చర్చిద్దామంటే దిల్లీ పోయిండు

సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్‌ ధ్వజం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 8: నోటికొచ్చిన హామీలు, 420 హామీలు ఇచ్చి వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు అని డైలాగులు కొట్టి 18 నెలలుగా రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులను, కోట్లాది కుటుంబాలను కాంగ్రెస్‌ దగా చేసిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల అమలుకు మాది గ్యారంటీ అని బాండ్‌ పేపర్‌ మీద రాసి గద్దెనెక్కి 18 నెలల తర్వాత కూడా ఒక్కటంటే ఒక్క హామీని కూడా రేవంత్‌ రెడ్డి నెరవేర్చలేకపోయాడని విరుచుకుపడ్డారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతాంగానికి, యువతకు ఎవరేం చేశారో తేల్చుకుందాం రమ్మని ముఖ్యమంత్రి సవాల్‌ విసిరితే స్వీకరించి నేను వచ్చాను… బేసిన్‌ నాలెడ్జి లేని రేవంత్‌ రెడ్డికి బేసిక్‌ నాలెడ్జి లేదని తెలిసినా కూడా ముఖ్యమంత్రి ముచ్చట పడుతున్నాడు కదా అని సవాల్‌ను స్వీకరించి 72 గంటల టైం ప్రిపరేషన్‌ కోసం ఇచ్చి రమ్మన్నాను.. 8 తేదీన 11 గంటలకు ప్రెస్‌క్లబ్‌కు వస్తాం.. మీడియా సాక్షిగా, ప్రజల సాక్షిగా చర్చిద్దామంటే ఇవాళ రేవంత్‌ రాకుండా ఢల్లీికి పోయిండు అని ఎద్దేవా చేశారు. ఒకవేళ ముఖ్యమంత్రి రాలేకపోతే ఆయన తరపున బాధ్యత గల ఉప ముఖ్యమంత్రి గాని, వ్యవసాయ మంత్రి గానీ, లేదంటే ఇంకెవరైనా మంత్రులను పంపుతారని అనుకున్నా.. అయితే రేవంత్‌కు రచ్చ చేయడమే వచ్చు కానీ చర్చ చేయడం రాదని ఇవాళ తేలిపోయింది అని వ్యాఖ్యానించారు.
రేవంత్‌ రెడ్డికి బేసిన్‌ల గురించి కూడా బేసిక్‌ నాలెడ్జ్‌ లేదు.. ఏ ప్రాజెక్టు ఏ బేసిన్‌లో ఉంది అని ఇరిగేషన్‌ అధికారులను ఒక చిన్న పిల్లాడు అడిగినట్లు అడుగుతుంటే ఇతనా మనకు న్యాయం చేసేదని రాష్ట్రంలోని రైతులు బాధపడుతున్నారన్నారు. రైతులకు సున్నం పెడుతూ, మోసం చేస్తూ తన గురువు చంద్రబాబుకు కృష్ణా గోదావరి నీళ్లను పంపిస్తున్నాడు.. కింద గోదావరిలో బనకచర్ల కడుతుంటే పచ్చ జెండా ఊపుతున్నడు.. పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా నీళ్లను దొంగ చాటుగా తీసుకెళ్తుంటే కళ్ళు మూసుకొని చంద్రబాబు చెప్పినట్టు కోవర్టు పాలన సాగిస్తున్నాడని తెలిపారు. నీళ్లేమో ఆంధ్రకు పోతున్నాయి.. నిధులు ఢల్లీికి పోతున్నాయి అని ఆరోపించారు. రాష్ట్రంలోని ఏ వర్గానికీ రేవంత్‌రెడ్డి మేలు చేయలేదు.. రైతు భరోసాలోని డొల్లతనాన్ని చెబుదామని అధికారిక సమాచారంతో వచ్చా.. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గంలో రైతు భరోసా రాని 670 మంది రైతుల పేర్లు, అడ్రస్సులు, ఫోన్‌ నెంబర్లతో వచ్చాను.. రాష్ట్రంలో రుణమాఫీ కానీ లక్షల మంది వివరాలతో జాబితా తీసుకొచ్చాను.. రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వ్యవసాయం చేయలేక ఆత్మహత్యలు చేసుకున్న 670 మంది రైతుల వివరాల మా దగ్గర ఉన్నాయి.. బోనస్‌ రాక పంటలు అమ్ముకునే దిక్కు లేక ప్రభుత్వం కొనక మిల్లర్లకు అమ్ముకొని నష్టపోయిన రైతుల జాబితాను తీసుకొచ్చానని కేటీఆర్‌ చెప్పారు. ఎరువులు, విత్తనాల కోసం లైన్లో నిలబడే ఆనాటి రోజులను కాంగ్రెస్‌ ప్రభుత్వం మళ్లీ తీసుకొచ్చిందన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే అక్రమ కేసులు, అణచివేతలు, నిర్బంధాలు అని ప్రజలు తెలుసుకున్నారన్నారు. మార్పు అంటే ఇంత దారుణంగా ఉంటుందా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. అందుకే రేవంత్‌ రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి చాలా బిజీగా ఉంటారు.. అందుకే ఆయనకు మరొక అవకాశం ఇస్తున్నాను.. ప్లేసు, డేటు ,టైము మీరు డిసైడ్‌ చేయండి. జూబ్లీహిల్స్‌ ప్యాలెస్‌కు రమ్మంటే కూడా వస్తాం.. ఏ అంశంపై చర్చ పెట్టినా చర్చించడానికి కేసీఆర్‌ తయారుచేసిన గులాబీ దండు సైనికులం తయారుగా ఉన్నామని కేటీఆర్‌ చెప్పారు. కాగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చినంక ఆత్మహత్యలు చేసుకున్న 600 మంది అన్నదాతల కోసం బీఆర్‌ఎస్‌ నేతలు ఒక నిమిషం మౌనం పాటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *