మళ్లీ వచ్చాక హైద‌రాబాద్‌కు నీటి కొరత లేకుండా చూస్తాం

– రేవంత్ స్కాముల‌పై నోరెత్త‌ని బీజేపీ
– మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8: ఇంకో 500 సంవత్సరాల పాటు హైదరాబాదుకి తాగునీటి కొరత రాకుండా చూసే బాధ్యత కేసిఆర్ ది, బీఆర్ఎస్ ది అని బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇందుకోసం బీఆర్ఎస్ హయాంలో ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ 50 కి.మీ మేర రింగ్ మేయిన్ ను నిర్మించాం. మళ్లీ అధికారంలోకి వచ్చాక దాన్ని పూర్తి చేస్తాం. తాము అధికారంలోకి వచ్చాక 24 గంటలు హైదరాబాదులో నల్లా నీళ్లు వచ్చేలా చూస్తాం. ఈ ముఖ్యమంత్రికి అది చేతకాదు. జిహెచ్ఎంసి ఎన్నికల తర్వాత ఉచిత తాగునీటి పథకాన్ని కూడా కాంగ్రెస్ రద్దు చేస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇన్ని స్కాములు చేస్తుంటే ఎందుకు మాట్లాడటం లేదని బిజెపిని కూడా అడిగితే వాళ్లు మాట్లాడం లేదు. ఆర్ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నారని సాక్షాత్తు ప్రధానమంత్రి ఆరోపించినా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో బిజెపి నాయకులు చెప్పాల‌న్నారు. మూసీ సుందరీకరణ పూర్తి చేసేది కూడా కేసీఆర్ మాత్ర‌మేన‌న్నారు. ఖ‌జానాలో పైసలు లేక పథకాలు అమలు చేయడం లేదని చెప్తున్న రేవంత్ రెడ్డి మరోవైపు ప్రజాధనాన్ని దండుకుంటున్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు రెండు లక్షల కోట్లు అని మొన్న పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పినా సిగ్గు లేకుండా మొన్న అసెంబ్లీలో కాంగ్రెస్ నేతలు రూ.8 లక్షల కోట్లు, రూ.7 లక్షల కోట్ల అప్పు అని నోటికి వచ్చినట్లు వాగారు. సంక్షేమ పథకాలు అమలుకు పైసలు లేవని చెప్తున్న ప్రభుత్వం ₹7400 కోట్ల ప్రాజెక్టుకు అర్జెంటుగా శంకుస్థాపన ఎందుకు చేస్తుందో ముఖ్య మంత్రి సమాధానం చెప్పాల‌ని ఆయన డిమాండ్ చేశారు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిన ఘటనకు కారణమైన కాంట్రాక్ట్ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయండి అని హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్ బి రిపోర్ట్ ఇచ్చింది. అదే కంపెనీ నిర్మిస్తున్న ఎన్ హెచ్ 66 రహదారిలో స్లోప్ ప్రొటెక్షన్ వాల్ కూలడంతో నేషనల్ హైవే అథారిటీ ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేసింది. ఈ రెండు ప్రమాదాలకు కారణమైన కాంట్రాక్ట్ కంపెనీకి రూ.7000 కోట్ల పనులు ఇవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్ర‌శ్నించారు. సొంత నియోజకవర్గం కొడంగల్ లో రూ.4 వేల కోట్లతో నిర్మిస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్ పనులను కూడా మంత్రి పొంగులేటి కంపెనీతో పాటు అదే ఏజెన్సీకి ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ చేసిన కాంట్రాక్ట్ కంపెనీ, ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న మున్సిపల్ శాఖలో భాగమైన హెచ్.ఎం.డబ్లు.ఎస్.ఎస్. బీ బ్లాక్ చేసిన కంపెనీని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు బ్లాక్ లిస్టు చేయడం లేదు. ఇది క్రిమినల్ కుట్ర కాదా ? కాంట్రాక్టర్లతో కుమ్మక్కై వేలకోట్లను దోచుకొని ఢిల్లీకి మూటలు పంపి, వాటాలు పంచి తన సీఎం కుర్చీని కాపాడుకోవడానికే రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తున్నార‌ని ఆరోపించారు. ఒకేసారి రూ.1.5 కోట్లను దోచుకోకుండా విడతల వారీగా దోచుకుంటున్నారన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంట్రాక్ట్ కంపెనీలకు మూసీ సుందరీకరణ ప్రాజెక్టును అప్పగించాలని రేవంత్ రెడ్డి ఆత్రంగా ఉన్నాడు. కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇవ్వడానికి, మహిళలకు నెలకు రూ.2500 ఇవ్వడానికి, యువతకు స్కూటీలు ఇవ్వడానికి, ముసలి వాళ్లకు రూ.4000 పెన్షన్ ఇవ్వడానికి మాత్రం ఆత్రం చూపించడం లేదు. అక్కడైతే కమిషన్లు రావని సిఎం భావిస్తున్నారా? 16 వేల కోట్లతో పూర్త‌య్యే మూసీ సుందరీకరణ ప్రాజెక్టు అంచనాలను లక్ష యాభై వేల కోట్లకు పెంచి లూటీ చేయాలని చూస్తున్నారు అని కేటీఆర్ విమ‌ర్శించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *