భాజ‌ప్తా చెప్తున్నా.. హైదరాబాద్‌పై కాషాయ జెండా ఎగరేస్తాం

– ఒవైసీ ఆనందం కోసమే జీహెచఎంసీని ముక్కలు చేశారు
– రేవంత్ రెడ్డి పాలిట అదే మరణ శాసనం కాబోతోంది
– తొలిసారి కరీంనగర్ కార్పొరేషన్‌పై కాషాయ జెండా
– కరీంనగర్ ప్రజలకు వందనం చేస్తున్నా
– ఈ విజయం మహాశక్తి అమ్మవారికి అంకితం
– కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: కరీంనగర్‌లో బీజేపీ విజయంతో నగరం అంతటా కాషాయ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. కేంద్ర మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు అయిన బండి సంజయ్‌ను భుజంపై ఎత్తుకుని ఊరేగించారు. ‘ఈరోజు నాకు పట్టలేని సంతోషం ఉంది.. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కుమ్కక్కై ఎన్నో కుట్రలు చేశాయి.. ఓటుకు రూ.7 వేలు ఇచ్చాయి.. చివరకు బీజేపీ అభ్యర్థులు, నాయకులను ప్రలోభ పెట్టేందుకు అనేక కుట్రలు జరిగాయి.. పాచిక పారలేదు. అయినా సీఎం రేవంత్ రెడ్డి తన బడే భాయ్ ఎంఐఎం ఓవైసీ బ్రదర్స్‌ను పిలిచి రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మలేదు. కరీంనగర్ కార్పొరేషన్‌పై తొలిసారి కాషాయ జెండా ఎగరేసి రికార్డు సృష్టించాం’ అని సంజయ్ అన్నారు. కరీంనగర్ తీర్పు స్పూర్తితో భాజప్తా చెబుతున్నా.. హైదరాబాద్‌పై కాషాయ జెండా ఎగరేయబోతున్నాం అని అన్నారు. ఒవైసీ కళ్లల్లో ఆనందం చూసేందుకు రేవంత్ రెడ్డి జీహెచ్‌ఎంసీని మూడు ముక్కలు చేసి ఒక ముక్క ఒవైసీకి రాసిచ్చారని ఆరోపించారు. అదే రేవంత్ రెడ్డి పాలిట మరణ శాసనం కాబోతోందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌తోపాటు సైబరాబాద్, మల్కాజ్‌గిరి కార్పొరేషన్లపై కాషాయ జెండా ఎగరేయబోతున్నం.. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురు చూస్తున్నాం అని అన్నారు. మున్సిపల్ ఫలితాల అనంతరం మాజీ మేయర్ సునీల్ రావు, స్థానిక నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ కార్యకర్తలు కరీంనగర్ కార్పొరేషన్‌పై కాషాయ జెండాను ఎగరేయడం చాలా గొప్ప విషయం. ఈ అద్బుత అవకాశాన్ని అందించి మోదీ ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఒక లక్ష్యాన్ని ఎంచుకుని కలిసికట్టుగా పనిచేశాం. జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మార్గదర్శకత్వంలో మోదీ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాం. బండి సంజయ్ హిందుత్వమే మాట్లాడతారు.. అభివృద్ధిపై మాట్లాడరు.. కరీంనగర్‌కు నయాపైసా కూడా తేలేదంటూ పిచ్చి కూతలు కూసిన వాళ్లకు ఈ తీర్పు చెంపపెట్టు అన్నారు. కరీంనగర్ ప్రజలను ఆదుకునేది, అబివృద్ధి చేసేది మోదీ ప్రభుత్వమేనని నమ్మి ఆదరించారు. అయిదేళ్లలో కరీంనగర్ అభివృద్ధి ఏ విధంగా చేస్తామో చేతల్లో చూపిస్తాం.. కరీంనగర్ అభివృద్దికి రూ.1500 కోట్లు మోదీ ప్రభుత్వం ఖర్చు చేసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు నయాపైసా ఇవ్వలేదు. ప్రజలు బేరీజు వేసి ఆశీర్వదించారన్నారు.

33 30 సీట్లు గెలిచినం

ఇప్పుడు 30 సీట్లు గెలిచినం. కొన్ని కారణాలవల్ల మరో ముగ్గురికి టికెట్ ఇవ్వలేకపోయినా కాషాయ జెండా కప్పుకుని తిరిగి గెలిచారు. మరో ముగ్గురు ఇండిపెండెంట్లు వస్తున్నారు. అందరూ షాక్ తినేలా ఇతర పార్టీల్లో గెలిచిన అభ్యర్థులు కూడా బీజేపీలోకి రాబోతున్నరు. మాజీ మేయర్ సునీల్ రావుకు ఫోన్ చేసి బీజేపీకి మద్దతిస్తామని చెబుతున్నారు. వారందరి సహకారం తీసుకుంటాం.. అందరినీ కలుపుకుపోతాం అన్నారు. గతంలో ఏడు సీట్లున్న ఎంఐఎంను మూడు సీట్లకే పరిమితం చేశారు. ఎంఐఎం కార్యాలయ డివిజన్‌లో ఆ పార్టీని బద్దలు కొట్టినం. ఎంఐఎంకు ఆదరణ ఉన్న కాశ్మీర్ గడ్డ వంటి ప్రాంతాల్లోనూ బీజేపీ సత్తా చాటాం. గతంలో ఎంఐఎం బీజేపీ కార్యకర్తలపై దాడులు చేసింది. వాళ్ల షాపులను, ఇండ్లను ధ్వంసం చేసినా భయపడలేదు. ధైర్యంగా వాళ్లు పోరాడారు. ఇవాళ వారి పోరాటాలు, త్యాగాలు ఫలించాయి. మొత్తం 66 డివిజన్లలో సర్వే చేసి 56మంది పార్టీ కార్యకర్తలకే సీట్లు ఇచ్చినం. 33మంది గెలిచారు. 100 ఓట్ల తేడాతో మరో పదిమంది అభ్యర్థులు ఓడిపోయారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు నా హ్యాట్సాఫ్. బీజేపీ అభ్యర్థులను ఆదరించిన కరీంనగర్ ప్రజలకు హ్యాట్సాఫ్.. నేను మహాశక్తి అమ్మవారిని నమ్ముకున్న.. సేవ చేసే అవకాశం కల్పించాలని మొక్కుకున్నా.. ఆ తల్లి ఆశీర్వాదం ఈ గెలుపునకు ప్రధాన కారణం అని చెప్పారు. అమ్మవారి దయతో అవినీతి, అక్రమాలకు తావు లేకుండా కేంద్ర నిధులతో అభివృద్ధి చేసి చూపిస్తాం.. కరీంనగర్ కార్పొరేషన్‌ను ప్రక్షాళన చేస్తాం.. ప్రజల వద్దకే పాలనను తీసుకెళతాం.. పార్టీని నమ్ముకుని, నామినేషన్లను ఉపసంహరించుకుని పనిచేసిన వారికి భవిష్యత్తులో మంచి అవకాశాలిస్తామని బండి సంజయ్ చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *