ఉద్యోగాల సృష్టిక‌ర్త‌లుగా ఎద‌గాలి

– డిజిట‌ల్‌, మౌలిక స‌దుపాయాల్లో భార‌త్ అద్భుత ప్ర‌గ‌తి
– ఏఐతో ఉద్యోగాల‌కు ముప్పు
-కొలంబియా బిజినెస్ స్కూల్ చ‌ర్చా గోష్ఠిలో కేటీఆర్‌

న్యూయార్క్, ఏప్రిల్ 6: భారతీయ యువత కేవలం ఉద్యోగాల కోసం వెతికేవారుగా కాకుండా, పారిశ్రామికవేత్తలుగా మారి ఉద్యోగాలను సృష్టించేవారుగా ఎదగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక కొలంబియా యూనివర్సిటీలో నిర్వహించిన ‘ఫైర్‌సైడ్ చాట్’లో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారత్ ఆర్థిక గమనం, కృత్రిమ మేధ (ఏఐ), వ్యవస్థాపకత, మారుతున్న ఉద్యోగ రంగాలపై తన లోతైన విశ్లేషణలను విద్యార్థులతో పంచుకున్నారు. న్యూయార్క్ నగరంలోని కొలంబియా బిజినెస్ స్కూల్ వార్షిక సదస్సులో ప్రసంగించిన అనంతరం కేటీఆర్ ప్రత్యేక చ‌ర్చా గోష్ఠిలో పాల్గొన్నారు.ఐటి -పారిశ్రామిక రంగాలు, భారతదేశ ప్రగతి, నిరుద్యోగం, యువత, గెలుపు ఓటముల వంటి అనేక అంశాల పైన తన అభిప్రాయాలను కేటీఆర్ పంచుకున్నారు. గడిచిన దశాబ్ద కాలంలో భారత్ భౌతిక, డిజిటల్ మౌలిక సదుపాయాల రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించిందని కేటీఆర్ పేర్కొన్నారు. 3జీ, 4జీ, 5జీ వంటి టెలికాం సాంకేతికతలను భారత్ ప్రపంచ దేశాల కంటే ముందుగానే అందిపుచ్చుకుందని గుర్తుచేశారు. అయితే, ఇప్పుడు భారత్ ఒక కీలక దశలో ఉందని, ఇతర దేశాల అభివృద్ధి నమూనాలను యథాతథంగా కాపీ కొట్టే పరిస్థితి లేదని, మనం సొంతంగా వినూత్నంగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పెను మార్పులు తీసుకురాబోతోందని కేటీఆర్ హెచ్చరించారు. “ఏఐ వ‌ల్ల‌ రాబోయే రోజుల్లో మిలియన్ల కొద్దీ ఉద్యోగాలు ప్రభావితమవుతాయి. ఈ ముప్పు వాస్తవం మరియు చాలా దగ్గరలో ఉంది. ఈ మార్పును తట్టుకోవడానికి ప్రభుత్వాలు కానీ, సమాజం కానీ ఇంకా సిద్ధంగా లేవు,” అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విప్లవాన్ని తట్టుకోవాలంటే యువత నిరంతరం తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని , మారుతున్న కాలానికి అనుగుణంగా తమను తాము మలచుకోవాలని సూచించారు. తాజాగా ఒరాకిల్ సంస్థ భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించిన అంశాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
స్టార్టప్ వ్యవస్థ గురించి మాట్లాడుతూ, హైదరాబాద్‌ను ఒక ఉదాహరణగా కేటీఆర్ చూపారు. ఇంక్యుబేటర్లు, కో-వర్కింగ్ స్పేస్‌లు, మెంటార్ల ప్రోత్సాహం వల్లనే హైదరాబాద్ నుంచి అనేక ‘యూనికార్న్’ సంస్థలు పుట్టుకొచ్చాయని వివరించారు. దేశంలో వ్యవస్థాపకత పెరగాలంటే కేవలం పథకాలు ఉంటే సరిపోదని, ఒక పటిష్టమైన ‘ఎకో సిస్టమ్’ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.  భారతదేశంలో ఉన్న యువ జనాభా ఒక శక్తి అని, అయితే అదే సమయంలో అది ఒక సవాలు అని కేటీఆర్ పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలంటే కేవలం అవకాశాలు కల్పిస్తే సరిపోదని, సరైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయాలని చెప్పారు. మౌలిక సదుపాయాలు, క్లీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) ద్వారా అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చని సూచించారు.  పెద్దగా కలలు కనండి, చిన్న విజయాలకి ఎప్పుడూ సంతృప్తి చెందకండి అని పిలుపునిచ్చారు. జీవితంలో ఓటమికి భయపడవలసిన అవసరం లేదు అని, వైఫ‌ల్యం అనేది గెలుపు దిశగా సాగి ప్రయాణంలో ఒక భాగం మాత్రమే అని పూర్తి నింపారు. ఆత్మవిశ్వాసం, పట్టుదల, ధైర్యంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోండి అని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కొలంబియా యూనివర్సిటీ విద్యార్థులు, మేధావులు, ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేటీఆర్ పలు అంశాల పైన చెప్పిన అభిప్రాయాలు సభికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *