– సన్న వడ్లకు గిట్టుబాటు ధర ఇస్తున్నాం
– తొమ్మిది రోజుల్లో రూ.9వేల కోట్లు రైతు భరోసా చెల్లించాం
– రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్
– రూ.20వేల కోట్లు రుణ మాఫీ చేసిన ఘనత మాదే
– నర్సంపేట సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
– రూ.532.24 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నర్సంపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 5: ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఎప్పుడు వచ్చినా.. కాకతీయులు, సమ్మక్క- సారక్క, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తి కనిపిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నర్సంపేటలో నిర్వహించిన ప్రజా పాలన- ప్రజా విజయోత్సవ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పదేళ్లలో బీఆరెస్ నాయకులు తమ ఆస్తులు పెంచుకున్నారు తప్ప నర్సంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదు. వరి వేసుకుంటే ఉరి అని ఆనాటి ముఖ్యమంత్రి హెచ్చరించిన పరిస్థితి కానీ ఈనాడు సన్న వడ్లు పండిస్తే గిట్టుబాటు ధరతో పాటు రూ.500 బోనస్ అందిస్తున్నామన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతు భరోసా అందించాం. 25 లక్షల 35 వేల మంది రైతులకు రూ.20 వేల కోట్లు రుణ మాఫీ చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానిదేనన్నారు. దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ. గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇవ్వాలంటే వాళ్ల ఆస్తులు రాసిచ్చినట్లు మాట్లాడారు. కానీ ప్రజా ప్రభుత్వంలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందిస్తున్నాం. రాష్ట్రంలో 3 కోట్ల 10 లక్షల మంది బిడ్డలకు ఏడాదికి రూ.13 వేల కోట్లు భారమైనా ఆకలి తీర్చాలని సన్న బియ్యం అందిస్తున్నామన్నారు. సంక్షేమ పథకాలు పేదలకు అందాలన్నదే మా ప్రయత్నం. 2004 నుంచి 2014 వరకు వైఎస్ హయాంలో పదేళ్లలో 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు. రూ.2,500 కోట్లతో ప్రతీ నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నామన్నారు. నర్సంపేటకు మరో 3500 ఇండ్లు మంజూరు చేసే బాధ్యత మంత్రి పొంగులేటికి అప్పగిస్తున్నామన్నారు. కమ్యూనికేషన్ ఇన్ పోర్ట్స్, కమ్యూనికేషన్ ఇన్ టెక్నాలజీ అని తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించబోతున్నామన్నారు.
హైదరాబాద్ నగరంలా వరంగల్ ను తీర్చిదిద్దుతామన్నారు. హైదరాబాద్ లా వరంగల్ కు ఔటర్ రింగ్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎయిర్ పోర్టు నిర్మిస్తాం. మార్చి 31 లోగా వరంగల్ ఎయిర్ పోర్టు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఔటర్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభిస్తాం. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలని ప్రభుత్వం సంకల్పం తీసుకుంది. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణంతోపాటు మహిళలను బస్సులకు యజమానులను చేశామన్నారు. పెట్రోల్ బంకులు, సోలార్ పవర్ ప్లాంట్లు నిర్వహించుకునేలా ప్రోత్సహించాం. మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నాం. కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంపిణీ చేస్తాం. 18 ఏండ్లు నిండిన ప్రతీ ఆడబిడ్డకు చీరలు చేరేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు తీసుకోవాలన్నారు. మీ పిల్లలను చదివించండి. మీ పిల్లల చదువుకు కావాల్సిన వసతులు అందించే బాధ్యత నాది. మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. మరో 40 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేస్తామన్నారు. నిరుద్యోగ యువత బాగా చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలి. గ్రామ సమస్యలపై అవగాహన పెంచుకోండి.. అభివృద్ధి చేసుకోండి. రాజకీయ కక్షలకు తావు ఇవ్వక , డబ్బులు ఖర్చు చేయక మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పనిచేసుకునే మంచి వాళ్ళనే సర్పంచులుగా ఎన్నుకోండి.. మీరు అండగా ఉంటే కేంద్రంతో కోట్లాడి రాష్ట్రానికి నిధులు తీసుకొస్తామన్నారు.
అంతకుముందు రూ.532.24 కోట్లతో నర్సంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన పనుల వివరాలు: రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటుకు శంకుస్థాపన రూ.130 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల, వసతి గృహాల నిర్మాణానికి శంకుస్థాపన రూ.82.56 కోట్లతో హన్మకొండ-నర్సంపేట-మహబూబాబాద్ రోడ్డు విస్తరణ, మరమ్మతు పనులకు శంకుస్థాపన రూ.17.28 కోట్లతో నర్సంపేట- పాఖాల రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన రూ. 56.40 కోట్లతో నర్సంపేట నుంచి నెక్కొండ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన రూ.26 కోట్లతో ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపన. రూ.20 కోట్లతో నర్సంపేటలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు కడియం కావ్య, బలరాం నాయక్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొనగా, సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





