– అందుకు ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతాం
– అసెంబ్లీలో కమిటీలు కూడా లేవు
– కాంగ్రెస్‌ది బుల్డోజర్ టాక్టిక్స్
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10: కాంగ్రెస్‌కు ఇప్పటికే సగం పదవీ కాలం అయిపోయిందని, హామీల అమలులో ప్రజలు ఇచ్చిన వ్యవధి అయిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆ పార్టీ హామీల అమలు వైఫల్యాన్ని, మోసాన్ని ఎండగట్టేందుకు ఈ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఓరియంటేషన్ సమావేశం మంగళవారం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, చేస్తున్న అరాచకాలపై అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించామని, పార్టీ సీనియర్ నేతలు మధుసూదనాచారి, బండ ప్రకాష్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి తదితరులు మాట్లాడారని చెప్పారు. ఈ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటినా అసెంబ్లీలో ఏ కమిటీలను వేయ లేదని, పబ్లిక్ అకౌంట్స్ కమిటీని తమ పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తికి ఇచ్చారని, సెలెక్ట్ కమిటీ లేదు.. స్టాండింగ్ కమిటీ లేదు.. పిటిషన్స్ కమిటీ లేదు., డెప్యూటీ స్పీకర్ కూడా శాసనసభలో లేరు.. కేవలం అనివార్యంగా శాసనసభ సమావేశాలను నడిపించాలి కాబట్టి ప్రభుత్వం బలవంతంగా నడిపిస్తున్నది అని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ బుల్డోజర్లతో ఇళ్లను కూలగొడుతున్న తీరుగానే శాసనసభలోనూ మంద బలంతో బుల్డోజర్ టాక్టిక్స్‌ను ప్రయోగిస్తున్నదన్నారు. శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో అబద్ధాలను, అసత్యాలను మాట్లాడుతూ అంకెలను తారుమారు చేస్తూ సమావేశాలను తూతూమంత్రంగా నిర్వహిస్తున్నదని ఆరోపించారు. ఆరు గ్యారెంటీలకు మొదటి కేబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకొని చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.. కానీ రెండున్నరేళ్ల తర్వాత కూడా చట్టబద్ధత పక్కనపెట్టి కనీసం అమలు కూడా చేయడం లేదు.. అందుకే ఈ సమావేశాల్లో ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును తమ పార్టీ తరపున తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం అని తెలిపారు. ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాహుల్ గాంధీకి రూ.వెయ్యి కోట్లు ఇస్తామని చెప్తున్న రేవంత్ రెడ్డి రైతన్నలకు ఇవ్వాల్సిన రైతు బంధును మాత్రం పక్కనపెట్టాడన్నారు. ఖమ్మంలో ప్రభుత్వ దాష్టీకం వల్ల ఇళ్లు కోల్పోయిన వెలుగుమట్ల బాధితుల తరపున, మూసీ బాధితుల తరపున, పేద దళిత గిరిజన ప్రజల కోసం ఈ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. అంకెల గారడీని, లేని అప్పులను ఉన్నవిగా చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ అబద్ధాలను అంకెలతో ఎండగట్టాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు. శాసనమండలి, శాసనసభ మధ్య తమ పార్టీ సమన్వయం కోసం మరిన్ని కార్యక్రమాలు చేసుకొని ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల, 420 హామీల అమలుకు, రైతన్నల, మహిళల, విద్యార్థులకు ఇచ్చిన హామీలకు డబ్బులు లేవని చెప్తున్నది.. వీటన్నింటినీ పక్కనపెట్టి మూసీ పేరుతో అవినీతి కార్యక్రమానికి తెరలేపింది.. అందుకే దాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన చేయడం లేదు.. కేవలం దిల్లీకి డబ్బులు పంపేందుకే మూసీ ప్రాజెక్టును చేపడుతున్నాడు.. తాము మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు, మూసీలో జరిగే రూ.లక్షల కోట్ల అవినీతికి వ్యతిరేకం.. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌ను జీరో వాల్యూ చేయడం కాదు.. అసలు జీరో వాల్యూ ఎవరికైనా ఉన్నది అంటే అది రేవంత్ రెడ్డికేనని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియదు.. తాను తీసుకున్న నిర్ణయాలు కూడా తనకే తెలియదని చెప్తున్నాడు. డే ఎకానమీని నాశనం చేసిన వ్యక్తి నైట్ ఎకానమీ గురించి మాట్లాడుతున్నాడు.. రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. అని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా రాహుల్ బంధు పథకాన్ని పక్కనపెట్టి రైతు బంధు కార్యక్రమాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. రెండున్నరేళ్లలో ఒక్క ఇల్లు అయినా కాంగ్రెస్ పార్టీ కట్టింది అంటే తాను రాజీనామా చేస్తానని చెప్పాను.. దానికి ఇంకా కట్టుబడి ఉన్నాను.. తాము కట్టిన ఫ్లైఓవర్లు, ఇళ్లు, ప్రాజెక్టులకు రంగులు పూసి తమవి అని కాంగ్రెస్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడని కేటీఆర్ విమర్శించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





