– మూసీ పునరుజ్జీవంపై బీజేపీ చీఫ్ రామచందర్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: మూసీపై పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ పట్ల బీజేపీకి ఎలాంటి అభ్యంతరం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు స్పష్టం చేశారు. మూసీ నది పునరుజ్జీవాన్ని బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకించలేదన్నారు. మూసీ నది హైదరాబాద్ నగరం నుంచి కృష్ణానదిలో కలిసే వరకు పరిశుభ్రంగా ఉండాలని, అందులో స్వచ్ఛమైన నీరు ప్రవహించాలని, ఆ నీరు రైతులకు సాగునీటిగా ఉపయోగపడాలని బీజేపీ స్పష్టంగా కోరుకుంటోందని తెలిపారు. అయితే ఈ అంశంపై కాంగ్రెస్ నాయకులు పదేపదే తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి అయినా, మంత్రి పొన్నం ప్రభాకర్ అయినా బీజేపీపై రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారని, కానీ మూసీ విషయంలో బీజేపీ వైఖరి మాత్రం మొదటి నుంచీ ఒకటే.. స్పష్టంగా చెబుతోందని అన్నారు. మూసీ నది తప్పకుండా పునరుజ్జీవం కావాలని ఇప్పటికీ చెబుతున్నామని, కానీ గాంధీ సరోవర్ పేరుతో అక్కడ నివసిస్తున్న పేద, మధ్యతరగతి కుటుంబాల ఇళ్లను కూల్చడం అంగీకారయోగ్యం కాదని స్పష్టం చేశారు. మధుబన్ పార్క్, విఘ్నేశ్వర్ కాలనీ వంటి ప్రాంతాల్లో చట్టబద్ధంగా నిర్మించిన ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదని, ఇళ్లను కూల్చకుండా కూడా మూసీని శుద్ధి చేయవచ్చని అన్నారు. సబర్మతి నదిని ఉదాహరణగా చెప్పేవారు అసలు అక్కడ ప్రాజెక్టు ఎలా జరిగిందో తెలుసుకోవాలని సూచించారు. ఒకప్పుడు సబర్మతి కూడా మూసీలా కాలుష్యంతో, దుర్వాసనతో ఉండేదని గుర్తుచేశారు. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నర్మదా నది నుంచి నీటిని సబర్మతికి మళ్లించి నదుల అనుసంధానం చేసి ముందుగా నదిని శుభ్రపరిచారని చెప్పారు. అక్కడ నివసిస్తున్న సేŸTమారు నాలుగు వేల కుటుంబాలకు ప్రత్యామ్నాయ గృహాలు ఇచ్చిన తర్వాతే అభివృద్ధి పనులు చేపట్టారని, ప్రజల జీవితం దెబ్బతినకుండా జరిగేదే నిజమైన అభివృద్ధి అని అన్నారు. అభివృద్ధి పేరుతో పేద, మధ్యతరగతి ప్రజల ఇళ్లు కూల్చడం అన్యాయం అన్నారు. గాంధీ సరోవర్ కోసం భూమి అవసరమైతే ప్రాజెక్టును రియలైన్ చేసుకోవచ్చని సూచించారు. ఒక్క ఇల్లు కూడా దెబ్బతినకుండా ప్రణాళిక రూపొందించాలన్నారు. గాంధీ విగ్రహం నిర్మించాలనుకుంటే వెయ్యి అడుగులైనా, రెండువేల అడుగులైనా ఆకాశాన్ని తాకేలా నిర్మించొచ్చని, అందుకు బీజేపీకి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. ముందుగా మూసీని శుద్ధి చేసి ఆ తర్వాత అభివృద్ధి పనులు చేపట్టాలని, దానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. దేశంలో గ్యాస్, ఆయిల్, డీజిల్, పెట్రోల్ దొరకవని ప్రజల్లో భయం సృష్టించడం పూర్తిగా బాధ్యతారాహిత్యమన్నారు. రాహుల్ గాంధీ వంటి కాంగ్రెస్ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. ప్రపంచంలో యుద్ధాలు, ఉద్రిక్తతలు ఉన్నప్పుడు వాటి ప్రభావం ప్రపంచవ్యాప్తంగా, భారత దేశంపైనా ఉంటుందని, కానీ ఆ పేరుతో దేశంలో కొరత వస్తుందని భయాందోళనలు సృష్టించడం సరికాదని ఆయన హితవు పలికారు. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, ప్రధాని నరేంద్ర మోదీలు సంబంధిత దేశాల నాయకులతో మాట్లాడి చమురు, గ్యాస్ సరఫరాలు హర్ముజ్ జలసంధి ద్వారా అంతరాయం లేకుండా దేశానికి చేరేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. భారతదేశం ఒకే ప్రాంతంపై ఆధారపడదని, దాదాపు 40 శాతం ముడి చమురు ఇతర దేశాల నుంచీ వస్తోందని చెప్పారు. అందువల్ల దేశంలో గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్, డీజిల్ కొరత ఉండవన్నారు. యుద్ధ పరిస్థితుల వల్ల రవాణాలో స్వల్ప ఆలస్యాలు ఉండొచ్చు కానీ ఇంధన కొరత మాత్రం ఉండదని స్పష్టం చేశారు. ప్రపంచంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా భారత ప్రజలు వాటిని ఎదుర్కొనే శక్తి కలిగినవారని చెప్పారు. ఈ సమయంలో నాయకులు ప్రజల్లో ధైర్యం నింపాలి తప్ప భయాందోళనలు కలిగించడం తగదన్నారు. దేశంలో గృహ వినియోగ గ్యాస్ సరఫరాలో ఎలాంటి కొరత ఉండదని ప్రధాని ఇప్పటికే స్పష్టం చేశారని, సాధారణ ప్రజలకు ఇంధన సరఫరా నిరంతరం కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని చెప్పారు. వాస్తవాలు తెలుసుకోకుండా ప్రజల్లో భయాందోళనలు కలిగించే వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని రామచందర్‌రావు అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



