అందరి సహకారంతో దిగ్విజయం
ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
భూపాలపల్లి, ప్రజాతంత్ర, మే 26 : సరస్వతి పుష్కరాలను ఛాలెంజ్‌గా తీసుకుని నిర్వహించామని విజయవంతంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నట్లు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. సోమవారం సాయంత్రం సరస్వతి ఘాట్ వద్ద దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 12 రోజుల నుండి పుష్కరాలకు వొచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాత్రదారులయ్యారని జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. రూ.40 కోట్లతో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పుష్కరాలకు ప్రాతినిధ్యం వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.15 నుంచి 26 వరకు జరిగిన పుష్కరాలకు ఈ ప్రాంత ప్రజలు ఆశీస్సులు అందించారని అభినందించారు. కలెక్టర్ రాహుల్ శర్మ పర్యవేక్షణలో జిల్లా యంత్రాంగం తక్కువ సమయంలో ముఖ్యమంత్రి ఆలోచన మేరకు చేసిన పుష్కరాలు దిగ్విజయమయ్యాయని తెలిపారు. వర్షం వల్ల అంతరాయం ఏర్పడినా భక్తులకు ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశారని అన్నారు.
గోదావరి, ప్రాణహిత, అంతరవాహిని సరస్వతి సంగమంలో మొట్ట మొదటిసారిగా పుష్కరాలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. సరస్వతి మాతా 17 అడుగులు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. దాదాపు 30 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు చేశారని, ఈ ప్రాంతానికి అన్ని లక్షల మంది ఎన్నడూ రాలేదని తెలిపారు. స్వచ్చంద సంస్థలు భక్తులకు తాగునీరు, అన్నదానం చేశారని అభినందించారు. రాబోవు గోదావరి పుష్కరాలను మరింత వైభవంగా జరుపుతామని అన్నారు. తెలంగాణ లో ఎపుడు ఇలాంటి కార్యక్రమాలు జరగలేదని తెలిపారు. కాశీ పండితులు. ప్రతి రోజు సరస్వతి నవరత్న మాలా కార్యక్రమం నిర్వహించారని తెలిపారు. మీడియా ద్వారా లక్షలాది. మంది భక్తులు వచ్చేలా ప్రచారం చేశారని, టివి ఛానళ్లు ద్వారా వీక్షించే అవకాశం కల్పించారని అభినందించారు. శాఖల సమన్వయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బ్రహ్మణోత్తములు ప్రతి రోజు వేద మంత్రాలు వల్లించారని అభినందించారు. పుణ్య స్నానాలు సంవత్సరం పాటు చేసేందుకు అవకాశం ఉందని, రాలేని భక్తులు సంవత్సర కాలంలో ఎపుడైనా పుష్కర స్నానాలు చేయొచ్చని తెలిపారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ సరస్వతి పుష్కరాల నిర్వహణ కోసం అహర్నిశలు కృషిచేసిన అధికారులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చాలా తక్కువ సమయంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ప్రత్యేక చొరవతో ముందస్తు ప్రణాళికల ద్వారా అధికారులకు సూచనలు జారీ చేస్తూ సలహాలు తీసుకుంటూ అందుకు అనుగుణంగా సరస్వతి పుష్కరాలు విజయవంతానికి కృషి చేశారని అభినందించారు. ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్ మాట్లాడుతూ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణం చిన్న గ్రామం అని ఈ గ్రామంలో ఇంత గొప్ప మహా సరస్వతీ పుష్కరాలు నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. సరస్వతి పుష్కరాలు మొదటి 12 రోజులు ఆది ఆరంభమని, సంవత్సర కాలం పొడవున ఈ సరస్వతీ పుష్కరాలు కొనసాగుతాయని అన్నారు. కార్యక్రమంలో పద్మశ్రీ నాగఫణి శర్మ, ఆర్ అండ్ బి ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజ్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, మదన్ మోహన్, మక్కన్ సింగ్, ట్రేడ్ ప్రమోషన్ ఛైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే తదితరులు పాల్గొన్నారు.



