జీవన్‌రెడ్డిని అన్ని విధాలా ఆదరించాం

– గతంలో కేసీఆర్ పాలనను విమర్శించింది మరిస్తే ఎలా
– మీడియాతో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9 : మాజీ మంత్రి జీవన్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్న సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ చాలా చేసిందని ప్రస్తావించారు. ఆయనకు ఉన్నతమైన గౌరవం ఇచ్చిందన్నారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ 14సార్లు బీ ఫాం ఇచ్చిందని గుర్తుచేశారు. గురువారం గాంధీ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రజలు ఎన్నుకున్న నేత సీఎం రేవంత్‌రెడ్డి అని వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి పోవాలి.. మార్పు రావాలి అనడానికి జీవన్ రెడ్డి ఎవరు అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో జరిగిన అవినీతి గురించి అనేకసార్లు జీవన్ రెడ్డి విమర్శించారని మహేశ్ కుమార్ గౌడ్ ప్రస్తావించారు. వాటిని మరచి ఇవాళ కేసీఆర్‌ను పొగుడుతూ మాట్లాడడం సరికాదన్నారు. ఆయనకు ఇష్టం లేకపోతే చేసేదేమీ లేదని, కానీ విమర్శలకు కూడా ఓ హద్దు ఉండాలని అన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై వస్తున్న ఆరోపణలపై మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడారు. పొంగులేటి అవినీతిపై ఆధారాలు ఉంటే చర్చకు రావాలని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. ఆధారాలు చూపిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆధారాలు ఉంటే పట్టుకొని గాంధీ భవన్‌లో చర్చకు రావాలని సవాల్ విసిరారు. బట్ట కాల్చి  మీద వేస్తామంటే కుదరదని హెచ్చరించారు. కేసీఆర్ హయాంలోని పదేళ్లలో అప్పటి మంత్రులు చాలా దోచుకున్నారని ఆరోపించారు. జేబులు నింపుకొని ఈరోజు తమ మంత్రులపై విమర్శలు చేస్తారా అని ఆగ్రహించారు. ఆనాటి దోపిడీ గురించి కేసీఆర్ కూతురు కవితే చెబుతోందన్నారు. కేసీఆర్ హయాంలో నాసిరకం ప్రాజెక్టులు కట్టి డబ్బులు దోచుకున్నారని మహేశ్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *