మన పరిస్థితులకు అవసరమైనవి స్వీకరించాలి

“బహిరంగ జీవితంలోకి వచ్చిన  ఉద్యమకారులు కూడా ఇలా ప్రజలను అనుసరించి సరికొత్త ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఇది ట్రాన్స్ ఫార్మేషన్ కాలం. ప్యారడైమ్ షిఫ్టు కాలం. వారి జీవితాలను ,వారు వారి అనుభవాలను పునరధ్యయనం చేసుకుంటారు. అందుకు వ్యవధినివ్వాలి. ఇలా అంతా అయిపోయింది అని అనుకోకూడదు. వారు మారుతారు. మన పరిస్థితులకు అవసరమైనది స్వీకరిస్తారు. భారత రాజ్యంగ మౌలిక లక్ష్యాల సాధనకు కృషి చేస్తారు.”
 – బి ఎస్ రాములు  సామాజిక తత్వవేత్త  మొబైల్  : 8331966987 

మన దేశ కాల పరిస్థితులకు అవసరమైనవి స్వీకరించాలి . మనది భారత రాజ్యాంగ  ఛాయలో ముందుకు సాగుతున్న ప్రజాస్వామ్య వ్యవస్థ. ఫ్రెంచి సోషలిజం వెలుగులో స్వేచ్ఛ సమానత్వం, సౌభ్రాతృత్వం, ఆత్మ గౌరవం, అందరికీ అవకాశాలు ప్రాతినిధ్యం అందించే ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్న శాంతియుత సహజీవన పరివర్తన జీవన విధానం కలిగిన రాజ్యాంగం. మార్క్సు, ఎంగెల్సు  ఫ్రెంచి సోషలిజం నుంచి స్పూర్తి పొందారు. కాని బహుళ పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థ కాదని, ఏక పార్టీ వ్యవస్థ , శ్రామిక నాయకత్వం లో సమాజం సాగాలని ఫ్రెంచి సోషలిస్టుల నుండి విడి పోయారు. ఫ్రెంచి సోషలిజం వేరు. మార్క్సు సోషలిజం వేరు. భారతదేశంలో ఫ్రెంచి సోషలిజాన్ని అనుసరించి దేశీయ అవగాహనతో ముందుకు సాగిన వారు రాం మనోహర్ లోహియా, లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ, జార్జి ఫెర్నాండెజ్, రాజ్ నారాయణ్, మధు దండావతే, మధు లిమయే, మొదలుకొని జనతా పార్టీ, జనతా దళ్, ములాయం సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్, రామ్ విలాస్ పాశ్వాన్, బిజూ పట్నాయక్, నితీష్ కుమార్ దాకా ఎందరో!  మార్క్సు , ఎంగెల్సు లను  అనసరించి సాగేవారు సిపిఐ, సిపిఐ యం, సిపిఐ ఎంఎల్, జనశక్తి, పీపుల్స్ వార్, చారు మజుందార్, కొండపల్లి సీతారామయ్య, మావోయిస్టులు, శిబ్దాస్ ఘోష్, తరిమెల నాగిరెడ్డి , పుచ్చపల్లి, రావి నారాయణ రెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, చండ్ర రాజేశ్వర రావు, ఓంకార్ , దాకా ఎందరో వందేళ్ల చరిత్ర.

మార్క్సు ఎంగెల్సు కూడా స్థల కాల దేశ పరిస్థితుల ననుసరించి ఎప్పటి కప్పుడు తమ అభిప్రాయాలు మార్చుకున్నారు. వారు ఫ్రెంచి సోషలిజం నుంచి, జర్మనీ నుంచి, ఇంగ్లాండు అనుభవాల నుండి తీసుకున్నారు. మనం కూడా ఇంకా అనేక సోర్సుల నుంచి తీసుకోవాలి. గుడ్డి వాడికి కావల్సింది రెండు కళ్లు. మనకు కావల్సింది ప్రజల శ్రేయస్సు, ప్రజలకు అధికారం. అందుకు ఎన్నో దారులు. ఎన్నో మార్గ దర్శకాలు. ఎన్నో సిద్ధాంతాలు గాంధీయిజం, అంబేడ్కరిజం, ఫ్రెంచి ప్రజాస్వామ్య సోషలిజం. ఏక పార్టీ వ్యవస్థ కోరే మార్క్సిజం. గాంధీయిజం, అంబేడ్కరిజం, బుద్దిజం, కాన్సీరాం శాంతియుత మార్గం. కార్య క్రమాలు కార్య కర్తలు ఎవరివి వారికి ప్రత్యేకం. ప్రజలందరూ ఉద్యమాలు చేయాలని కొందరు, పట్టణ కార్మిక వర్గమే పోరాటం చేసి అధికారంలోకి రావాలని కొందరు, బహుజన ఉద్యమాలని కొందరు, పల్లెల నుండి పట్టణాలకు ఎదిగే పోరాటాలు చేయాలని కొందరు. ఇలా రకరకాలు. అందులో ఎన్నో కష్టాలు త్యాగాలు, వైఫల్యాలుంటాయి. ప్రజల కోసం పని చేసి ఒరిగిన వారికి జోహార్లు అర్పిస్తారు. నిర్భంధాల, నియంతృత్వ ప్రభుత్వ చర్సలను ఖండిస్తారు. మానవ హక్కుల రక్షణకు ఉద్యమిస్తారు. మావోయిస్టు ఉద్యమాలపై. , త్యాగాల పై బహిరంగ జీవితంలోకి రావడంపై సానుభూతి లేశ మాత్రం లేకుండా “ పెట్టుబడిదారీ బూడిదలో పోసిన విప్లవ పన్నీరు “ అని రాసారు. అది సహృదయత కాదు. ఏ విప్లవం లోనైనా విజయం సాధించే దాకా త్యాగాలు. వైఫల్యాలే ఉంటాయి . ⁠త్యాగాలను విషాదాంత నాయకులు అని గౌరవిస్తారు. కీర్తిస్తారు. ఇది సార్వజనీనం. విషాదాంత ఉద్యమాలపై వీరు విరుచుకు పడడం కించ పరచడం సంస్కారం, సభ్యత కాదు.
     నిర్బంధాలు, ఎన్కౌంటర్లతో లక్ష మంది సైనికులతో మారణకాండ సాగిస్తూ మరోవైపు బహిరంగ జీవితం లోకి రావడానికి ప్రభుత్వం పెట్టిన పేరు “ లొంగుబాటు “. ఆ మాట ఉద్యమ కారులు , అభిమానులు, సానుభూతి పరులు, మేధావులు, మార్క్సిస్టులు వాడకూడదు. రంగ నాయకమ్మ కార్మిక వర్గం కాదు. పెటీ బూర్జువా రచయిత్రి. శ్రామిక జనాల గురించి కథలు నవలలు రాయడం చాత కాలేదు.. ⁠భగవద్గీత శ్లోకాల వలె తన వాదనకు, తన జీవిత ఆచరణకు అనువైన మార్క్సిస్టు మార్గ దర్శకాలను వల్లె వేస్తారు. పెటీ బూర్జువా జీవితం నుండి ఒక్క అడుగు ముందుకు సాగలేదు. తాను చేయనిది ఇతరులు చేయాలని చెప్పడం తనది కాకపోతే కాశీ దాకా డేకమంటారు. మోసే వారికి తెలుసు కావడి బరువు. మార్క్సు ఎంగెల్సు కూడా సమయానుకూలంగా అభిప్రాయాలు మార్చుకున్నారు. ప్యారిస్ కమ్యూన్ తిరుగుబాటును తొలుత వ్యతిరేకించారు. పడిపోయాక 72 రోజుల విప్లవ ప్రభుత్వం పడిపోయి అందరు చంపబడ్డాక ప్యారిస్ కమ్యూన్ ను తలకెత్తుకుని గుణపాఠాలు అంటూ సూత్రీకరించారు. సొంత సైన్యం ఏర్పాటు చేసుకోవాలి అన్నారు. ప్రజాస్వామ్య సోషలిస్టులు ఆ మాట అంగీకరించ లేదు. భారత దేశం, ప్రజాస్వామ్య సోషలిజం ు అనుసరించింది. గాంధీ దాన్ని ధర్మ కర్తృత్వ సిద్ధాంతం అన్నారు. సొంతంగా సాయుధ సైనిక నిర్మాణం అనే ఆలోచన తప్పు, ప్రజలను , సమస్త రంగాలను, సైన్యంతో సహా అందరినీ మన వైపు తిప్పుకోవాలి చెప్ప వచ్చు. అందుకని ఆ ఆలోచన సోషలిస్టులు మెచ్చ లేదు.
