– సురవరం సుధాకర్‌రెడ్డికి సీఎం రేవంత్ నివాళులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 24: సురవరం సుధాకర్ రెడ్డి (Suravaram Sudhakar Reddy) మరణం తెలంగాణకు తీరని లోటని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి మనోధైర్యం కలగాలని కోరుకుంటున్నాన్నారు. శుక్రవారం రాత్రి కన్నుమూసిన సీపీఐ జాతీయ మాజీ కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి భౌతిక కాయాన్ని గచ్చిబౌలి కేర్ హాస్పిటల్‌నుంచి పార్టీ రాష్ట్ర కార్యాలయం మగ్గుం భవన్‌కు (Magdum Bhavan) ప్రజల సందర్శనార్థం తరలించారు. మగ్ధుం భవన్‌కు ముఖ్యమంత్రి వెళ్లి సురవరం పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సురవరం జీవితాంతం రాజీపడని నిరాడంబర జీవితాన్ని గడిపారని, ఏనాడూ సిద్ధాంతాలను వదలలేదని చెప్పారు. పేదలు, బహుజనుల కోసం పోరాడారని గుర్తు చేశారు. కార్యకర్త స్థాయి నుంచి ఎంపీగా వివిధ హోదాల్లో పనిచేసినా అందరివాడుగానే మెలిగారన్నారు. పాలమూరు జిల్లా బిడ్డ జాతీయస్థాయి నేతగా ఎదగడం గర్వకారణమన్నారు. ఆ జిల్లాకు వన్నె తెచ్చిన నేతల్లో ఒకరని కొనియాడారు. ఆయన కుటుంబానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం అన్నారు. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని వారు లేఖ రాయగా వెంటనే ఆ పేరు పేరు పెడుతూ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లాకు సురవరం వన్నె తీసుకొచ్చారని కొనియాడారు. వారి సేవలకు గుర్తుగా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. తమ పార్టీ పీఏసీ సమావేశంలో కూడా సురవరం సేవలను స్మరించుకున్నామని చెప్పారు. తెలంగాణ ప్రజలకు ఆదర్శంగా నిలిచిన వారిని తమ ప్రభుత్వం గుర్తిస్తుందని, కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు హార్టీకల్చర్ యూనివర్సిటీకి, జైపాల్‌రెడ్డి పేరు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పెట్టామని తెలిపారు. సురవరం సుధాకర్ రెడ్డి పేరు శాశ్వతంగా నిలిచిపోయేలా మంత్రివర్గంలో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా సంతాపం తెలిపారన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండిరగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.





