– రూ.162.57 కోట్లు కేటాయింపు
– మున్నేరు వరద నీరు సద్వినియోగం
– 40 ఎకరాల ఎన్.ఎస్.పి. ఆయకట్టుకు నీటి భద్రత
– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 17: సహజ వనరులను వినియోగించడం ద్వారా వరద ప్రమాదాలను నివారించడంతోపాటు ఖమ్మం, సూర్యాపేట,మహబూబాబాద్ జిల్లాలకు సమృద్ధిగా సాగు నీరు అందించేందుకే ప్రభుత్వం మున్నేరు-పాలేరు లింక్ పథకం నిర్మాణం చేపట్టిందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.162.57 కోట్లు కేటాయించిందని తెలిపారు. మున్నేరు-పాలేరు లింక్ కాలువ పొడుగు 9.6 కి.మీ కాగా ఇది సెకనుకు 4,500 క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని తట్టుకునేలా రూపొందించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టు పూర్తి అయితే ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలో 1.38 లక్షల ఎకరాలకు నీటి స్థిరీకరణతోపాటు పాలేరు రిజర్వాయర్ ఎగువ భాగంలోని 40 ఎకరాల ఎన్.ఎస్.పి ఆయకట్టుకు నీటి భద్రత లభిస్తుందని వెల్లడించారు. మున్నేరు నది నుంచి ఏటా వచ్చే వరద నీటిని సద్వినియోగం చేసుకోవడంతోపాటు వృధాగా పోతున్న సుమారు 50 టీఎంసీల నీటితో ఈ ప్రాజెక్టు నిర్మణానికి ప్రభుత్వం అంకురార్పణ చేసిందన్నారు. ఇప్పటివరకు ఈ నీరు వృధాగా సముద్రంలో కలుస్తున్నదని, వృధాను అరికట్టడంతోపాటు ఆ నీటిని సద్వినియోగం చేసుకోవడమే ప్రభుత్వ సంకల్పమన్నారు. దానికితోడు ఖమ్మం జిల్లాలో మున్నేరు నుండి వస్తున్న నీటితో సంభవిస్తున్న నష్టాన్ని నివారించేందుకు ప్రభుత్వ నిర్ణయం దోహదపడుతుందన్నారు.
మున్నేరు వరద జలాలతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని ముల్కనూర్ చెక్ డ్యామ్ ద్వారా నీరు మళ్లించి నిర్మించే మున్నేరు-పాలేరు లింక్ పథకంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ స్టేజ్-2 ను బలోపేతం చేయడంతోపాటు పాలేరు రిజర్వాయర్ ద్వారా భక్త రామదాసు ఎత్తిపోతల పథకం కింద ఉన్న డి.బి.యం 60 ద్వారా ఖరీఫ్ సాగుకు 70,308 ఎకరాల ఆయకట్టుకు అదనపు నీటి లభ్యత చేకూరుతుందని తెలిపారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలోని మోతే ఎత్తిపోతల పధకం ద్వారా డి.బి.యం -71 కింద ఉన్న 46,712 ఎకరాల భూమికి నిరంతరం సాగునీటిని అందించవచ్చన్నారు. ఈ ప్రాజెక్టుతో కేవలం సాగునీరు మాత్రమే కాక ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలో తాగు నీటి అవసరాల కోసం మిషన్ భగీరథ పధకానికి 4.70 నీటిని కేటాయిస్తున్నట్లు ఆయన వివరించారు. అన్నింటికీ మించి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ద్వారా సీతారామ ప్రాజెక్ట్ కు వినియోగించేందుకు వినియోగిస్తున్న విద్యుత్ విద్యుత్ చార్జీల భారం నుండి తప్పించుకోవడంతోపాటు అదనపు నీటితో పాలేరు రిజర్వాయర్ దిగువన ఉన్న హైడల్ ప్లాంట్ లో 2 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తికి ఆస్కారం ఏర్పడుతుందన్నారు. మొత్తంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా మున్నేరు ఉగ్రరూపం దాల్చిన ప్రతి సమయంలో అతలాకుతలం అయ్యే ప్రాంతాల ప్రజలకు ఇకపై ఎటువంటి ఇబ్బంది కలగదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