    1857లో ఇండియాలో సైన్యంతో సహా రాజులు, ఏకమై ఈస్టిండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసారు. దాన్ని మార్క్సు ఎంగెల్సులు ప్రథమ భారత స్వాతంత్ర పోరాటం అని కీర్తించారు. అదే మాట కమ్యూన్ గుణ పాఠాలలో ఇండియాలో వలె సైన్యాన్ని కూడా మనవైపు తిప్పుకోవాలి అని చెప్తే సరిపోయేది. ఎంత సైన్యం ఉన్నా ప్రజలు ఉద్యమిస్తే ఏం చేయలేరని బంగ్లాదేశ్ తాజా నిదర్శనం. సొంత సైన్యం తయారు చేసుకోవడం అనేది ప్రజాస్వామ్యం పూర్వ దశల ఆలోచన. , అది రాజరికాల యుద్ధ రీతులు. నియంతల రీతులు. హెగెల్ లాజిక్ ను అన్వయించి క్యాపిటల్ రాసారు. హెగెల్ నెగేషన్ , సబ్ లేషన్ రెండు చెప్పాడు. మార్క్స్ క్యాపిటల్ కు ఒకటే అనుసరించి విశ్లేషించాడు. హెగెల్ నెగేషన్ తో పాటు , పాతది ఉంటుంది, కొత్తది ఉంటుంది అనే ప్రకృతి మానవ సమాజ పరిణామాన్ని గురించి చెప్పిన సబ్ లేషన్ ను మార్క్సు వదిలేయడం వల్ల సమాజ పరిణాలకు భిన్నంగా పాతది మొత్తం పోతది అని నెగేషన్ అని సూత్రీకరించారు.. దాంతో సామరస్యంగా సాగే ప్రజా స్వామ్య సోషలిజం, బహుళ పార్టీ వ్యవస్థను, ఫ్రెంచి సోషలిస్టులను వ్యతిరేకించారు. ఏక పార్టీ వ్యవస్థ కావాలి అన్నారు. ఏక పార్టీ వ్యవస్థలు ఎలా మారాయో అందరికీ తెలుసు!
     పెట్టి బూర్జువాలు తాము చెప్పింది వింటే , తాము చెప్పినట్టు నడిస్తే కార్మిక వర్గ విప్లవం అంటారు. ⁠మార్క్సు ఎంగెల్స్ లెనిన్ మావో అందరూ పెటీ బూర్జువాల నుండి వచ్చిన వారే.! ఏ ఒక్కరూ శ్రామిక పర్గం నుంచి వచ్చిన వారు కాదు.ఎంగెల్స్ పారిశ్రామికవేత్త. శ్రామిక వర్గం పేరిట వారి త్యాగాలను ఆసరా చేసుకుని పెటీ బూర్జువాలు అధికారంలోకి రావడానికి , మార్క్సిజం, లెనినిజం తోడ్పడింది. ఉత్పత్తిలో పాల్గొనని వారు ఉత్పత్తి సంబంధాలను వర్ణిస్తారు. విశ్లేషిస్తారు. అంతా ఆర్థికమే నిర్ణయిస్తుందంటారు. అంతా ఆర్థికమే నిర్ణయిస్తే ఒకే కేడర్లో ఉన్న  కలెక్టర్లకు, మంత్రులకు, రాష్ట్రపతికి కుల వివక్ష ఉండ కూడదు.
కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థ ఉత్పత్తి సంబంధాలను, ఉత్పత్తిని , అదనపు విలువ పంపిణీని, ఉత్పత్తి పంపిణీ పై ఆధిపత్యాన్ని నిర్ణయించే రాజకీయ, ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక, వ్యవస్థీకృత నిర్మాణాలేవర్ణ వ్యవస్థ , కుల వ్యవస్థ నిర్మాణాలు అని క్యాపిటల్ లోని సూత్రాలతో విశ్లేషించాలి. అది జరగలేదు. మార్క్సిజంపై డిపెండెంట్ సైకాలజీ తో బతకడం అనివార్యం చేసింది. అందులోకి  సిద్ధాంత బలం గురుత్వాకర్షణ శక్తి, జడత్వ భ్రమణంగా పని చేస్తుంది. ఒక పట్టాన దాని నుండి బయటకు రాలేరు. అచ్చం పూజారి వ్యవస్థ వలెనే నాలుగు సూత్రాలు వల్లె వేస్తారు. కాపిటల్ లో చెప్పినారని వల్లె వేస్తారు గాని వాటిని వర్ణ కుల వ్యవస్థలకు, కుల వ్యవస్థ నిర్మిత గ్రామీణ స్వయం పోషక సంపూర్ణ ఆర్థిక వ్యవస్థ కు అన్వయించరు. వాటిని ఉత్పత్తి సంబంధాల మార్క్సిస్టు క్యాపిటల్ సూత్రాల వెలుగులో పరిశీలించరు. అయినా మార్క్సిజం, అర్థ శాస్త్రం తెలుసని భ్రమ పడుతుంటారు. దీన్నే సొంత అన్వయం చేయలేని డిపెండెన్సీ నాయకత్వం అంటారు. అందుకే రష్యాలో వాన పడితే ఇక్కడ గొడుగు పడతారనే విమర్శ పుట్టింది.
    విప్లవం ఏమీ సాధించ లేదన్నట్టు “పెట్టుబడిదారీ బూడిదలో పోసిన విప్లవ పన్నీరు “ అనడం పొరపాటు. ఈ దేశంలో సామాజిక పరిణామాలు ఎలా ఉండాలి  అని ప్రజలు నిర్ణయించుకుంటారు. మార్క్సిజం అయ్య గారు వచ్చే దాక అమాస ఆగదు. ప్రజలు అంది వచ్చిన వాటితో సాగుతారు. ఇండియాలో గాంధీని, సుభాష్ చంద్ర బోసు ను, అంబేడ్కర్ ను, జిన్నాను , నెహ్రూను అనుసరించారు. ఆదివాసులు బ్రిటిష్ వారికి , వ్యతిరేకంగా ఏ సిద్ధాంతాలు లేకుండా 169 తిరుగుబాట్లు చేసారు. అక్కడ చారు మజుందార్ వచ్చి హిత బోధ చేయలేదు. నిన్న గెలిచిన వారిని, నిన్న గెలిపించిన వారే నేడు ఓడిస్తారు. ప్రజలు. ప్రజల అవసరాలు, అవగాహన సమకాలీన పరిస్థితులను అనుసరించి సాగుతుంది. పార్టీలు సిద్ధాంతాలు పట్టుకుని సాగుతాయి. ప్రజలను ఆకట్టుకోవడానికి పార్టీలు ఎన్నికల ప్రణాళికలను సరికొత్తగా రూపొందించుకొని ప్రజల ముందుకు వస్తారు. బహిరంగ జీవితంలోకి వచ్చిన ఉద్యమకారులు కూడా ఇలా ప్రజలను అనుసరించి సరికొత్త ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఇది ట్రాన్స్ ఫార్మేషన్ కాలం. ప్యారడైమ్ షిఫ్టు కాలం. వారి జీవితాలను ,వారు వారి అనుభవాలను పునరధ్యయనం చేసుకుంటారు. అందుకు వ్యవధినివ్వాలి. ఇలా అంతా అయిపోయింది అని అనుకోకూడదు. వారు మారుతారు. మన పరిస్థితులకు అవసరమైనది స్వీకరిస్తారు. భారత రాజ్యంగ మౌలిక లక్ష్యాల సాధనకు కృషి చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *