ఆదివాసీల‌కు మ‌హాన‌గ‌ర సంద‌ర్శ‌న‌

– న‌గ‌ర జీవ‌న విధానంపై అవ‌గాహ‌న‌
– చారిత్ర‌క‌, వార‌స‌త్వ క‌ట్ట‌డాల సంద‌ర్శ‌న‌
– సాంస్కృతిక‌శాఖ ఆధ్వ‌ర్యంలో ఏర్పాట్లు
– మంత్రి జూప‌ల్లి కృష్ణారావు హామీ

ఉట్నూరు (ఆదిలాబాద్‌ జిల్లా), ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 27: ఆదివాసీలను ఆధునిక ప్రపంచంతో మమేకం చేసేందుకు ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి, ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ప్రకృతి ఒడిలో ఉన్న మినీ కాశ్మీర్ గా పిలిచే ఉమ్మ‌డి ఆదిలాబాద్ ను చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు వస్తుంటారు. కానీ, ఇక్కడే పుట్టి పెరిగిన అడ‌వి బిడ్డలకు ఆధునిక ప్రపంచం ఎలా ఉంటుందో తెలియకపోవడం త‌న‌ను క‌ల‌చివేసిందంటూ,  కుమ్మరికుంట గూడెం ఆదివాసీల‌ను ప్రత్యేక బస్సుల్లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు తీసుకువెళ్తామ‌ని మంత్రి జూప‌ల్లి కృష్ణారావు వెల్ల‌డించారు. నగరంలోని చారిత్రక కట్టడాలు, వార‌స‌త్వ సంప‌ద‌,ఆకాశహర్మ్యాలు, మెట్రో రైళ్లు నగరవాసుల జీవన విధానాన్ని చూపిస్తామ‌ని మంత్రి ప్రకటించారు. యువ‌త క్రీడ‌ల ప‌ట్ల ఆస‌క్తి పెంచేలా హైద‌రాబాద్ లో వారికి క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింట‌న్ వంటి ఆట‌ల‌ను కూడా చూపిస్తామ‌ని చెప్పారు. మీరు కేవలం అడవికి పరిమితం కాకూడదు, బయటి ప్రపంచాన్ని చూడాలి, జ్ఞానంతో మీ బ‌తుకుల‌ను, మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి అని మంత్రి ఆకాంక్షించారు. ఈ పర్యటనకు అయ్యే రవాణా, భోజన, వసతి ఖర్చులన్నీ ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ భ‌రిస్తుంద‌ని హామీ ఇచ్చారు. శ‌నివారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండ‌లం కుమ్మ‌రికుంట ఆదివాసీ గూడెన్ని మంత్రి జూప‌ల్లి కృష్ణారావు సంద‌ర్శించారు. నాగరికతకు ఆమడ దూరంలో, కొండ కోనల మధ్య బతుకులీడుస్తున్న గిరిజనులతో ఆయన నేరుగా ముచ్చటించి, వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 78 వసంతాలు గడిచినా, నేటికీ ఆదివాసీ గూడెల్లో దుర్భర పరిస్థితులు కొనసాగడం విచారకరమనిమంత్రి  ఆవేదన వ్యక్తం చేశారు.ఆదివాసీల‌ జీవన ప్రమాణాలు ఇంకా మెరుగుపడకపోవడంపై అధికారులతో చర్చించి, జీవ‌న ప్ర‌మాణాలు మెరుగుప‌రిచేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని భరోసా ఇచ్చారు. మీ పిల్లలను బడికి పంపి గొప్పగా చదివించాలి, అది వారి భవిష్యత్తును మారుస్తుంది. దాంతో పాటు, మీరు కూడా కనీసం సంతకం పెట్టడం నేర్చుకోవాలి. అక్షర జ్ఞానం ఉంటే అది మీకు మ‌రింత భ‌రోసానిస్తుంది, అక్ష‌రాస్య‌త సాధించి, జీవ‌న‌ప్ర‌మాణాల‌ను మెరుగుప‌రుచుకోవ‌డ‌మే కుమ్రం భీం, రాంజీ గోండు లాంటి మ‌హానీయుల‌కు మ‌న‌మిచ్చే అస‌లైన ఘ‌న నివాళి అని వారిలో స్పూర్తిని నింపారు. చదువుకోవడానికి కావాల్సిన ప‌ల‌క‌, బ‌ల‌పం, ఇత‌ర సౌక‌ర్యాలు ఉచితంగా అందిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఆదివాసీల‌కు కూడు, గూడు, విద్యా, వైద్యం వంటి ప్రాథమిక అవసరాల కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించేలా చర్యలు తీసుకుంటాం” అని మంత్రి స్పష్టం చేశారు. వృద్దుల‌కు దుప్ప‌ట్లు పంపిణీ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *