుక్కల సమస్య పరిష్కారం కోసం వాటి సంతానోత్పత్తి నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగుల పని తీరు ఆధారంగానే ప్రజలలో ప్రభుత్వం పట్ల స్పందన ఉంటుందని మంత్రి తెలిపారు.
నూతన ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలి
మంత్రి పొంగులేటి మాట్లాడుతూ పేదలకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతోపాటు భవిష్యత్తు ప్రణాళిక సిద్ధం చేసుకునే ఉద్దేశ్యంతో ప్రభుత్వం 99 రోజుల కార్యాచరణ చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమం ప్రతి గ్రామం, పట్టణానికి చేరువ చేసేందుకు అనుసరించాల్సిన విధానంపై చర్చించేందుకు ఉమ్మడి జిల్లాస్థాయిలో సన్నాహక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టల్స్ కు తహసిల్దార్ కేడర్ కు తగ్గకుండా ఒక అధికారిని ఇన్‌చార్జి గా నియమించాలని, వీరు ప్రతి వారానికి ఒకసారి వెళ్లి అక్కడ భోజనం నాణ్యత పరిశీలించాలని, ఏదైనా తప్పు జరిగితే సంబంధిత అధికారి బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. గ్రౌండింగ్ కాని ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు ఆసక్తి లేని పక్షంలో అదే గ్రామంలో మరో లబ్ధిదారునికి కేటాయించాలని, మార్చి చివరి వరకు మొదటి విడత మంజూరు చేసిన ప్రతి ఇల్లు గ్రౌండ్ కావాలన్నారు. 12న ఉమ్మడి జిల్లా పరిధిలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలన్నారు. రెవెన్యూ, అటవీ శాఖల మధ్య ఉన్న భూ సమస్యలు జాయింట్ సర్వే ద్వారా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీలకు పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయని, వీటిని సమర్థవంతంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని, నిధుల వినియోగంపై పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతోపాటు వ్యవసాయ రంగంలో చాలా అంశాల పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు మాట్లాడుతూ పాఠశాల కరికులంలో క్రీడలు ఒక భాగంగా మారాలని సూచించారు. జిల్లాలో నిర్మించే డ్రైయిన్స్ అలైన్‌మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల కొత్త సమస్యలు వస్తున్నాయని, క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ కషనర్ అభిషేక్ అగస్త్య, భద్రాచలం ఐటిడిఎ పీవో బి.రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, డిఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, జెడ్పీ సిఈఓ దీక్షా రైనా, వివిధ శాఖల ఉమ్మడి జిల్లా అధికారులు, మునిసిపల్ చైర్ పర్సన్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




