ఆరాంఘర్- జూపార్కు ఫ్లైఓవర్ ప్రారంభించిన సీఎం
హైదరాబాద్ అభివృద్ధికి ఎవరితో కలిసి పనిచేయడానికైనా తాము సిద్ధమని, అవసరమైతే ఎంఐఎంను కలుపుకుని ముందుకు వెళతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఆరాంఘర్-జూపార్క్ ఫ్లైఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ హయాంలో అతి పెద్ద ఫ్లైఓవర్ పీవీ ఎక్స్‌ప్రెస్ వే నిర్మించుకున్నామని, మళ్లీ ఇప్పుడు రెండో అతిపెద్ద ఫ్లై ఓవర్ నిర్మించుకుని మనకు మనమే పోటీ అని నిరూపించుకున్నామని చెప్పారు. అధికారంలోకి వొచ్చిన వెంటనే ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వెళ్తున్నామన్నారు. ఆనాడు నిజాం హయాంలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ను నిర్మించి హైదరాబాద్ తాగునీటి సమస్యను తీర్చారని తెలిపారు.
హైదరాబాద్ నగర అభివృద్ధికి మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవనం లాంటి ప్రాజెక్టులు చేపట్టాల్సిన అవసరం ఉందని, ఎన్నికల సమయంలోనే రాజకీయాలు, నగర అభివృద్ధిలో అందరినీ కలుపుకుని ముందుకు వెళతామన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు పూర్తయితే అభివృద్ధిలో తెలంగాణ మరింత ముందుకు వెళుతుందని, ఇది ఓల్డ్ సిటీ కాదు… ఒరిజినల్ సిటీ అని అన్నారు. మిరాలం ట్యాంక్‌పై కేబుల్ బ్రిడ్జి నిర్మించి పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
అభివృద్ధికి నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పనులు పూర్తి చేసే బాధ్యత ఇక్కడి ప్రజా ప్రతినిధులదేనని అన్నారు. త్వరలోనే గోషామహల్ లో ఉస్మానియా దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని, ఈ ఫ్లై ఓవర్ కు డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని సూచిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీలు అసదుద్దీన్ ఒవైసీ, అనిల్ కుమార్ యాదవ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్,ఇతర అధికారులు పాల్గొన్నారు.





