– పట్టించుకోని ప్రభుత్వం
-మాజీ మంత్రి జగదీశ్వర్‌ ‌రెడ్డి విమర్శలు
సూర్యాపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25: ‌సమైక్యాంధ్రలో మాదిరిగానే జల దోపిడీ మొదలైందని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌ ‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో కృష్ణ, గోదావరి నీళ్లు దోపిడీకి గురవుతూ హక్కులకు భంగం వాటిలోతోందన్నారు.  ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, అదేంట‌ని అడిగిన వారిపై ఎదురుదాడికి ప్రయత్నిస్తున్నార‌ని మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ ఏదైనా చెబితే పాజిటివ్‌గా తీసుకోకుండా ఎదురుదాడి చేస్తున్నారని జగదీశ్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ ‌లక్షమందితో సభపెడితే కృష్ణా జలాలపై శాసనసభలో తీర్మానం చేశారని చెప్పారు. బనకచర్లపై కూడా అంతే నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఎదిరించి ఉద్యమం చేపడతామంటే దిగి వచ్చారని అన్నారు. కృష్ణా నదికి చంద్రబాబు గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నాడ‌ని, ఇరిగేషన్‌ ‌మంత్రి అవగాహన లోపంతో, తెలివి తక్కువతనంతో 40 టీఎంసీలకు ఒప్పుకొని ఉత్తరం రాసిండని చెప్పారు. 90 టీఎంసీల నీటిని మహబూబ్‌నగర్‌ ‌రంగారెడ్డిలకు అందించేందుకు గతంలో రూ.27 వేల కోట్లు ఖర్చుపెట్టామని, మిగిలిన పది శాతం పనులు పూర్తి చేయకుండా 40 టీఎంసీలకు ఒప్పుకుని మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాలకు అన్యాయం చేశార‌ని జగదీశ్‌ ‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ ‌నీళ్లపై జరుగుతున్న అన్యాయాన్ని వివరించార‌ని, ఎవరిపై విమర్శ చేయలేదని చెప్పారు. చంద్రబాబు, మోదీ రాష్ట్రాన్ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నార‌ని ఆరోపించారు. వారికి రేవంత్‌రెడ్డి అవసరమని, ప్రజలకు అవసరం లేదని వ్యాఖ్యానించారు. వారి కోసం ప్రజల గొంతు ఎండబెడతామంటే ఊరుకోమని హెచ్చరించారు. రేవంత్‌ది ఏ కోశాన కేసీఆర్‌ ‌స్థాయి కాదని జగదీశ్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చే మాటలు మాట్లాడుతున్నడని విమర్శించారు. ముఖ్యమంత్రి సోయి తెచ్చుకొని మాట్లాడాలని, సాధారణ ఎన్నికలు వస్తే ప్రజలే రేవంత్‌ని బండరాళ్లు కట్టి మున్సిపల్‌ ‌చెత్త పారేసినట్లు మూసీలో పడవేస్తరని అన్నారు.కేసీఆర్‌ ‌ప్రజల్లోకి వస్తుంటే భయం ఎందుకు? దమ్ముంటే ఆయ‌న‌ ప్రశ్నకు సమాధానం చెప్పు అని సవాల్‌ ‌చేశారు. నువ్వు, నీ పోలీసులు ఎన్ని పన్నాగాలు పన్నినా టీఆర్‌ఎస్‌ ‌సైనికులు అద్భుతమైన పోరాటంతో గెలుపొందారన్నారు.
—————————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.