‌ప్రజల మద్దతుతో పాలన సాగిస్తున్నాం

– అందరి మద్దతుతోనే గెలిచాం
– మాటలు, మూటలతో గెలిచి రాలేదు
– మా వద్ద ఎలాంటి అక్రమ సంపాదనా లేదు
– వర్గీకరణ కోసం చేసిన పోరాటానికి మద్దతుగా నిలిచా
– సీఎం రేవంత్‌రెడ్డి
– మాదిగ ఎంప్లాయీస్‌ ‌సమన్వయ కమిటీ సమావేశం

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 6: చిత్తశుద్ధితో ప్రజాసమస్యలు పరిష్కరిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి తెలిపారు. ప్రజాపాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ ‌శిల్పకళావేదికలో మాదిగ ఉద్యోగుల‌ ‌సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిలుగా సీఎం రేవంత్‌ ‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్‌ ‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పుడున్నది మీరంతా కోరుకున్న ప్రభుత్వమని తెలిపారు. ఇది మీరంతా కష్టపడి తెచ్చుకున్న ప్రభుత్వమన్నారు. ఎన్నికల్లో మీరంతా తమకు అండగా నిలబడ్డారని, మార్పు కోసమే ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని గుర్తు చేశారు. తమది పేదల పక్షపాత ప్రభుత్వమని సీఎం రేవంత్‌ ‌రెడ్డి అభివర్ణించారు. గత పాలకులు ఎన్నో అక్రమాలు చేశారని ఆరోపించారు. గత ఎన్నికల్లో తాము మాటలు, మూటలతో గెలవలేదని, కేవలం ప్రజల మద్దతుతోనే తాము అధికారంలోకి వచ్చామని చెప్పారు. తమ వద్ద ఎలాంటి అక్రమ సంపాదన లేదన్నారు. వర్గీకరణ కోసం మాదిగ జాతి ఎంతో పోరాడిందని రేవంత్‌ ‌గుర్తు చేశారు. ఈ పోరాటంలో కొందరు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 20 ఏళ్ల నుంచీ వర్గీకరణ సమస్య ఉందన్నారు. న్యాయమైన హక్కు కోసం మొదటినుంచీ మద్దతుగా ఉన్నానని తెలిపారు. వర్గీకరణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి సైతం పంపామని వివరించారు. మిత్రుడి కోసం కొన ఊపిరి వరకు కర్ణుడు నిలబడ్డాడని చెప్పారు. కర్ణుడి మాదిరిగా మిత్రధర్మానికి కట్టుబడి మాదిగల వెంట నిలబడ్డామని సీఎం రేవంత్‌ ‌పేర్కొన్నారు. వర్గీకరణ అంశంలో మాదిగల వైపు న్యాయం ఉందన్నారు. అందుకే ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వైపే నిలబడ్డామని ఆయన స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత వర్గీకరణ కోసం ప్రకటన చేసిన తొలి రాష్ట్రం తెలంగాణనేనని గుర్తు చేశారు. తమ ప్రభుత్వానికి బ్రాండ్‌ అం‌బాసిడర్లు ప్రభుత్వ ఉద్యోగులేనని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాతే అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చామన్నారు. ప్రగతి ప్రణాళికలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఉద్యోగులకు సీఎం హితవు పలికారు. ఆర్థిక సమస్యలు ఉన్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వం వద్ద పంచడానికి భూములు లేవన్నారు.ప్రభుత్వ ఆర్థిక వెసులుబాటు అంతంత మాత్రంగానే ఉందని సీఎం తెలిపారు. మాదిగలకు మెరుగైన విద్య అందించాలన్నదే తమ ఆలోచన అని పేర్కొన్నారు. ప్రక్షాళన చేసేందుకే విద్యాశాఖను తన వద్ద పెట్టుకున్నానని సీఎం రేవంత్‌ ‌రెడ్డి వివరించారు. గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం బర్రెలు, గొర్రెలు, చేపలు ఇచ్చిందని గుర్తు చేశారు. ఇవన్నీ మనకు తెలియవా?.. వీళ్లు కొత్తగా ఇచ్చిందేంటి అంటూ మండిపడ్డారు. మనం బర్రెలు, గొర్రెలు కాచుకోవాలా.. వాళ్ల పిల్లలు రాజ్యం ఏలుతారా అంటూ ఆ పార్టీ నేతలను సీఎం రేవంత్‌ ‌సూటిగా ప్రశ్నించారు. కార్యక్రమంలో కడియం శ్రీహరి, ఎంపి కడియం కావ్య, దామోదర రాజనర్సింహ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *