స్విమ్మింగ్ పూలా.. ఆర్టీసీ బ‌స్టాండా?

– వరంగల్‌ బస్టాండు స్థ‌లంలో ఉచిత పడవ ప్రయాణం పేర బీజేపీ నిరసన
– సీఎం, మంత్రి, మాజీ సీఎం కేసీఆర్‌లకు ప్రయాణం ఉచితం
– ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు రవికుమార్‌

వరంగల్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 13: వరంగల్‌ బస్టాండ్‌ పనుల్లో నిర్లక్ష్యం, ప్రమాద స్థాయిలో గుంతలు తీయడంతో నీళ్లు నిలిచి స్విమ్మింగ్‌ ఫుల్‌లా మారిందని, బీఆర్‌ఎస్‌్‌, కాంగ్రెస్‌ పాపాలకు వరంగల్‌ ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవి కుమార్‌ మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు మాయల మరాఠీ పార్టీలని ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే అయిన మంత్రి కొండా సురేఖ అసమర్థతతో వరంగల్‌ ఆర్టీసీ బస్టాండ్‌ నిర్మాణానికి నోచుకోవడం లేదని విమర్శించారు. చారిత్రక నగరమైన వరంగల్‌లో బస్టాండ్‌ నిర్మాణానికి ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంతో వరంగల్‌ ఆత్మగౌరవ పోరాటం మహా ధర్నా- 2 పేరుతో బీజేపీ వరంగల్‌ శాఖ ఆధ్వర్యంలో బస్టాండ్‌ పాంతంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులకు ఉచిత పడవ ప్రయాణం పేరుతో బీజేపీ గురువారం వినూత్న నిరసన చేపట్టింది. పడవ ప్రయాణంతో కూడిన నిరసన కార్యక్రమాన్ని రవికుమార్‌ ప్రారంభించారు. రాష్ట్ర రెండో రాజధానిగా వరంగల్‌ను తీర్చిదిద్దుతామంటూ ప్రగల్భాలు పలుకుతున్న సర్కారు కనీసం బస్టాండ్‌ నిర్మాణ పనులను చేపట్టడం లేదంటూ మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే కొండా సురేఖ మంత్రిగా ఉన్నా పట్టించుకోకపోవడం, ఆమె అసమర్థతకు ఇది నిదర్శనమని విమర్శించారు. ఎన్నికల ముందు అప్పటి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ కోట్ల రూపాయలతో కొత్త బస్టాండ్‌ నిర్మిస్తామంటూ ఇదిగో నమూనా బస్టాండ్‌ అంటూ మాయమాటలు చెప్పి ఉన్నదానిని కూల్చాడని, తర్వాత కనీసం అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదని అన్నారు. కాకతీయుల ఆర్థిక రాజధానిగా, పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న వరంగల్‌కు కనీసం బస్టాండ్‌ లేకపోవడం ఏంటని పర్యాటకులు ముక్కుమీద వేలు వేసుకుంటున్నారని వాపోయారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హృదయ్‌, అమృత్‌, స్మార్ట్‌ సిటీ వంటి ఎన్నో పథకాలకు భారీగా నిధులు కేటాయించి వరంగల్‌ను ప్రగతిబాటలో నడిపిస్తుంటే బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఓరుగల్లు చరిత్రను భ్రష్టు పట్టిస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు. స్థానిక ఇక్కడి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. ఆ రెండు పార్టీలకు ఓట్లు తప్ప వరంగల్‌ అభివృద్ధిపై కనీస పట్టింపులేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల భూముల్ని కబ్జా చేయడంలో, సెటిల్‌మెంట్‌ పనుల్లో ఆ పార్టీల నేతలు బీజీబిజీగా ఉన్నారని, ఇక వారికి ప్రజా సమస్యలు ఏం పడతాయని అన్నారు. ఓరుగల్లు సమగ్రాభివృద్ధి, అస్థిత్వం, ఆత్మగౌరవం కోసం బీజేపీ పాటుపడుతోందన్నారు. ఓరుగల్లు అభివృద్ధి కోసం ఇక ఉద్యమాన్ని ఉధృతం చేసి ఉమ్మడి జిల్లా మంత్రుల, శాసనసభ్యుల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రబెల్లి ప్రదీప్‌ రావు, కుసుమ సతీష్‌, రత్నం సతీష్‌, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, రాష్ట్ర నాయకులు కంభంపాటి పుల్లారావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు బాకం హరిశంకర్‌, మల్లాడి తిరుపతిరెడ్డి, గోగుల రాణా ప్రతాప్‌ రెడ్డి, జలగం రంజిత్‌ రావు, జడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ గజ్జెల శ్రీరాములు, జిల్లా, మండల పదాధికారులు, వివిధ మోర్చా జిల్లా అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page