– కమ్యూనలిస్టు మోదీ.. కమ్యూనిస్టు విజయన్
– ఓడగొడితేనే కేరళంకు మంచి రోజులు
– కేరళంలో బీజేపీకి లక్ష్మణ రేఖ గీసింది యూడీఎఫ్‌నే
– ఎన్నికల ప్రచార సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తిరువనంతపురం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: కేరళంలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్)కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. దిల్లీ కమ్యూనలిస్టు ప్రధాని నరేంద్ర మోదీ, త్రివేండ్రం కమ్యూనిస్టు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను ఓడగొడితేనే కేరళంకు మంచి రోజులు వస్తాయన్నారు. మోదీ-విజయన్‌వి విభిన్న భావజాలాలైనా భావాలొక్కటేనని, ఎల్డీఎఫ్, బీజేపీల మధ్య ఒప్పందాలు ఉన్నాయని సీఎం ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ కేరళంలోని నేమం సహా పలు నియోజకవర్గాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అన్ని సభల్లోనూ ఆయన ప్రసంగాలకు భారీ స్పందన లభించింది. నేమంలో యూడీఎఫ్ అభ్యర్థి కేఎస్.శబరీనాథన్ తరఫున పూంథురలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ బీజేపీ, ఆరఎసఎస్‌లను కేరళలోకి రానీయకుండా లక్ష్మణ రేఖ గీసింది యూడీఎఫ్‌నే అన్నారు. కేరళలో జాతీయ రహదారులు సహా పలు అభివృద్ధి పనులు నిలిచిపోయినా ముఖ్యమంత్రి పినరయి విజయన్ నోరు మెదపడం లేదని మండిపడ్డారు. కేరళ ప్రజలు బీజేపీ, ఎల్డీఎఫ్‌కు గుణపాఠం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేరళ భవిష్యత్తును దెబ్బతీయాలని చూస్తున్నారని విమర్శించారు. బీజేపీ-సీపీఎం మధ్య సైలెంట్ అండర్ స్టాండింగ్ ఉందని, అందుకే వారిపై ఎలాంటి కేసులు ఉండవని విమర్శించారు. దేశంలో ఎవరినైనా బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐతో వేధిస్తుందని, కానీ విజయన్ సర్కారుపై ఈగ కూడా వాలనీయరని ఆగ్రహించారు. కేరళం సమగ్రాభివృద్ధి యూడీఎఫ్ లక్ష్యమన్నారు. విద్యావంతులైన ఎందరో మళయాళీలు స్థానికంగా ఉపాధి అవకాశాలు లేక విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని, వారికి స్థానికంగా ఉపాధి కల్పించే పరిశ్రమలు తగిన సంఖ్యలో లేవని అన్నారు. పరిశ్రమల ఏర్పాటుతోపాటు కేరళం సమగ్రాభివృద్ధికి యూడీఎఫ్ ప్రణాళికలు రచిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజలు, యువతకు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే న్యాయం జరుగుతుందని రేవంత్? పిలుపునిచ్చారు. హస్తం పార్టీకి ఓటేస్తే పాత కేరళం ఏమిటో మళ్లీ చూపిస్తామని హామీ ఇచ్చారు. డెవలప్‌మెంట్ విత్ డిగ్నిటీతో ముందుకు వెళుతున్నామని సీఎం తెలిపారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ముఖ్యమంత్రలవి నిష్కళంక రాజకీయాలు
సామాజిక ప్రగతి, అభివృద్ధి, అక్షరాస్యతలో కేరళం ఎప్పటినుంచో యావత్ దేశానికే ఆదర్శ రాష్ట్రంగా నిలిచిందని, అందుకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో జరిగిన కృషే కారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విద్యా రంగంలో కేరళంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు సాధించిన ప్రగతిని వివరించారు. దేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా కేరళంకు ఉన్న గుర్తింపును నొక్కి చెప్పారు. కరుణాకరన్ కేరళలో అభివృద్ధికి బాటలు వేశారని, ఊమెన్ చాందీ సంక్షేమం-అభివృద్ధి రెండింటికీ సమాన ప్రాధాన్యం ఇచ్చారని, ఏకే.ఆంటోనీ నిజాఅతీకి నిదర్శనమని అన్నారు. కేరళంను ‘గాడ్స్ ఓన్ కంట్రీ’గా పిలుస్తారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకే దేశంతోపాటు, ప్రపంచవ్యాప్తంగా కేరళం ఒక బ్రాండ్‌గా నిలిచిందన్నారు. పర్యాటకం, విద్య, ఆరోగ్యం, సామాజిక పురోగతి- ఇవన్నీ కేరళంను ఒక ప్రత్యేక రాష్ట్రంగా నిలబెట్టాయన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



