మ‌ళ్లీ యుద్ధ మేఘాలు

– ఇరాన్‌పై దాడికి ట్రంప్, ఇజ్రాయెల్ సమాలోచనలు
– ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన

వాషింగ్టన్, ఏప్రిల్ 13: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలమవడంతో పశ్చిమాసియా మళ్లీ నివురుగప్పిన నిప్పులా మారింది. ఏ క్షణాన ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇరాన్‌పై మళ్లీ దాడులు ప్రారంభించేందుకు అమెరికా, ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నట్లు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. హర్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తామని అమెరికా సెంట్రల్ కమాండ్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతోపాటు ఇరాన్‌పై పరిమిత స్థాయిలో సైనిక దాడులను పునరుద్ధరించేలా ట్రంప్ సలహాదారులు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఈ దాడులకు ట్రంప్ అంగీకరిస్తారా లేదా అనేదానిపై ఇంకా స్పష్టత లేదు. ఇరాన్ (ఎసజీని)ను నలువైపులా నిర్బంధించి, హర్మూజ్ జలసంధిపై నియంత్రణ తెచ్చుకోవాలని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం. మిత్ర దేశాలతో కలిసి ఈ మార్గంలో ప్రయాణించే నౌకలకు భద్రత కల్పించే అంశంపై ట్రంప్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అటు, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కూడా ఇరాన్‌పై దాడులకT సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఐడీఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెప్టినెంట్ జనరల్ ఇయాల్ జర్ తన సైన్యాన్ని ఆదేశించినట్లు ఇజ్రాయెల్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇరాన్‌పై దాడుల పునరుద్ధరణ విషయంలో ట్రంప్ నిర్ణయం కోసం ఇజ్రాయెల్ ఎదురుచూస్తున్నట్లు ఆ కథనాలు తెలిపాయి. అయితే, ఈలోగా టెహ్రాన్ తమపై దాడి చేస్తే మాత్రం ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని ఐడీఎఫ్ హెచ్చరిస్తోంది. ఇదిలా ఉండగా, యూఎస్-ఇరాన్ చర్చలు విఫలం కావడంతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇరాన్ పోర్టుల నుంచి నౌకలు హర్మూజ్ మీదుగా రాకపోకలు సాగించకుండా నేటి సాయంత్రం 7.30 (భారత కాలమానం ప్రకారం) నిర్బంధం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అణు కార్యక్రమాన్ని వదులుకునేలా ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ఇజ్రాయెల్ దాడులను ప్లాన్ చేస్తున్నట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇరాన్‌ను అన్ని వైపుల నుంచి దిగ్బంధించి చర్చల్లో ప్రతిష్టంభనను తొలగించాలనేది యూఎస్ ప్రభుత్వ ఉద్దేశమని కథనాలు వెలువడ్డాయి. ఈ దిశగా నాటో దేశాలను కూడా రంగంలోకి దింపేందుకు అమెరికా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే హర్మూజ్ మీదుగా నౌకల రాకపోకలను ఇరాన్ నిలిపివేసిన విషయం తెలిసిందే. హర్మూజ్ జలాల్లోకి యూఎస్ యుద్ధ నౌకలు వస్తే దాడులు తప్పవని హెచ్చరించింది. చర్చలు విఫలం కావడానికి అమెరికానే కారణమని తేల్చి చెప్పింది. యూఎస్ పెట్టిన అసమంజసమైన డిమాండ్ల కారణంగానే చర్చల్లో పీటముడి పడిందని పేర్కొంది. అణు కార్యక్రమం వదులుకునే దిశగా ఇరాన్ నుంచి స్పష్టమైన హామీలు రాలేదని యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్నారు.

హర్మూజ్‌ను దిగ్బంధిస్తే తీవ్ర పరిణామాలు  : ఇరాన్ ఘాటు హెచ్చరిక

హర్మూజ్‌ను దిగ్బంధిస్తామన్న ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ మరోసారి ఘాటుగా స్పందించింది. అది ఇప్పటికీ తమ నియంత్రణలోనే ఉందంటూ శత్రువులు ఏ చిన్న పొరపాటు చేసినా ప్రమాదం తప్పదని హెచ్చరించింది. అంతకుముందు ఇరాన్ సైనిక దళం (ఐఆర్‌జీసీ) కూడా ట్రంప్‌నకు గట్టి వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. హర్మూజ్ వైపు వచ్చే యుద్ధ నౌకలపై దాడి చేస్తామని హెచ్చరించింది. పౌర నౌకల రాకపోకలకు మాత్రం ఎలాంటి ఇబ్బందీ ఉండదని భరోసా ఇచ్చింది. యుద్ధ నౌకలు వస్తే మాత్రం కాల్పుల విరమణను ఉల్లంఘించినట్టేనని స్పష్టం చేసింది. ఇక యూఎస్‌తో చర్చలు విఫలం కావడంపై ఇరాన్ మంత్రి అరాగ్చీ ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. 47 ఏళ్ల తరువాత జరిగిన అత్యున్నత స్థాయి చర్చలకు తాము సదుద్దేశంతో వెళ్లామని చెప్పారు. ఒప్పందం అంగుళం దూరంలో ఉండగా యూఎస్ తన లక్ష్యాలను, ఉద్దేశాలను మార్చుకుందని ఆరోపించారు. మునుపటి అనుభవాల నుంచి ఎలాంటి గుణపాఠాలను అమెరికా నేర్చుకోలేదన్నారు. మంచి భావాలుంటే చివరకు మంచే జరుగుతుంది.. మనసులో శత్రుత్వం ఉంటే తుదకు అదే మిగులుతుంది అని ‘ఎక్స’ వేదికగా పోస్టు పెట్టారు. కాగా, ట్రంప్ ప్రకటన తరువాత హర్మూజ్‌లో సోమవారం నౌకల ట్రాఫిక్ స్తంభించిపోయిందని లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్ అనే మారిటైమ్ సంస్థ తాజాగా పేర్కొంది. ఎలాంటి ఒప్పందం లేకుండా ఇరాన్‌తో చర్చలు ముగియడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. గతంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం మాత్రం కొనసాగుతోందన్నారు. ఇరాన్ మళ్లీ చర్చలకు వస్తుందా రాదా అనేది తనకు ఇక అనవసరమని కూడా చెప్పారు. ఇప్పటికే ఇరాన్ పరిస్థితి దగజారిందని, మిలిటరీ ధ్వంసమైపోయిందని చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *