– అధికార, విపక్షం మధ్య పీపీటీ వార్, వాగ్యుద్ధాలు
– ఎవరిది నిజమో తెలియని అయోమయం
– నీళ్లు తీసుకెళుతున్న పక్క రాష్ట్రం
– వికటిస్తున్న నీటి రాజకీయం
– పార్టీల వైఖరిపై ప్రజల్లో ఆగ్రహం
(మండువ రవీందర్రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)
తెలంగాణలో మరోసారి నీటి ఎజండాగానే పంచాయితీ జరుగుతున్నది. అయితే తెలంగాణ ఆవిర్భావానికి ముందు, ఆ తర్వాత పక్క రాష్ట్రం తో నీటి వాటాను పంచుకోవటంలో పంచాయితీ ఉంటే ఇప్పుడు స్వరాష్ట్ర రాజకీయ పార్టీల మద్య ఈ వార్ కొనసాగుతున్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాతనే నీటి వాడకంలో రాష్ట్రానికి ఎక్కువ అన్యాయం జరిగిందని అధికార కాం గ్రెస్ అంటుంటే, గత ఉమ్మడి పాలనలో కాంగ్రెస్ చేసిన అన్యాయానికి అడ్డుకట్ట వేసి గత దశాబ్ద కాలంగా ఎవరూ ఊహించనంతగా కృష్ణా, గోదావరి జలాలను సద్వినియోగం చేసుకున్నామంటోంది బీఆర్ఎస్. ఈ రెండు పార్టీల మధ్య ఇంతకాలం సాగుతున్న మాటల యుద్ధం కాస్తా ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజంటేషన్ వార్ మారింది. వాస్తవానికి తాజాగా అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఈ విషయంలో వాడివేడి చర్చ జరుగుతుందని అందరూ ఊహించారు. కాని, అధికార పార్టీ అసెంబ్లీలో, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ అసెంబ్లీ బయట తమ పార్టీ కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్లు చేసి ఒకరి తప్పులను ఒకరు ఎత్తిచూపడంలో పోటీపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాగునీటి రంగంలో జరిగిన అక్రమాలపై కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు, వచ్చిన తర్వాతకూడా దుమ్మెత్తిపోస్తూనే ఉంది. కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగంచేసిందని, అదనంగా ఆయకట్టును పెంచలేకపోయిందంటూ నిత్యం విమర్శిస్తూనే ఉంది. దానికి దీటుగానే బీఆర్ఎస్ కూడా స్పందిస్తూనే ఉంది. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిందంటూ ప్రతివిమర్శ చేస్తున్నది. అయితే ఈ విమర్శలకు రాష్ట్ర అసెంబ్లీని వేదికగా చేసుకుని వాస్తవాలు మాట్లాడుకుందామని, సాక్షాత్తు బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ ను పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఆయన ఆహ్వానాన్ని అంగీకరించినట్లుగానే అసెంబ్లీ సమావేశాల మొదటి రోజున హాజరైన కేసీఆర్, నీళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సాగునీటిపై ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ కు హాజరుకాకపోగా బీఆర్ఎస్ పార్టీ ఆ కార్యక్రమాన్నే బాయికాట్ చేసింది. అసెంబ్లీలో కాంగ్రెస్, బయట బీఆర్ ఎస్ పార్టీల పీపీటీతో వాస్తవమేమిటన్నది ప్రజల్లో ఆయోమయం నెలకొంది. ఏదివాస్తవం ఏది అవాస్తవమన్నది ఇదిమిద్దంగా తేల్చుకోలేక పోతున్నారు.
ఇరు వర్గాలు కూడా నీటిప్రాజెక్టులకు సంబందించి వివిధ సంస్థలతో జరిపిన ఉత్తరప్రత్యుత్తరాలను చూపిస్తూ ఎదుటివారి ఆరోపణలో వాస్తవంలేదంటూ తీవ్రంగా ఖండిస్తున్నాయి. విచిత్రమేమంటే ఈ రెండు పార్టీలుకూడా పక్కనున్న దాయాది రాష్ట్రానికి నీటి కేటాయింపులో అనుకూలంగా వ్యవహరిస్తున్నాయంటూ ఒకదానిపై ఒకటి ఆరోపణలు చేసుకుంటున్నతీరు మరింత గందరగోళపరుస్తున్నాయి. పైగా ఒక్క చుక్కనీటిని కూడా ఒదులుకునే ప్రసక్తే లేదంటూ ఈ రెండు పార్టీలు చాలెంజ్ చేస్తున్నాయి. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ తమకు దక్కాల్సిన నీటివాటాకోసం పక్కరాష్ట్రంతో తగవుపడాల్సిందిపోయి, స్వరాష్ట్రంలో తగవులతోనే కాలక్షేపం చేస్తున్నాయి. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటా తగాదా ఈనాటిదికాదు. దశాబ్దాలుగా సాగుతున్న ఈ పంచాయితీ విషయంలో ప్రభుత్వాలు మారుతున్నా సమస్య మాత్రం కొలిక్కి రావటంలేదు. ఇరు రాష్ట్రాల చర్చలు, కేంద్రంతో మంతనాలు ఏవీ ఫలించడంలేదు. ఒక పక్క తగాదా నడుస్తుండగానే పక్క తెలుగు రాష్ట్రం తమ వాటాకు మించిన నీటిని ఏదో రకంగా తరలించుకుపోతూనే ఉంది. అందుకనుకూల ప్రాజెక్టుల నిర్మాణాలు చేసుకుంటుపోతోంది. వాటిని నిరోధించడానికి న్యాయస్థానాల తలుపులు తట్టాల్సి వస్తున్నది. న్యాయస్థానాలుకూడా న్యాయపరమైన పోరాటాలకన్నా పరస్పర చర్చల ద్వారానే పరిష్కరించుకోవడం సముచితమని సలహాలిస్తున్నాయి. తాజాగా పోలవరం విషయంలో అత్యున్నత న్యాయస్థానం అదే సూచన చేసింది. కేంద్రం కూడా తాజాగా అదే విషయాన్ని చెప్పకనే చెప్పింది. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జలశక్తి ద్వారా అందుకు ఒక ప్రత్యేక కమిటిని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు, నిర్వహణ సమస్యలను పరిష్కరిస్తుందని కేంద్రం చెబుతున్నది. కేంద్ర జలసంఘం చైర్మనే దీనికి చైర్మన్ గా వ్యవ హరిస్తారు. ఇరు రాష్ట్రాల అధికారులు, కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డుల చేర్మన్లు, జాతీయ నీటి అభివృద్ధి సంస్థ చీఫ్ ఇంజనీరు కలిపి పన్నెండు మందితో ఏర్పాటు చేసిన ఈ కమిటీ మూడు నెలల్లో కేంద్రానికి నివేదికను అందజేయాల్సి ఉంటుంది. ఈ కమిటీతోనైనా వివాదాలకు ఫుల్ స్టాప్ పడితే రాష్ట్రం ఇతర విషయాలపై దృష్టిసారించేందుకు వీలు పడుతుంది. అందుకు అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ అంతఃకలహాలకు ఇప్పటికైనా చరమగీతం పాడాల్సిన అవసరం ఎంత్తైనా ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





