– ఫోరెన్సిక్ ఆడిట్‌తో సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో అక్రమాల గుర్తింపు
– త్వరలో 31 జిల్లాల్లో కూడా ఫోరెన్సిక్ ఆడిట్
– ధరణి పోర్టల్ లొసుగుల వల్లే రిజిస్ట్రేషన్లలో అక్రమాలు
– 9 జిల్లాల్లోని 35 మండలాల్లో 48 మందిపై క్రిమినల్ కేసులు
– మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 24: ధరణి పోర్టల్లోని లొసుగులను ఆసరాగా చేసుకొని ప్రభుత్వ భూములను కొల్లగొట్టినవారిని, రిజిస్ట్రేషన్ల చలానా సొమ్మును కాజేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ధరణి పోర్టల్ను అడ్డుపెట్టుకొని గత ప్రభుత్వంలోని పెద్దలు ప్రభుత్వ భూములను కాజేశారని, దీనిపై సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థతో పైలట్ కింద ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించా రని ఇందులో అనేక అవినీతి అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక నివేదికలో స్పష్టమైందన్నారు. ఈ ఫోరెన్సిక్ నివేదికను పరిశీలించిన తర్వాత మిగిలిన 31 జిల్లాల్లో కూడా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహి స్తామని ప్రకటించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో ధరణి పోర్టల్ను అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడిన సంఘటనలపై ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీతో మంత్రి పొంగులేటి శనివారం సమావేశం నిర్వహించారు. విచారణలో ఎదురైన అంశాలు, ఎవరి పాత్ర ఎంత? తెరవెనుక ఎవరైనా ఉన్నారా? రెవెన్యూ అధికారుల పాత్ర ఏమైనా ఉందా? వంటి అంశాలపై కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కమిటీ ప్రాథమిక నివేదికను పరిశీలించి మరికొన్ని సలహాలు సూచనలు చేస్తూ మరింత లోతైన విచారణ జరిపి తుది నివేదికను సమర్పించాలని సూచించారు. ధరణి పోర్టల్ ప్రారంభమైనప్పటినుంచి 35 లక్షల లావాదేవీలు జరిగాయని, ప్రాథమికంగా 4,848 లావాదేవీల్లో లోటుపాట్లు జరిగినట్లు గుర్తించామని, విచారణ తర్వాత 1109 డాక్యుమెంట్లకు సంబంధించి సుమారు రూ.4 కోట్లు ప్రభుత్వానికి చెల్లింపు జరగలేదని కమిటీ సభ్యులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాటి ప్రభుత్వం అనాలోచితంగా ఎలాంటి ముందుచూపు లేకుండా కుట్రపూరితంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్ లోని లొసుగులను ఆసరాగా చేసుకొని కొంతమంది అక్రమాలకు పాల్పడితే భూభారతి పోర్టల్ ద్వారా ఆడిట్ నిర్వహించి అక్రమాలను గుర్తించి తక్షణమే ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టామని తెలిపారు. ఇందుకు సంబంధించి తొమ్మిది జిల్లాల్లోని 35 మండలాల్లో అక్రమాలకు పాల్పడిన 48 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. వాస్తవ పరిస్దితి ఇలా ఉంటే ప్రతిపక్షంలో ఉన్న ఓ నాయకుడు వెయ్యి కోట్ల అవినీతి అని, మరో నాయకుడు పది వేల కోట్లు అని ఇంకొక్కరు భూభారతి పోర్టల్ అవినీతిమయమని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇప్పటికే మొదటి విడతలో నాలుగు వేల మంది శిక్షణ పొందిన సర్వేయర్లకు లైసెన్స్‌లు జారీ చేయగా ఆదివారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ లో మరో రెండు వేల మందికి లైసెన్స్‌లు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. లైసెన్స్‌డ్ సర్వేయర్లతో రాష్ట్రంలో నక్షా లేని 373 గ్రామాల్లో రీసర్వే నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, ఇంటిలిజెన్స్ అదనపు డిజి విజయ్‌కుమార్ ,ఉన్నతస్ధాయి కమిటీ సభ్యులు డిఐజీ ఎమ్. సుభాషిని, సిఎమ్ఆర్‌వో మకరంద్, ఎసీబీ ఎస్పీ సింధు శర్మ, సైబర్ క్రైమ్ డిఎస్పీ ఎ. సంపత్, ఎన్ఐసి ప్రతినిధి శ్రీనివాస్ , హోంశాఖ సలహాదారు పి. శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్ వి మతిలేని మాటలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ మాట్లాడుతున్న భాష సరిగా లేదని, మతి లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికలు వ్యక్తిగతంగా తాను రిఫరెండంగా భావిస్తున్నానని అన్నారు. ఇప్పటికే రెండు సార్లు కేటీఆర్ రిఫరెండం అన్నారు. మళ్లీ ఇప్పుడు రిఫరెండం అంటున్నారు. ఇంతకుముందు జరిగిందే ఈ ఎన్నికల్లో జరుగుతుంది. ఆనాడు సోయి లేకుండా ఇష్టం వచ్చినట్లు జిల్లాలను ఏర్పాటు చేసి ఇప్పుడు అగ్నిగుండం చేస్తామని మతి లేని మాటలు మాట్లాడుతున్నారు. ప్రజాభిప్రాయానికనుగుణంగా శాస్త్రీయ పద్దతిలో ప్రజామోదంతో జిల్లాలను పునర్ వ్యవస్ధీకరిస్తామన్నారు. బట్ట కాల్చి మీద వేయడమే ప్రతిపక్ష పార్టీ పని అన్నట్లు ప్రధాన ప్రతిపక్షం వ్యవహరిస్తోంది. రెండేళ్ల పాలనలో ఏ తప్పు జరిగిందని మాట్లాడుతున్నారు. వారి పాలనలో అక్రమాలు జరిగినట్లు ఇప్పుడు కూడా అలాగే జరుగుతున్నాయని భ్రమపడుతున్నారు. ఇంకా అధికారంలో ఉన్నట్లు వారి వ్యవహార శైలి ఉంది. అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





