కేయూ వీసీ కె ప్రతాపరెడ్డి
కాళోజీ జంక్షన్/హన్మకొండ ప్రజాతంత్ర, ఆగస్టు 18 : కాకతీయ విశ్వవిద్యాలయం (Kakatiya University) లో చదువుకున్న విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ఉద్యోగావకాశాలు కల్పించే స్థాయికి ఎదగాలని కేయూ వీసీ ప్రొఫెసర్ కె ప్రతాపరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం కేయూ పరిపాలన భవనంలో ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం ప్రవేశం పొందిన విద్యార్థులకు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.రమణ అధ్యక్షతన ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఉపకులపతి కె. ప్రతాపరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు కళాశాలలో కేవలం సిలబస్ కు పరిమతం కావద్దని సూచించారు. పాఠ్య పుస్తకాలతో పాటు, పాఠ్యేతర అంశాలపై కూడా ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. మంచి వ్యక్తులుగా మారడానికి ఉన్న ప్రతి అంశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గౌరవ అతిథిగా పాల్గొన్న వరంగల్ టీజీఎన్పీడీసియల్ చైర్మన్, మానేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి మాట్లాడుతూ సామజిక ప్రయోజనం కోసం, ఆచరణాత్మక పరిష్కారాలను చూపడంలో ఇంజనీర్ల పాత్ర ప్రధానమని అన్నారు. కృత్రిమ మేధ నేపథ్యంలో నైపుణ్యాల పెంపు అవసరమని అన్నారు. కార్యక్రమంలో కన్వీనర్ డాక్టర్ వి.మహేందర్, డాక్టర్ రాధిక, డాక్టర్ సుమలత, డాక్టర్ అసిం ఇక్బాల్, బీటెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.





