– విద్యార్థుల చదువులకు ఇబ్బంది రాకూడదు
– గురుకుల భవనాలకు మరమ్మతులు చేపట్టాలి
– అధికారులను ఆదేశించిన మంత్రి అడ్లూరి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ఆ దిశగా సంక్షేమ శాఖలో చేపట్టాల్సిన ప్రధాన కార్యక్రమాలను ప్రాధాన్యతా క్రమంలో అమలు చేయాలని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఆయన నేతృత్వంలో గురువారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాల్లో విద్యా వ్యవస్థను పటిష్టం చేసి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి అధికారులు సమాయత్తం కావాలని సూచించారు. ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్న గురుకులాలకు తక్షణం కొత్త భవనాల నిర్మాణం, పాత భవనాలకు మేజర్, మైనర్ మరమ్మలు చేయాలని ఆదేశించారు. తాత్కాలిక అలాగే దీర్ఘకాలిక మైన ప్రణాళికలతో ముందుకెళ్లాలని సూచించారు. విద్యార్థుల చదువులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రభుత్వం డైట్ చార్జీలను పెంచిందని, విద్యార్థుల భవిష్యత్తు భద్రతకు ఇది ఒక ముందడుగని గుర్తుచేశారు. పరిపాలనలో ఎటువంటి గ్యాప్ లేకుండా సమర్థవంతంగా అమలు జరగాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ నిధుల విషయంలో చురుకుగా అనుసంధానం చేయాలని సూచించారు. డ్రాప్‌అవుట్ రేటు తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, మెంటర్‌షిప్, కౌన్సెలింగ్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. అధిక ఫలితాలు సాధించిన గురుకులాలను మోడల్ ఇన్‌స్టిట్యూట్లుగా అభివృద్ధి చేసి, ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలపాలన్నారు. విద్యార్థుల స్కిల్ డెవలప్‌మెంట్, డిజిటల్ లెర్నింగ్, టెక్నాలజీ యాక్సెస్ పై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఉన్నత విద్య, జాతీయ ప్రవేశ పరీక్షల కోసం ప్రత్యేక కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులకు క్రీడలు, సాంస్కృతిక, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు సమగ్రంగా అందేలా చూడాలన్నారు. దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ లకు ప్రత్యేక సదుపాయాలు కల్పించి, వారి అవసరాలను దృష్టిలో ఉంచి విధానాలు అమలు చేయాలని ఆదేశించారు. సంక్షేమ కార్పొరేషన్లు చేపట్టిన పథకాలను పేద ప్రజలకు సులభంగా చేరేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
సాంకేతికతను వినియోగించి (డిజిటల్ మానిటరింగ్, ఆన్‌లైన్ గ్రీవెన్స్) పారదర్శకతను పెంచాలని సూచించారు. సమాజంలోని ప్రతి వర్గానికీ సమాన అవకాశాలు లభించేలా సంక్షేమ విధానాలను సమగ్రంగా అమలు చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్లు, అధికారులు కూడా పలు నిర్మాణాత్మక సూచనలు చేశారు. సమావేశంలో సూచించిన సలహాలు నిర్మాణాత్మమైన అంశాలను క్రోడీకరించి ఒక నివేదిక రూపంలో సమర్పించి మరిన్నీ నిధులను సమకూర్చుకునేందుకు త్వరలోముఖ్యమంత్రికి సమగ్రమైన నివేదికను సమర్పించనున్నట్లు మంత్రి తెలిపారు. సమావేశాన్ని శాఖ ప్రత్యేక కార్యదర్శి సబ్యసాచి ఘోష్ పర్యవేక్షించారు. సమీక్షలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ శాఖల ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, ముఖ్యమంత్రి ఓఎస్డి వేముల శ్రీనివాస్, ఎస్సీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాష్, మహిళల, దివ్యాంగుల సీనియర్ సిటిజన్ శాఖ ప్రత్యేక కార్యదర్శి అనితా రామచంద్రన్, ఎస్‌సీడీడీ కమిషనర్ క్షితిజ, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండి. క్రాంతి వెస్లీ, ఎస్సీ గురుకుల కార్యదర్శి కృష్ణా ఆదిత్య, గిరిజన గురుకుల కార్యదర్శి సీతాలక్ష్మి, దివ్యాంగుల శాఖ డైరెక్టర్ శైలజ, మైనార్టీ గురుకుల కార్యదర్శి షఫియుల్లా, క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ దీపక్ జాన్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబెదుల్లా కొత్వాల్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, ట్రై కార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, గిరిజన కో ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కే.తిరుపతి, వికలాంగుల సమాఖ్య చైర్మన్ ముత్తినేని వీరయ్య, టీజీఎండబ్ల్యుఆర్ ఈఐఎస్ వైస్ ప్రెసిడెంట్ అండ్ చైర్మెన్ మహమ్మద్ ఖురేషి, ఉర్దూ అకాడమీ అధ్యక్షులు తాహిర్ బిన్ హమదన్, వక్ఫ్ బోర్డు చైర్మన్ తారీక్ అన్సారీ, హజ్ కమిటీ చైర్మన్ సయ్యద్ హజమతుల్లా హుస్సేని తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





