` గ్రూప్-1 పోస్టుల భర్తీలో డబ్బులు చేతులు మారాయి
– హైకోర్టు ఆదేశాల ప్రకారం పరీక్ష మళ్లీ నిర్వహించాలి
– అవకతవకలపై జ్యుడీషియల్ విచారణ చేపట్టాలి.
– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: గ్రూప్-1 పరీక్షల్లో అక్రమాలపైన, ఎన్నికల సమయంలో ఏడాది లోపే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని కాంగ్రెస్ చేసిన మోసపూరిత వాగ్దానంపైన చర్చించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈమేరకు ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. పోస్టులను అమ్ముకున్నారంటూ కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్లతరబడి తమ విలువైన సమయాన్ని, తల్లిదండ్రుల కష్టార్జితాన్ని వెచ్చించి పోటీ పరీక్షలు రాసే యువత నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వమ్ము చేసిందని తీవ్రంగా విమర్శించారు. ఈ పోస్టుల భర్తీకి డబ్బులు చేతులు మారాయని పలువురు విద్యార్థులు చేస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం స్పందించాలని కేటీఆర్ కోరారు. మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయం అభ్యర్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తగిన విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశించినట్టు గ్రూప్-1 పరీక్షను ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా మళ్లీ నిర్వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అలాగే, పరీక్షల్లో జరిగిన అవకతవకలపై జ్యుడీషియల్ కమిషన్ వేసి ఉద్యోగాలను అమ్ముకున్న దొంగలెవరో తేల్చాలని కోరారు. ఇది నిరుద్యోగులకు న్యాయం చేకూర్చడమే కాక భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా నిరోధిస్తుందని అభిప్రాయపడ్డారు. గ్రూప్-1 పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఇది నిరుద్యోగుల భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, కాసుల కక్కుర్తి అవకతవకలకు కారణమయ్యాయని కేటీఆర్ మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని ఒక వ్యాపారంగా మార్చిందని ఆరోపించారు. ఈ ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో విఫలమవడం వల్ల యువత నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయిందని, ఈ వైఫల్యాన్ని వారు ఎప్పటికీ క్షమించరని కేటీఆర్ పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్య తీవ్రతను ప్రభుత్వం గుర్తించాలని, మాటలతో కాక చేతల్లో చూపించి యువత ఆశలను నెరవేర్చాలని సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





