– ములుగు అభివృద్ధిపై మంత్రి సీతక్క సవాల్
– 105 గ్రామాల్లో 85మందికి పైగా కాంగ్రెస్ సర్పంచ్‌లు
– కార్యకర్తలకే ఈ విజయం అంకితం
– బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పై మంత్రి సీతక్క ఆగ్రహం
ములుగు, ప్రజాతంత్ర, డిసెంబర్ 16: బీఆర్ఎస్ పది సంవత్సరాల్లో చేయలేని అభివృద్ధిని, ప్రజా ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే చేసి చూపించిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంతి్ర దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. ములుగు అభివృద్ధిపై ఎవరైనా చర్చకు రావాలంటే తాము సిద్ధమేనని సవాల్ విసిరారు. ములుగు డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, ఇతర నాయకులతో కలిసి ములుగులో ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ములుగు ప్రజల ఆశీర్వాదంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఓ ఆదివాసీ బిడ్డ బాధ్యతలు చేపట్టడాన్ని బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. ప్రజల మధ్య ఉండే వారికి పెద్ద బాధ్యతలు అప్పగిస్తే ఓర్వలేకపోవడమే వారి అసహనానికి కారణమన్నారు. ములుగు అభివృద్ది విషయంలో బీఆర్ఎస్ లాగా తాము కాగితాల మీద జీవోలిచ్చి చేతులు దులుపుకోవడం లేదని, అభివృద్దిని ఆచరణలో చేసి చూపిస్తున్నామని స్పష్టం చేశారు. జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేయడం, ములుగును మున్సిపాలిటీగా అభివృద్ధి చేయడం, మల్లంపల్లి మండలం ఏర్పాటు చేయడం వంటి కీలక నిర్ణయాలను ప్రజా ప్రభుత్వం అమలు చేసిందని గుర్తు చేశారు. నియోజకవర్గ అభివృద్దిని సహించలేక పాకాల కొత్తగూడెంలో తలపెట్టిన 30 పడకల హాస్పిటల్ ఏర్పాటును బీఆర్ఎస్ అడ్డుకుంటోందని మండిపడ్డారు. రెండు విడతలు జరిగిన పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడం పట్ల పంచాయతీరాజ్ యంత్రాంగానికి, జిల్లా అధికారులు, కలెక్టర్లు, పోలీసు సిబ్బంది సహా ఎన్నికల నిర్వహణలో కష్టపడ్డ ప్రతి అధికారికీ మంత్రి సీతక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్దులు 62 శాతం స్థానాల్లో విజయం సాధించారని పేర్కొన్నారు. నూతన సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డు మెంబర్లకు శుభాకాంక్షలు తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే నిర్ణయం వల్ల రెండేళ్లుగా సుమారు రూ.3వేల కోట్ల నిధులు ఆగిపోయాయని, మార్చి లోపు ఎన్నికలు జరిగితే పూర్తిస్థాయి నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని మంత్రి వివరించారు. నియోజకవర్గంలో 105 గ్రామాల్లో 85కి పైగా కాంగ్రెస్ అభ్యర్థులు సర్పంచ్ లుగా గెలుపొందారని వెల్లడించారు. నాలుగుచోట్ల కాంగ్రెస్ రెబల్స్ కూడా గెలిచారని తెలిపారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్ధుల కోసం కృషి చేసిన కార్యకర్తలకు ఈ విజయం అంకితమన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఆ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ సొంత గ్రామం దేవగిరిపట్నంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందని మంత్రి సీతక్క తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



