– వ్యక్తిగత గోప్యత, డేటా భద్రతకు ప్రాధాన్యం
– జాబితా ప్రచురణలో భద్రత
– సాంకేతిక ఆధారిత సేవలు
– తగ్గిన ఫిర్యాదులు
– రాష్ట్ర సీఈఓ సుదర్శన్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 21: ఓటర్ల జాబితా (వోటర్ రిజిస్టర్) ప్రజలకు సులభంగా, భద్రంగా అందుబాటులో ఉండటం ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత, ప్రజాభిమానం, విశ్వాసానికి మూలమని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఇండియా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్‌మెంట్ లో నిర్వహించిన “ ఈజ్ యాక్సెస్ టు ది ఓటర్ రిజిస్టర్” అంశంపై జరిగిన ప్రత్యేక సదస్సులో ఆయన ప్రధాన ప్రసంగం చేశారు. ఓటర్లు, రాజకీయ పార్టీలు, పౌరసమాజ సంస్థలు తమ వ్యక్తిగత వివరాల పరిశీలన, ఎన్నికల ప్రణాళికలు, ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షణ కోసం ఖచ్చితమైన ఓటర్ డేటాపై ఆధారపడుతున్నాయని తెలిపారు. అయితే సమాచార అందుబాటుతో పాటు వ్యక్తిగత గోప్యత, డేటా భద్రతకు సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ ఓటర్ లుక్-అప్ సేవలు, నియంత్రిత ప్రవేశ కియోస్కులు, పరిమిత వివరాలతో ఓటర్ జాబితాల ప్రచురణ వంటి విధానాలు భద్రతతో కూడిన, ప్రజలకు అనుకూలమైన మార్గాలుగా పనిచేస్తున్నాయని వివరించారు. సాంకేతికత ఆధారిత సేవల ద్వారా ఓటర్ సేవల్లో మెరుగుదల, ఫిర్యాదుల తగ్గింపు, ఎన్నికల వ్యవస్థపై ప్రజల నమ్మకం పెరగడం సాధ్యమైందని తెలిపారు. సమతుల్యమైన అందుబాటు వ్యవస్థలు ప్రజాస్వామ్య ప్రమాణాలకు అనుగుణంగా పారదర్శకతను పెంచడంతో పాటు పౌరుల సార్థక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయని అన్నారు. ఈ సదస్సును సి. సుదర్శన్ రెడ్డి స్వయంగా మోడరేట్ చేయగా, సురినామ్, మెక్సికో దేశాల ఎన్నికల ప్రతినిధులు, హైదరాబాద్‌కు చెందిన విద్యావేత్తలు, భారత ఎన్నికల సంఘం ప్రతినిధులు ప్రసంగించారు. అనంతరం చర్చలు, ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరిగింది. 70కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నఐఐసీడీఈఎం–2026 సదస్సు, ఎన్నికల నిర్వహణలో అంతర్జాతీయ ఉత్తమ విధానాలు, ఆవిష్కరణలు, సవాళ్లపై గ్లోబల్ స్థాయి చర్చలకు వేదికగా నిలుస్తోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




