నాటి తప్పిదాలను మాపై రుద్దుతున్నారు

– పాలేరు నుంచి సాగర్‌ ఆయకట్టుకు నీరు విడుదల
– బీఆర్‌ఎస్‌పై మంత్రులు భట్టి, పొంగులేటి ధ్వజం

ఖమ్మం, ప్రజాతంత్ర, జులై 14: ఖమ్మంజిల్లాలోని పాలేరు సాగర్‌ జలాశయం నుంచి సాగర్‌ ఆయకట్టుకు నీటిని మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఉపముఖ్యమంత్రి భట్టి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అంటేనే వ్యవసాయం, ప్రాజెక్టులు, విద్యుత్తు అని అన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను కాపాడలేదని, ఆ ప్రభుత్వం తప్పిదాల వల్లనే నేడు నీటి వాటాలో తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పారు. ఆనాడు తప్పిదాలు చేసిందే కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌రావులని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే పట్టించుకోలేదని, నాడు వారు తప్పులు చేసి తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా నది నుంచి ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ నీటిని తరలించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ నదిపై ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తుందని తెలిపారు. 60 శాతం ఆధారపడిన వ్యవసాయం, అనుబంధ రంగాలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం దృష్టిసారించి ముందుకు పోతుందన్నారు. పాలేరు రిజర్వాయర్‌లోకి నీళ్లు వదిలే కార్యక్రమం రాష్ట్ర ప్రజలు అదృష్టంగా భావిస్తున్నానని భట్టి అన్నారు. నీటిపారుదల, వ్యవసాయ రంగం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ సాగర్‌ ఆయకట్టు కింద 2.5 లక్షల ఎకరాలకు నీరు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 400 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నామని, రాబోవు ఐదు రోజుల్లో పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరు విడుదల చేస్తామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా రైతులకు వివిధ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. రైతు భరోసా ద్వారా ఎకరాకు రూ.12వేలు అందించామని, వారి ఖాతాల్లో తొమ్మిది రోజుల్లో రూ.9వేల కోట్లు జమ చేశామని, సన్న ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్‌ ఇస్తున్నామని వివరించారు. రాబోవు రోజుల్లో మిగిలిన పంటలకు కూడా ఇస్తామని పొంగులేటి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *