రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 9: గత పదేళ్ల కాలంలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత వ్యవసాయం, రైతు సంక్షేమం కోసం రాష్ట్ర రౖౖెతు కమిషన్ ఏర్పాటు చేశారని, ములుగులో మల్లీ నేషనల్ కంపెనీల మోసాల నుంచి రైతులను రక్షించామని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. బీఆర్‌కే భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కమిషన్ ఏర్పాటయ్యాక రాష్ట్రంలో పర్యటించామని, ములుగులో మొక్కజొన్న విత్తనోత్పత్తిలో జరిగిన మోసాలు మీడియా ద్వారా వెలుగులోకొచ్చాయని, మల్టీనేషనల్ కంపెనీలు రైతులతో ఒప్పందం చేసుకుని విత్తనోత్పత్తి చేయిస్తుండగా నష్టపోయిన 671మంది రైతులకు నష్టపరిహారం కింద ఆ కంపెనీల రూ.4 కోట్లు ఇప్పించామని పేర్కొన్నారు. విత్తన కంపెనీల నుండి డబ్బు ఇప్పించిన దాఖలాలు ఇప్పటివరకు లేవని, దేశంలోనే మొదటిసారిగా నష్టపరిహారం ఇప్పించామని చెప్పారు. గతంలో కూడా పత్తి బీటీ విత్తనం విషయంలో కూడా ఇలాంటి ఘటన జగిందని, వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో పత్తికి విత్తన చట్టం తెచ్చామని గర్వంగా చెప్పగలుగుతామన్నారు. దేశంలో 60 శాతం విత్తనాలు పండిరచే రాష్ట్రం తెలంగాణ.. విత్తనోత్పత్తికి రాష్ట్రం అనువైన ప్రాంతం.. మొక్కజొన్న, వరి, పత్తి మూల విత్తనాలు రైతులకు ఇచ్చి పండిస్తారని, పండిరచిన ఆ విత్తనాలు ప్రపంచం నలుమూలకు వెళ్తాయని తెలిపారు. పంజాబ్‌లో రైతు, రైతు కూలీలకు మాత్రమే కమిషన్ వుందికానీ వ్యవసాయం కమిషన్ పరిధిలోకి తేలేదని చెప్పారు. ఏడాదిన్నర కాలంలోనే ప్రభుత్వం రూ.లక్షా 4వేల కోట్లు ఖర్చు చేసిందని, రైతు కమిషన్ రైతులకు భరోసాగా పనిచేస్తున్నదని, ఆదర్శ రైతు వ్యవస్థ ప్రతి గ్రామంలో ఉండాలని భావిస్తున్నామని, సీఎం కూడా సానుకూలంగా స్పందించారని ఆయన చెప్పారు. ఆ రైతుకు ప్రభుత్వం గౌరవం ఇస్తది కానీ గౌరవ వేతనం ఉండదని చెప్పారు. ప్రభుత్వ పథకాలు ఆదర్శ రైతుల చేతుల మీదుగా రైతుల వద్దకు వెళ్లేలా చూస్తామన్నారు. మల్టీ నేషనల్ కంపెనీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నడూ రాజీపడలేదని, విత్తన కంపెనీలను కట్టడి చేయడానికి విత్తన చట్టం త్వరలో రాబోతోందని కోదండరెడ్డి తెలిపారు. కొన్ని చట్టాల విషయంలో కేంద్రం రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇవ్వాలని కోరారు. యూరియా, ఎరువుల పరిశ్రమలు కేంద్రం చేతుల్లో ఉన్నాయని, ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వడమే కాదు.. దానికి తగ్గట్టు ఆర్ధిక సాయం చేయాలని కేంద్రాన్ని కోరారు. జన్యు మార్పిడి అనేది ప్రపంచానికే ప్రమాదం.. దీనిపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా స్పందించారు.. బియ్యంలో జన్యుమార్పిడికి కేంద్రం అనుకూలంగా వ్యవహరిస్తుంటే దాన్ని వ్యతిరేకించాం, లేఖ రాశామని వివరించారు. రైతు కమిషన్ సభ్యుడు కేవిఎన్ రెడ్డి మాట్లాడుతూ యూరియా విషయంలో కేంద్రం తెలంగాణపై నిర్లక్ష్యం చూపుతోందని, రాష్ట్రానికి కావాల్సినంత యూరియాను కేంద్రం కేటాయించడం లేదన్నారు. రైతులు యూరియా వాడకం తగ్గించుకోవాలని మరో సభ్యుడు భవానీ రెడ్డి సూచించారు. రైతు కమిషన్ రైతులకు నిత్యం అందుబాటులో ఉంటుందన్నారు.



