Handloom weavers : చేనేతల సంక్షేమంలో మనమే ఫస్ట్‌

– జాతీయ చేనేత దినోత్సవంలో మంత్రి తుమ్మల
– పీపుల్స్‌ ప్లాజాలో ఎగ్జిబిషన్‌ ప్రారంభం
– బాపూజీ పురస్కారాలకు ఎంపికైన నేతన్నలకు అభినందన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 7: చేనేత కార్మికుల (handloom weavers) సంక్షేమం, అభివృద్ధిలో మన రాష్ట్రమే మొదటి స్థానంలో ఉందని, జియో ట్యాగింగ్‌లో కూడా మనమే ముందున్నామని చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) చెప్పారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్బంగా నెక్లెస్‌ రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చేనేత అనేది ఉపాధి మార్గం మాత్రమే కాదు.. భారతీయ సంస్కృతికి ప్రతీక అని అన్నారు. ఇది తరతరాలుగా వారసత్వంగా అందిన హస్తకళ అని, ఈ కళను పరిరక్షించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు, వస్త్రానిచ్చే నేతన్నకు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం చేనేత రంగంలో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సంపాదించిందని, గద్వాల, నారాయణపేట, పోచంపల్లి ఇక్కత్‌, సిద్దిపేట గొల్లభామ, వరంగల్‌ దర్రీస్‌, కరీంనగర్‌ బెడ్‌షీట్లు వంటి ఉత్పత్తులు అంతర్జాతీయంగా పేరుగాంచాయని పేర్కొన్నారు. చేనేత ఉత్పత్తుల వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వ శాఖలు టెస్కో ద్వారానే వస్త్రాలను కొనుగోలు చేయాలనే ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ(ఐఐహెచ్‌టీ) ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తూ చేనేత కళను కొత్త తరం వరకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఈ సందర్భంగా త్రిలింగ పట్టు చీరలను, తెలంగాణ అథెంటిక్‌ వీవ్స్‌ లోగోను మంత్రి ఆవిష్కరించారు. చేనేత కార్మికులకు ఏ సమస్య వచ్చినా తమ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కొండా లక్ష్మణ్‌ బాపుజీ చేనేత పురస్కారానికి ఎంపికైన చేనేత కళాకారులను ఈ సందర్భంగా అభినందించారు. ఎగ్జిబిషన్‌లో వందకుపైగా స్టాల్స్‌ను ప్రారంభించి, వారు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. ముఖ్యంగా జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్‌లోని వస్త్రాలను, కొండా లక్ష్మణ్‌ బాపూజీ చేనేత అవార్డులకు ఎంపికైన వారు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించి వారిని అభినందించారు. జౌళి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌ మాట్లాడుతూ అంతరించినపోతున్న చేనేత కళలన్నింటికీి పునర్‌వైభవం తెచ్చేలా ప్రభుత్వం కృషిచేస్తున్నదన్నారు. చేనేత కార్మికుల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నదంటూ అందులో భాగంగా రెండేళ్ల కాల వ్యవధితో నేతన్న పొదుపు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. మరణించిన చేనేత కుటుంబానికి అండగా ఉండేలా నేతన్నకు భద్రత పథకం ద్వారా మరణించిన కుటుంబ నామినికి రూ.5 లక్షలు అందజేస్తున్నామన్నారు. మార్చి నెలలో ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా చేనేత రుణ మాఫీ కోసం రూ.33 కోట్లు విడుదల చేశామని, చేనేత కార్మికులకు సంవత్సరానికి రూ.18 వేలు, అనుబంధ కార్మికులకు రూ.6 వేలు వచ్చేలా నేతన్న భరోసా పథకాన్ని ప్రారంభింమని వివరించారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఐఐహెచ్‌టీని ప్రారంభించి 120 మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *