•భూసేకరణ, జీఎస్టీ ప్రభావంతో అంచనాలు పెరిగాయి
•నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17 : తుమ్మిడి హట్టి ప్రాజెక్టును పునః ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చిచెప్పారు. ఏప్రిల్ నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి మహారాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు అక్కడి నీటిపారుదల శాఖాధికారులతో సంప్రదింపులు జరుపనున్నట్లు ఆయన వెల్లడించారు సోమవారం రాష్ట్ర శాసనమండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు ఎం.కోదండరాం, జీవన్ రెడ్డి, తాతరావు, తీన్మార్ మల్లన్న తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతూ లెవల్స్ ను నిర్ణయించి తుమ్మిడి హట్టి ప్రాజెక్టుకు తుది రూపం ఇవ్వబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే నిధుల అంచనాలు పెరగడాన్నీ ఆయన వివరిస్తూ ఒరిజినల్ ప్రాథమిక ప్రాజెక్టు నివేదికలో డిస్ట్రిబ్యూటరీ నెట్ వర్కస్ కు అవసరమైన భూమి తాలూకు వివరాలు పొందుపరచకపోవడమే కారణమన్నారు. అంతే కాకుండా అదే ప్రాథమిక నివేదికలో విద్యుత్ సబ్ స్టేషన్లకు అవసరమైన నిధులు కలపక పోవడంతో పాటు జి.ఎస్.టి 4 శాతం నుంచి 8 శాతం పెరగడంతో అంచనాలు పెరిగాయని ఆయన తెలిపారు. ముందుగా రూపొందించిన ప్రాథమిక నివేదికలో 9,000 ఎకరాలు ఉండగా ప్రస్తుతం 18,000 వేల ఎకరాల భూసేకరణ అవసరం కావడంతో పెరిగిన అదనపు భూసేకరణ,విద్యుత్ సబ్ స్టేషన్లు, పెరిగిన జీఎస్టీతో 13,057 కోట్ల నుంచి 19,465 కోట్లకు అంచనాలు పెరిగాయన్నారు.
అదేవిధంగా సీతారామ ప్రాజెక్టు పురోగతిని వివరిస్తూ 114 కిలోమీటర్ల మెయిన్ కెనాల్ కు గాను ఇప్పటి వరకు 104 కిలో మీటర్లు పూర్తి అయ్యిందని,మూడు పంప్ హౌస్ ల నిర్మాణాలు పూర్తి అయ్యాయన్నారు. పాలేరు లింక్ కెనాల్ పనులను 32 శాతం అయ్యాయని,డిస్ట్రిబ్యూటర్ నెట్ వర్కస్ కు సంబంధించిన 8 ప్యాకేజీ లకు గాను 4 ప్యాకేజ్ పనులకు టెండర్లు పిలిచామని,మరో మూడు ప్యాకేజీ లకు ఆమోదం లభించిందన్నారు. రాజీవ్ లింక్ కెనాల్ 18 ఎల్.పూర్తి అయ్యిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుందని రెండేళ్ళ వ్యవధిలో పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించ నున్నట్లు ఆయన తెలిపారు. ధాన్యం కొనుగోలు అంశంపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ 2024-25 ఖరీఫ్ సీజన్ లో 156.20 లక్షల మేట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యిందని అందులో 53.93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. అందుకు గాను 12,511.76 కోట్లు చెల్లించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.





