కాళేశ్వరంలో విష జ్వరాల విజృంభణ

గ్రామమంతా జ్వర పీడితులు
పారిశుధ్యం పై దృష్టి సారించని అధికారులు
వైద్య శిబిరాలు మరిచిన వైద్య సిబ్బంది

జయశంకర్‌ భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూన్‌ 09 : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌ మండలం కాళేశ్వరం గ్రామం జ్వర పీడితులతో విలువిలలాడుతున్నది. కాళేశ్వరం పుణ్యక్షేత్రం కేంద్రంగా గత నెల 15నుండి 26వ తేదీ వరకు 12 రోజుల పాటు సాగిన సరస్వతి పుష్కరాలకు సుమారు 30 లక్షల మంది భక్తులు వచ్చి పుణ్యస్నానాలాచరించారని అధికారులు వెల్లడిరచారు. పుష్కరాలు ముగిసి 15 రోజులు కావస్తుండగా ప్రజలు విష జ్వరాల బారిన పడి విలవిలలాడుతున్నారు. పుష్కరాల సమయంలో తీసుకున్న పారిశుద్ధ్య కార్యక్రమాలు మినహా పుష్కరాల అనంతరం పారిశుద్ధ్య నిర్వహణ లేకపోవడంతో గ్రామం అంతా చెత్తాచెదారంతో అపరిశుభ్రంగా మారిపోయింది. పుష్కరాల అనంతరం ఆపరేషన్‌ శానిటేషన్‌ ప్రక్రియను కొనసాగించాల్సిన అధికారులు తమకు పట్టనట్లుగా వ్యవహరించారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామమంతా దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు.ప్రతి ఇంటిలోనూ విష జ్వర పీడితులు కనిపిస్తున్నారు.
వైద్య శిబిరాలను ఏర్పాటు చేయని అధికారులు
కాళేశ్వరం పుష్కరాల సమయంలో వందల కొలది వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిన జిల్లా అధికార యంత్రాంగం పుష్కరాల అనంతరం ఆ వైద్య శిబిరాలను కొనసాగించకపోవడంతో తమకు విషజ్వరాలు సోకినట్లు స్థానికులు ఆవేదన చెందుతున్నారు. తమకు తగిన వైద్య పరీక్షలు చేసి మందులు అందజేయలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి విష జ్వరాలను కట్టడి చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *