– సెక్రటేరియట్‌లో ఉమ్మడి వరంగల్‌ జిల్లా సమీక్షా సమావేశం
– హాజరైన భూపాలపల్లి ఎమ్మెల్యే

జయశంకర్‌ భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూలై 26: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి, జెన్కో సీఎస్‌ఆర్‌ నిధులను విద్యాభివృద్ధి కోసం కేటాయించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రాష్ట్ర మంత్రులను కోరారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ, ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఉమ్మడి జిల్లాస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్యమంత్రి(ప్రజా వ్యవహారాల) సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ సీతక్క, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, వరంగల్‌ సీపీ, కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ తన నియోజకవర్గంలో అనేక ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారుని, పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, ప్రహరీ, టాయిలెట్స్‌ తదితర అసంపూర్తిగా ఉన్న పనులకు సీఎస్‌ఆర్‌ నిధులు సమకూర్చి పూర్తి చేయాలని కోరారు. మారుతున్న కాలానికనుగుణంగా సాంకేతిక విద్యతోపాటు ఇతర నైపుణ్యాలను విద్యార్థులకు పెంపొందించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయడానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కూడా కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *