గ్రేటర్‌ వరంగల్‌ అభివృద్ధికి మరో ముందడుగు

– స్పోర్ట్స్‌ స్కూల్‌, క్రికెట్‌ స్టేడియం కోసం ఎమ్మెల్యేల వినతి
` సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి]

వరంగల్‌, ప్రజాతంత్ర, జులై 20: వరంగల్‌లో స్పోర్ట్స్‌ స్కూల్‌, ఆధునిక సదుపాయాలతో కూడిన క్రికెట్‌ స్టేడియం ఏర్పాటుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి, స్టేషన్‌ ఘనపూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్‌.నాగరాజు, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డిలు హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆదివారం కలిశారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్‌లో స్పోర్ట్స్‌ అకాడమి పాఠశాల, క్రికెట్‌ స్టేడియం ఏర్పాటు చేయాలని వారు కోరారు. అందుకు సానుకూలంగా స్పందించి అవసరమైన విధివిధానాలను రూపొందించాలని సూచించారు. ఈ సందర్భంగా నాయిని రాజేందర్‌ రెడ్డి మాట్లాడుతూ మహా నగర ప్రజల కలలుగా ఉన్న క్రీడా మైదానం ఇప్పుడు నెరవేరబోతోందన్నారు. తమ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టులు ఈ ప్రాంత క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఉపయోగపడతాయన్నారు. కడియం శ్రీహరి మాట్లాడుతూ ఒక్కొక్క నియోజకవర్గం, ఒక్కొక్క నాయకునిది కాక ఈ అభివృద్ధి మొత్తం వరంగల్‌ నగరానికి చెందినది.. అందరం కలిసి కృషి చేస్తే ఏదైనా సాధ్యమవుతుంది అన్నదానికి ఇది బలమైన ఉదాహరణ అని అన్నారు. స్పోర్ట్స్‌ అకాడమి, ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ మైదానం వంటి ప్రాజెక్టులు వరంగల్‌ నగరాన్ని క్రీడా రంగంలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేస్తాయని రేవూరి ప్రకాష్‌ రెడ్డి, నాగరాజు, యశస్విని రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూమి, బడ్జెట్‌, కార్యాచరణ ప్రణాళికలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *