చర్చకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధమే

కేటీఆర్‌కు స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం భట్టి

మహబూబాబాద్‌, ప్రజాతంత్ర, జులై 8: కృష్ణా, గోదావరి బేసిన్లపై శాసనసభలో చర్చించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం స్ధింగా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ లెక్కలు తీసుకొని అసెంబ్లీకి వస్తే చర్చిద్దాం అన్నారు. సిఎం రేవంత్‌ రెడ్డి ఒకరికి సవాల్‌ విసిరితే మరొకరు బయటకు వచ్చారని ఎద్దేవా చేశారు. అసత్యాలు మానకపోతే బీఆర్‌ఎస్‌కు ‘స్థానిక’ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావు అని అన్నారు. మహబూబాద్‌ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన అనంతరం సోమల తండాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం ప్రసంగించారు. ఈనెల 12 నుంచి రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ చేయనున్నామంటూ వడ్డీ లేని రుణాలతో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దుతామన్నారు. గత ప్రభుత్వం కన్నా రెండు వేల మెగావాట్లు అత్యధికంగా విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని, రెప్పపాటు అంతరాయం లేకుండా రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా జరుగుతోందని, రౖౖెతుల సంక్షేమం కోసం ఒక్క ఏడాదిలోనే రూ.70 వేల కోట్లు ప్రజా ప్రభుత్వం ఖర్చు చేసిందని వివరించారు. లక్ష కోట్లు ఖర్చుపెట్టి కాళేశ్వరం కట్టి పది ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని, వాస్తవాలు బయటికి వస్తున్నాయని బీఆర్‌ఎస్‌ నేతలు అవాకులు, చవాకులు పేలుతున్నారన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డికి బేసిన్‌ల గురించి తెలియదని బీఆర్‌ఎస్‌ నేతలు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు.. ఆయనకు బేసిన్ల గురించి తెలియకపోతే కృష్ణా, గోదావరి బేసిన్‌ నీళ్లను ఈ రాష్ట్ర అవసరాల కోసమే వాడాలని ప్రజాభవన్‌లో మొన్న పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌తో అందరికీ ఎలా వివరిస్తారని డిప్యూటీ సీఎం అన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో నీళ్ల విషయంలో ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని రేవంత్‌ రెడ్డి ఆధారాలతో సహా చూపించారన్నారు. బేసిన్లు లేవు.. భేషజాలు లేవన్నారు. రాష్ట్రం ఏమైనా పర్వాలేదు..కృష్ణా, గోదావరి నీళ్లు వాడుకోండని పెద్దమనిషి నాటి సీఎం కేసిఆర్‌ ఆంధ్రప్రదేశ్‌లో ప్రకటన చేసిన విషయాన్ని వీడియోలతో సహా సీఎం రేవంత్‌ రెడ్డి ప్రజాభవన్‌లో చూపించారని తెలిపారు. కృష్ణా, గోదావరికి బేసిన్‌ ప్రాజెక్టుల్లో నీళ్ల గురించి లెక్కలతో సహా చర్చించడానికి సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం శాసనసభలో చర్చించడానికి సిద్ధంగా ఉందని సీఎం రేవంత్‌ రెడ్డి ఇప్పటికే చెప్పారు.. అదే విషయాన్ని మరోసారి చెబుతున్నాను.. పెద్ద మనిషి కేసీఆర్‌ చర్చకు రావాలని మరోసారి సవాల్‌ విసురుతున్నామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *