ఉగ్రవాదానికి తెగిస్తే గట్టిగా బుద్ది చెబుతాం

– ఆపరేషన్‌ ‌సిందూర్‌లో భూతల దాడులకు కూడా సిద్దపడ్డాం
– భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్‌ ‌సైనిక సంసిద్ధత
– షక్సాగామ్‌ ‌వ్యాలీ ఎప్పటికీ భారత్‌లో భాగమే
– మీడియా సమావేశంలో ఆర్మీ చీఫ్‌ ‌జనరల్‌ ఉపేంద్ర ద్వివేది

న్యూదిల్లీ, జనవరి 13: ఉగ్రవాదులు తెగిస్తే గట్టిగా బుద్ది చెబుతామని, ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌కొనసాగుతోందని, త్రివిధ దళాల సమన్వయానికి ఇది నిదర్శనమని ఆర్మీ చీఫ్‌ ‌జనరల్‌ ఉపేంద్ర ద్వివేది అన్నారు. దిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్‌ ‌సైనిక సంసిద్ధత దీనిద్వారా స్పష్టమైందని పేర్కొన్నారు. ఆపరేషన్‌ ‌సిందూర్‌ను చాలా కచ్చితత్వంతో అమలుచేశాం. 88 గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్‌లో మన సైనిక దళాలు అత్యంత సమర్థంగా పనిచేశాయి. ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేయగలిగాం. దాదాపు 100 మంది ఉగ్రవాదులను హతమార్చాం. ఆ సమయంలో పెద్దఎత్తున బలగాలను సరిహద్దులకు తరలించాం. పాకిస్థాన్‌ ‌చిన్న తప్పు చేసినా భూతల దాడులను ప్రారంభించేందుకు కూడా నాడు మేం పూర్తి సన్నద్ధంగా ఉన్నాం అని ఆర్మీ చీఫ్‌ ‌వివరించారు. అలాగే ఈశాన్య సరిహద్దులో పరిస్థితులు స్థిరంగానే ఉన్నాయని, అయితే అప్రమత్తంగా ఉండటం కీలకమని వెల్లడించారు. చైనా సరిహద్దులోని భద్రత గురించి మాట్లాడుతూ.. భారత మోహరింపులు బలంగా ఉన్నాయని చెప్పారు. భవిష్యత్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటామని పాకిస్థాన్‌కు పరోక్షంగా గట్టి హెచ్చరికలు చేశారు.

జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు సున్నితంగానే ఉన్నా ప్రస్తుతం అవి నియంత్రణలోనే ఉన్నాయన్నారు. ఇక వివాదాస్పద షక్సాగామ్‌ ‌వ్యాలీలోని ప్రాంతం తమ దేశంలో భాగమేనని చైనా చేసిన వాదనను భారత్‌ ‌మరోసారి తిప్పికొట్టింది. ఆ వ్యాలీ అప్పగింతకు సంబంధించి 1963లో పాకిస్థాన్‌, ‌చైనా మధ్య జరిగిన ఒప్పందం చట్టవిరుద్ధమని జనరల్‌ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. ఈ వివాదం పై స్పందించారు. ‘షక్సాగామ్‌ ‌వ్యాలీని చైనాకు అప్పగిస్తూ బీజింగ్‌తో పాకిస్థాన్‌ ‌చేసుకున్న ఒప్పందం చెల్లదు. ఆ ప్రాంతంలో జరిగే ఏ కార్యకలాపాలను మేం గుర్తించబోం. చైనా-పాక్‌ ఆర్థిక కారిడార్‌ ‌విషయానికొస్తే.. అది ఆ రెండు దేశాలు సంయుక్తంగా చేస్తోన్న చట్టవిరుద్ధమైన చర్యగానే మేం పరిగణిస్తాం‘ అని ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు. షక్సాగామ్‌ ‌వ్యాలీ ప్రాంతంలో చైనా చేపట్టిన అభివృద్ధి పనులపై ఈ నెల 9న భారత్‌ ‌తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ‘పాకిస్థాన్‌-‌చైనా  పేర్కొంటున్న 1963 నాటి సరిహద్దు ఒప్పందాన్ని మేం ఎప్పటికీ గుర్తించబోం. దీనిపై మా నిర్ణయంపై మారదు. షక్సాగామ్‌ ‌వ్యాలీ మా దేశంలో భాగమే అని స్పష్టం చేసింది. దీనిపై చైనా స్పందిస్తూ.. భారత్‌పై అక్కసు వెళ్లగక్కింది. ఆ ప్రాంతం తమ దేశంలో భాగమేనని, అక్కడ తాము చేపడుతున్న అభివృద్ధి పనులపై భారత్‌ అభ్యంతరం చెప్పడానికి అవకాశం లేదని పేర్కొంది. షక్సాగామ్‌ ‌వ్యాలీ కీలకమైన కారకోరమ్‌ ‌రహదారిలో ఉంది. స్వాత్రంత్యం రాగానే పాకిస్థాన్‌ ‌దీన్ని ఆక్రమించుకుంది. అనంతరం దీనికి చైనాకు ధారాదత్తం చేసింది. భారత్‌కు చెందిన ప్రాంతాన్ని ఆక్రమించుకుని మరొక దేశానికి ఇవ్వడం అంతర్జాతీయ చట్టాల ప్రకారం విరుద్ధం. ఈ వ్యాలీని బీజింగ్‌కు అప్పగించడం ద్వారా పాకిస్థాన్‌తో చైనాకు రహదారి సౌకర్యం ఏర్పడింది. దీని మీదుగానే చైనా-పాకిస్థాన్‌ ఆర్థిక నడవాను బీజింగ్‌ ‌నిర్మిస్తోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *