మేం చేయం.. మీరు చేయొద్దు!

– ఇదీ విప‌క్షాల వైఖ‌రి
– ప్ర‌తిదానికీ అడ్డుప‌డుతున్న కేటీఆర్‌
– ట్రంప్‌, ఎలాన్ మ‌స్క్ సంస్థ‌లు రాబోతున్నాయి
– న‌గ‌రాన్ని మంచిగ చేస్త‌మంటే ఒప్పుకోవ‌డంలేదు
– బుల్లెట్ ట్రైన్ హ‌బ్‌గా  శంషాబాద్‌
– ఇళ్లు కోల్పోతున్న‌వారిని ఆదుకుంటాం
– ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి
– కొత్వాల గూడ‌లో ఎకో హిల్స్ పార్క్ ప్రారంభం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 6: సినిమా షూటింగ్‌ల కోసం విదేశాలకు పోతున్నారు.. హైదరాబాద్ కంటే సుందరమైన నగరం దేశంలోనే లేదు.. మంచి ప్రభుత్వం ఉంటే ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చేసుకోవచ్చునని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కొత్వాలగూడలో ఎకో హిల్ పార్కును రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. అలాగే బుద్వేల్ లేఅవుట్‌తో కలిపే రేడియల్ రోడ్-2 ఇంటర్‌చేంజ్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు, వైఎస్‌ల హయాంలో నగరానికి కృష్ణా, గోదావరి నీళ్లు తీసుకొచ్చారు. నిజాం నవాబు ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యతో వరదల నివారణకు మూసీ నదిపైన నిర్మాణాలు చేపట్టారు. వికారాబాద్‌లో నిజాం నవాబు మెడిసిన్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ఉస్మానియా హాస్పిటల్, గోల్కొండ, అసెంబ్లీ వంటి చరిత్రాత్మక కట్టడాలు హైదరాబాద్‌లో ఉన్నాయి. ఇపుడు హైదరాబాద్ ఆక్రమణలు, చెత్తతో నిండిపోయింది. గొప్ప సుందరమైన నగరం హైదరాబాద్.. ఈ నగరాన్ని మంచిగా చేస్తానంటే వాళ్ళు ఒప్పుకోవడం లేదని ప్రతిపక్షాలనుద్దేశించి అన్నారు. మేము చేయలేదు.. నువ్వు చేయొద్దని అంటున్నారు.. వాళ్లకు ఫార్మ్‌హౌస్ లు వచ్చాయి.. అని వ్యాఖ్యానించారు.

కొత్త ప్రాజెక్టులు వచ్చినప్పుడు కొందరికి ఇబ్బంది ఉంటుంది

నగరాన్ని మంచిగా చేసుకోవడానికి మన ప్రజాప్రతినిధులను విదేశాలకు పంపాం. శంషాబాద్ విమానాశ్రయం కట్టే సమయంలో కొంత వ్యతిరేకత వచ్చింది.. కానీ ఇప్పుడు పెద్ద ఆస్తిగా మారింది అని ముఖ్యమంత్రి చెప్పారు. మూసీ మురికిలో బతకాలని ఎవరూ అనుకోరు.. శంషాబాద్ బుల్లెట్ ట్రైన్ హబ్‌గా మారబోతున్నది. బెంగళూరు, అమరావతి, చెన్నైకి ఇక్కడినుంచే బుల్లెట్ ట్రైన్ సౌకర్యం రాబోతున్నది.. కొత్త ప్రాజెక్టులు వచ్చినప్పుడు కొందరికి ఇబ్బంది ఉంటుంది.. వాళ్ళను అనాధలను చేయం.. భూమి, ఇల్లు కోల్పోతున్న వారిని ఆదుకుంటాం.. నిర్వాసితులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం.. ప్రపంచంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దుతాం.. ట్రంప్, ఎలాన్ మస్క్ లాంటి వాళ్ల సంస్థలు ఇక్కడికి రాబోతున్నాయి. ప్రపంచంతో పోటీపడేలా నగరాన్ని అభివృద్ధి చేస్తాం అని హామీ ఇచ్చారు. గొప్పగా అభివృద్ధి చేస్తుంటే కొందరు అడ్డుపడుతున్నారు.. అక్క చాలాకాలం మంత్రిగా పనిచేసింది.. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే వాళ్ళను వీళ్లను తీసుకొచ్చి విమర్శిస్తున్నది.. అక్క కుటుంబానికి 40 సంవత్సరాలు అండగా ఉన్న ప్రాంతం అభివృద్ధి జరుగుతుంటే అడ్డుకుంటున్నది.. ఏం చేసినా కేటీఆర్ అడ్డుపడుతున్నాడు.. అని అన్నారు. హైదరాబాద్‌లో మూసీ రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తాం. మూసీ పక్కన నైట్ ఎకనావిమీని ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తాం.. ఆ  నియోజకవర్గంలోనే ప్రభుత్వ స్థలాలను ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తాం. పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేశాం.. సన్న బియ్యం ఇస్తున్నాం.. ఇందిరమ్మ చీరల్లో ఆడబిడ్డలు పాలపిట్టల్లా మెరిసిపోతున్నారు.. ఈసారి ఇందిరమ్మ చీరలను మరో రంగులో ఇస్తాం అని చెప్పారు. 99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో శాసనమండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మల్లు రవి, శాసన సభ్యులు ప్రకాష్ గౌడ్, మల్‌రెడ్డి రంగారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, హెచఎండీఏ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎకో హిల్ పార్కును సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *