– అంగన్‌వాడీలకు సరకుల సరఫరాలో జాప్యాన్ని సహించం
– జిల్లాలవారీగా మంత్రి సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 18: అంగన్‌వాడీలకు సరకుల సరఫరాలో జరుగుతున్న జాప్యంపై మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కారణాలు చెప్పకండి.. అంగన్‌వాడీ చిన్నారుల కోసం కోడి గుడ్లు పది రోజులకు ఒకసారి తప్పనిసరిగా సరఫరా కావాలి. సాకులు చెప్పి జాప్యం చేస్తే కాంట్రాక్టులు రద్దు చేస్తాం అని హెచ్చరించారు. వెంగళరావు నగర్‌లోని మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్‌లో అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న కోడిగుడ్లు, పప్పు, మంచి నూనె, పాలు వంటి సరుకులపై జిల్లాల వారీగా మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధికారులు, సరఫరాదారులు, మిల్క్ సప్లయర్లు పాల్గొన్నారు. కోడి గుడ్లు, సరుకుల సరఫరా పరిస్థితులు, జాప్యాలు, నాణ్యత సమస్యలు వంటి అంశాలపై ఆమె సమగ్రంగా చర్చించారు. చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన, నిర్దిష్ట సైజు గుడ్లను సరఫరా చేయడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. చిన్న గుడ్లు, నాసిరకం గుడ్ల సరఫరా మహా పాపం అని అన్నారు. నాణ్యమైన ఫుడ్ సప్లై ప్రభుత్వ లక్ష్యంమారుతున్న వాతావరణంలో గుడ్లు త్వరగా పాడవుతుండటంతో పది రోజులకొకసారి సరఫరాను తప్పనిసరి చేస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడి సిబ్బంది గుడ్ల నిల్వపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పిల్లల బరువు, ఎత్తు పెరగడానికి నాణ్యమైన ఆహారం అందించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. సరుకుల నాణ్యతలో లోపాలు కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. సంక్షేమ హాస్టల్స్‌తో కలిపి సరఫరా చేయడం వల్ల సమన్వయం కుదరక ఇబ్బందులు వస్తున్నాయని, కొన్ని సందర్భాల్లో అంగన్‌వాడి కేంద్రాలకు కేటాయించిన గుడ్లను హాస్టల్ నిర్వాహకులు ఒత్తిడి చేసి తీసుకుంటున్నారని గుడ్ల సరఫరాదారులు తమ సమస్యలను వివరించారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూస్తానని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. అంగన్‌వాడి కేంద్రాలకు సరఫరా అయ్యే జిలకర, ఆవాలు, పసుపు, ఉప్పు, కారం పొడి, చింతపండు వంటి వస్తువుల నాణ్యత ఆశించిన స్థాయిలో లేకపోవడాన్ని తీవ్రంగా పరిగణించారు. నాసిరకం వస్తువులు ఇస్తే అస్సలు సహించం అని ఆమె హెచ్చరించారు. ప్రభుత్వ సంస్థ ఆయిల్ ఫెడ్‌కు సరుకుల కాంట్రాక్టు ఇచ్చినా నాణ్యతపరంగా ఆశించిన ఫలితాలు రాలేదన్నారు. ఆయిల్ ఫెడ్ నేరుగా రైతులు, మహిళా సంఘాల నుంచి సరకులు పొందాలని, లేదంటే అంగన్‌వాడి కేంద్రాలకు వస్తువుల సరఫరా కాంట్రాక్టులను నేరుగా మహిళా సంఘాలకు ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇది మీకు చివరి అవకాశం. నాసిరకం వస్తువులు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో శాఖ కార్యదర్శి అనితారామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా, టీజీ ఫుడ్స్ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





