– ఇంటర్ స్టేట్ రూల్స్‌కు వ్యతిరేకమని జీఆర్‌ఎంబీకి లేఖ రాశాం
– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 5: పోలవరం- నల్లమల్ల సాగర్ ప్రాజెక్టులను తాము అన్ని ఫోరమ్‌లలో వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావు చూపిస్తున్న లేఖ ఈ ప్రాజెక్టులకు సంబంధించినది కాదని క్లారిటీ ఇచ్చారు. పోలవరం- నల్లమల్ల ఇంటర్ స్టేట్ రూల్స్‌కు వ్యతిరేకమని జీఆర్‌ఎంబీకి తామే లేఖ రాశామని ప్రస్తావించారు. తమ అభిప్రాయాన్ని జీఆర్‌ఎంబీ కూడా సమర్థించిందని గుర్తుచేశారు. సోమవారం అసెంబ్లీ డియా పాయింట్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. పోలవరం- నల్లమల్ల ప్రాజెక్టును మహారాష్ట్ర, కర్ణాటక కూడా వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. సుప్రీంకోర్టులో తెలంగాణ వాదనలను బలంగా వినిపించాలని న్యాయవాది అభిషేక్ సింఘ్వీకి సూచించామని పేర్కొన్నారు. ఈ కేసును వచ్చే సోమవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసిందని తెలిపారు. రిట్ పిటిషన్‌లో కాదని.. సూట్ పిటిషన్‌లో రావాలని తమకు సుప్రీంకోర్టు సూచించిందని అన్నారు. ఈ కేసులో స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును వచ్చే సోమవారం కోరుతామని తెలిపారు. వచ్చే విచారణకు తాను కూడా ప్రత్యక్ష్యంగా హాజరవుతానని స్పష్టం చేశారు. ఒకటి, రెండు రోజుల్లో మరోసారి న్యాయవాదులతో సమావేశం అవుతామని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చాకే రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేశారని స్పష్టం చేశారు. గతంలో ఈ పథకం ఆగిపోయి ఉంటే బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎందుకు చెప్పలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. తమ ఒత్తిడి వల్లే ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ఆపేసిందని తేల్చిచెప్పారు. బీఆర్‌ఎస్ హయాంలో కృష్ణ- గోదావరి జలాల్లో తెలివి ఎక్కువ.. పని తక్కువ అని చెప్పుకొచ్చారు. అతి తెలివితో బీఆర్‌ఎస్ తెలంగాణకు భారీ నష్టం చేసిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో పాలమూరు – రంగారెడ్డిని జూరాల నుంచి శ్రీశైలానికి మార్చి, తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు కాళేశ్వరాన్ని మార్చి భారీ నష్టం చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





