జిల్లాను ప్రగతి పథంలో నడపాలి

– మహబూబాద్‌ ఎంపీ బలరాం నాయక్‌
– వరంగల్‌ కలెక్టరేట్‌లో ‘దిశ’ సమావేశం

వరంగల్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 21 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేసి జిల్లాను ప్రగతి పథంలో నడపాలని మహబూబాద్‌ ఎంపీ పోరిక బలరాం నాయక్‌ అన్నారు. వరంగల్‌ జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బలరాం నాయక్‌ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్‌.నాగరాజు, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్య శారద, ఆదనవు కలెక్టర్‌ సంధ్యారాణి పాల్గొన్నారు. తొలుత దక్షిణ భారత దేశంలో జల సంరక్షణ కేటగిరి-2లో వరంగల్‌ జిల్లాకు మొదటి స్థానం దక్కించుకుని కేంద్ర మంత్రి సి.ఆర్‌.పాటిల్‌ చేతుల మీదుగా అవార్డు స్వీకరించిన కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారదను బలరాం నాయక్‌, ఎమ్మెల్సీ సారయ్య, ఎమ్మెల్యే నాగరాజులు శాలువాలు కప్పి అభినందించారు. జిల్లాలో జల సంరక్షణ చర్యలను విజయవంతంగా చేపట్టి రాష్ట్రానికి ప్రతిష్ఠ తెచ్చారని ప్రశంసించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు గత జాన్‌లో జరిగిన ‘దిశ’ సమావేశంలో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన వివిధ సమస్యలను పరిష్కరించిన అంశాలను తెలియజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వ్యవసాయ, విద్య, వైద్యం, ఆరోగ్యం, మహిళా శిశు సంక్షేమం, నీటిపారుదల, జాతీయ రహదారుల విభాగం, గ్రామీణ అభివృద్ధి, మెప్మా, రోడ్ల భవనాలు, జిల్లా పరిషత్‌, గ్రామీణ తాగునీటి సరఫరా, విద్యుత్‌, జిడబ్ల్యుఎంసి, మున్సిపల్‌ తదితర శాఖల ద్వారా జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, వాటికి కేటాయించే నిధులతో కొనసాగుతున్న పనులను క్షుణ్ణంగా సమీక్షించారు. కేంద్రం పరిధిలోని పలు శాఖల పనితీరుపై చర్చించారు. కొత్తగా చేపట్టాల్సిన పనులపై దిశా నిర్దేశం చేశారు. కేంద్రం నుంచి వస్తున్న నిధులు సంబంధిత శాఖలు ఎలా ఖర్చు చేస్తున్నాయి, అవి ప్రజలకు చేరుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ బలరాం నాయక్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్న నిధులను సక్రమంగా వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. .కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన నిధులను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సారధ్యంలో రాబట్టుకొని ప్రజా ప్రతినిధులు అధికారుల సహకారంతో జిల్లాను ప్రగతి పథంలో తీసుకెళ్తామన్నారు. వరంగల్‌ జిల్లా పరిపాలన షెడ్యూల్డ్‌ ట్రైబ్‌ సంక్షేమానికి మంచి ప్రణాళికలు రూపొందించినందున వాటిని కేంద్రానికి పంపించి ప్రత్యేక బడ్జెట్‌ మంజూరుకు కృషి చేస్తానన్నారు. ఎంజిఎం ఆసుపత్రి అభివృద్ధి కమిటీని ఏర్పరిచి సామాజిక సేవా దృక్పధం ఉన్న వ్యక్తులను కమిటీ మెంబర్లుగా ఎంపిక చేసి అందరికీ అందుబాటులోకి వైధ్య సేవలు ఉండేలా షిఫ్ట్‌ల వారీగా విధులు కేటాయించి క్షతగాత్రులకు తక్షణమే వైద్యం అంధించాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. ఎమ్మెల్సీ సారయ్య, ఎమ్మెల్యే నాగరాజులు కూడా మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *