రాజమహేంద్రవరం, జనవరి 19: జనవరి 26 రిపబ్లిక్ డేను పురస్కరించుకుని హైదరాబాద్ లోని ప్రముఖ సాంస్కృతిక సంస్థలు వైద్యుల గ్లోబల్ ఫౌండేషన్వ, సుంధర విజ్ఞాన వికాస మండలి సంయుక్త ఆధ్వర్యంలో వివిధ రంగాలలోని ప్రతిభావంతులకు స్ఫూర్తి రత్న పురస్కారాలను ప్రకటించారు. సాహిత్య రంగానికి రాజమండ్రి నగరానికి చెందిన ఔత్సహిక రచయిత శ్రీపాద శ్రీనివాసుకు ప్రతిష్టాత్మక వివేకానంద స్ఫూర్తి రత్న పురస్కారాన్ని ప్రకటించారు. కాగా, రచయిత శ్రీపాద రచించిన 16కు పైగా కథలు, కథానికలు తన స్వీయ స్వరంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ద్వారా వినిపించారు. ఇంకా గుండె చప్పుళ్ళు, చట్టసభల్లో గోదావరి గళం, మనసున ఉన్నది, అంతరంగం వంటి నాలుగు పుస్తకాలను రచించారు. రచనల్లో మనిషి జీవితంలోని వివిధ స్పందనలను వ్యక్తీకరిస్తూ ఆమేరకు తాత్విక చింతనను స్పష్టం చేస్తాయి. వీరు రచించిన పుస్తకాలకు ఉండవల్లి అరుణ్ కుమార్, మండలి బుద్ధప్రసాద్, డి.శ్రీధర్ బాబు, దనసరి అనసూయ (సీతక్క) వంటి రాజకీయ ఉద్దండులు ముందు మాటను అందించారు. శ్రీపాద సాంస్కృతిక నగరం రాజమండ్రి నివాసి అయినప్పటికీ హైదరాబాద్ లో స్థిరపడ్డారు. తెలంగాణ సాహిత్య, కళా సంస్థల అభిమానాన్ని చూరగొని వరుసగా మూడవ (హ్యాట్రిక్)దిగా వివేకానంద స్ఫూర్తి రత్న పురస్కారాన్ని అందుకోబోతున్నారు. వీరికి గతంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రేడియో కళాకారుడిగా గుర్తింపు ఇవ్వగా తదుపరి విపంచి సాంస్కృ తిక సంస్థ ఉగాది పురస్కారాన్ని ప్రదానం చేసింది. దీని గురించి శ్రీపాద మాట్లాడుతూ వాగులు, వంకలు, నదులు ప్రవహిస్తూ చివరకు సముద్రంలో కలిసినట్టుగా కళలు, కళాకారులు ఎక్కడ జన్మించినా వారు రాణించడానికి హైదరాబాద్ చక్కని వేదికగా మారిందని, ఇందుకు ఇక్కడి వారికి సర్వదా కృతజ్ఞుడిని అని సంతోషాన్ని వ్యక్తం చేశారు. కథలు, కథానికలను మాత్రమే కాక రాజకీయ, సామాజిక చైతన్యంతో అనేక రచనలను చేసి శ్రీపాద ఎందరో ప్రముఖుల నుంచి ప్రశంసలను పొందారు. రాజమండ్రిలోని మద్దూరి అన్నపూర్ణయ్య సేవా సంస్థ వారు మాత్రమే గతంలో పురస్కారాన్ని అందించి తమ ఔన్నత్యాన్ని చాటుకున్నారు. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభాపక్షం కార్యాలయ సిబ్బందిగా పనిచేస్తున్న శ్రీనివాస్ ఈ పురస్కారం అందుకోబోతున్న శుభతరుణంలో పలువురు సాహితీ మిత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





