– ‘ఆత్మనిర్భర్’ భారత్ లక్ష్యం కావాలి
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 21: ప్రపంచంలో భారతదేశం అగ్రస్థానంలో నిలవాలనే ఆలోచనతో అందరం ముందుకు సాగాలని, ప్రభుత్వాలు, ప్రజలు ఇదే దిశలో పనిచేయాలి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పిలుపునిచ్చారు. ఈ ఆలోచన నుంచే ఆత్మనిర్భర్ అభియాన్ కార్యక్రమం చేపట్టామన్నారు. పార్టీ రా ష్ట్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఆత్మనిర్భర్ కార్య్రకమంలో ఆయన మాట్లాడారు.గతంలో అమెరికాలోని ఒక చట్టం ద్వారా అమెరికా మన దేశానికి పిల్లల కోసం పాలు, పాల పొడి డబ్బాలు పంపిస్తే రష్యా నుంచి గోధుమలు, మందులు వచ్చేవి. అమెరికా-రష్యా వంటి దేశాలు మన దేశాన్ని ఒక బీద దేశంగా చూస్తూ సహాయం పంపేవి. ఒకప్పుడు మన దేశం కూడా కొన్ని ఆఫ్రికా దేశాలకు సాయం పంపుతున్నట్లే అప్పట్లో మనది మూడో ప్రపంచ దేశంగా, అభివృద్ది చెందుతున్న దేశంగా ఉండేదన్నారు. కాంగ్రెస్ పార్టీ 55 సంవత్సరాలు పాలించినా భారత్ ఎప్పుడూ స్వతహాగా నిలబడలేదని ఆరోపించారు. ఎప్పుడూ ఏదో ఒక దేశం సహకారంతోనే ముందుకు వెళ్లాల్సి వచ్చేదని, నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక పరిస్థితి మారిందని తెలిపారు. ఈ దేశం మన కాళ్ల మీద నిలబడాలి, ప్రపంచంలో ఆర్థికంగా బలమైన దేశం కావాలి, ఎవరిపైనా ఆధారపడకుండా ఆత్మనిర్భర్ భారత్‌గా ఎదగాలనే సంకల్పంతో ప్రధాని మోదీ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. అందుకే ఈరోజు భారత దేశం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని తెలిపారు. మనకు అవసరమైన వస్తువులను బయట దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే లక్షలాది, కోట్లాది రూపాయలు బయటకు వెళ్లిపోతాయి. మనమే ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తే ఆ సంపద దేశంలోనే ఉంటుందని పేర్కొన్నారు. మనది ఆత్మనిర్భర్ భారత్ కావాలి. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశం పూర్తిగా మారింది. గతంలో మన దేశం భిక్ష పెట్టుకుని విదేశాలకి వెళ్లేదని చెప్పేవారు. మన దేశంలో పౌష్టికాహారం లేక పిల్లలు చనిపోతున్నారు, కరువులు వస్తున్నాయి అనే ఘటనలు, మాటలు వింటుండేవాళ్లం. ఇప్పుడు మన ఫారెన్ ఎక్స్చేంజ్ భారీగా పెరిగింది. పెద్ద దేశాల దగ్గర డబ్బులు అడగాల్సిన అవసరం లేకుండా మనం 56 దేశాలకు మన నిధులు అప్పుగా ఇస్తున్నాం. మన ఎగుమతులు కూడా పెరిగాయి. .ప్రపంచంలో చాలా దేశాలు ఇప్పుడు భారతీయ వస్తువులను తీసుకుంటున్నాయి. డిఫెన్స్, సైన్స్, ఫార్మసీ.. ఏ రంగంలోనూ మనం ఇకపై ఏ దేశం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మన లక్ష్యం ఇప్పుడు మొదటి స్థానం.. విశ్వ గురువు భారత్‌గా నిలవాలి.. ఆ దిశగా మనం ప్రయాణిస్తున్నాం అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





