సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ఉల్లంఘ‌న‌

– నందినగర్‌ ఇం‌టికి నోటీసులు ఎలా అతికిస్తారు
– ఎర్రవెల్లిలో అందుబాటులో ఉంటానని చెప్పాను
– నేరుగా నోటీసులు ఇవ్వక‌పోవ‌డం రాజ్యాంగ ఉల్లంఘనే
– ఏసీపీకి న‌న్ను విచారించే అధికారమే లేదు
– జూబ్లీహిల్స్ ఏసీపీకి మాజీ సిఎం కేసీఆర్‌ఆర్‌ ‌లేఖ
– అయినా రేప‌టి విచారణకు అందుబాటులో ఉంటానని వెల్లడి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 31:  జూబ్లీహిల్స్ ఏసీపీకి తనను విచారించే అధికార పరిధి లేదని మాజీ సిఎం  కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. నోటీసుల జారీలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పోలీసులు ఉల్లంఘించారని ఆరోపించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరికి మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌ ‌రావు ఆరు పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. క్రైమ్‌ ‌నంబర్‌ 243/2024 ‌విచారణకు సంబంధించి తన వివరణను ఈ లేఖలో వివరించారు. ముఖ్యంగా నందినగర్‌ ‌నివాసం గోడపై నోటీసు అతికించడంపై కేసీఆర్‌ ‌తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు. 65 ఏళ్లు దాటిన వ్యక్తులను.. వారి నివాసం వద్దే విచారించాలని చట్టం చెబుతోందని గుర్తు చేశారు. తాను ప్రస్తుతం ఎర్రవల్లి నివాసంలో ఉంటున్నానని, అక్కడే విచారణ జరపాలని పోలీసులకు స్పష్టంగా తెలిపారు. ఈ సందర్భంగా సతేందర్‌ ‌కుమార్‌ ‌యాంటిల్‌ ‌వర్సెస్‌ ‌సీబీఐ కేసు తీర్పును లేఖలో ఉటంకించారు. ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న చిరునామాకు, సీఆర్పీసీ సెక్షన్‌ 160 ‌కింద జారీ చేసే నోటీసులకు ఎలాంటి సంబంధం లేదని కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. ప్రస్తుతం నివసిస్తున్న చిరునామాలోనే విచారణ జరపాలని పార్లమెంట్‌ ‌చట్టం స్పష్టంగా చెబుతోందని తెలిపారు. హరీష్‌ ‌రావుకు జారీ చేసిన నోటీసుల విషయంలో పోలీసులు వేర్వేరు ప్రమాణాలు పాటిటించార‌ని కేసీఆర్‌ ‌విమర్శించారు. ఈ తరహా చర్యలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని హెచ్చరించారు. పోలీసుల తీరు తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను బాధ్యతాయుతమైన పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు పూర్తి సహకారం అందిస్తానని కేసీఆర్‌ ‌వెల్లడించారు. ఫిబ్రవరి 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. నందినగర్‌ ‌నివాసంలోనే విచారణకు అందుబాటులో ఉంటానన్నారు. భవిష్యత్తులో తనకు సంబంధించిన నోటీసులన్నీ ఎర్రవల్లి చిరునామాకే పంపాలని పోలీసులకు సూచించారు. అలాగే ఏపీ హైకోర్టులోని వీడీ మూర్తి కేసు తీర్పును కూడా లేఖలో ప్రస్తావించారు.

అభ్యంతరాలున్నా విచారణలో సిట్‌కు సహకరిస్తా

చట్టపరమైన అభ్యంతరాలున్నా తాను విచారణలో సిట్‌కు సహకరిస్తానని చెప్పారు. కేసీఆర్‌ ‌లేఖలో ఏం రాశారంటే.. ’సిట్‌ అధికారులు వ్యవహరించిన తీరు చట్టాలకి వ్యతిరేకం. సుప్రీంకోర్టు తీర్పులను తుంగలో తొక్కిన సిట్‌ అధికారుల తీరు. సిట్‌ అధికారులకి నోటీసు ఇచ్చే అధికారమే లేదు. ఇది నా రాజ్యాంగ హక్కులను కాలరాయడమే. మొన్న రెండుసార్లు సిట్‌ అధికారులు ఇచ్చిన నోటీసులు చట్టవిరుద్ధం, చట్టాలను అతిక్రమించి ఇచ్చారు. మీరు ఇచ్చిన మొదటి నోటీసుకు మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో బిజీగా ఉండటంవల్ల వేరే రోజు విచారణకు తేదీ ఇవ్వాలని చెప్పాను. దాంతోపాటు 65 ఏళ్ల పైబడిన వ్యక్తులను వారు నివసించే చోటనే విచారించాలని చెప్పే సెక్షన్‌ 160  నిబంధనలను  దృష్టికి తెచ్చాను’ అని పేర్కొన్నారు. ’తదుపరి నోటీసులన్నీ కూడా ఎర్రవల్లిలోని నా నివాసానికే పంపాలని చెప్పాను. కానీ, ఇది చెప్పిన తర్వాత కూడా గుర్తుతెలియని వ్యక్తులు సంతకంతో ఉన్న లేఖను రాత్రి 9 గంటలకు నందినగర్‌ ‌నివాసంలోని మా ఇంటి గోడకు అతికించినట్లు తెలుస్తోంది. ఆ లేఖను  మీరే పంపినట్లయితే, మీ సూచనల మేరకే అతికించినట్లయితే, ఆ లేఖను తీవ్రంగా ఆక్షేపిస్తున్నాను. ఇది భారత రాజ్యాంగం, చట్టం, గౌరవ సుప్రీంకోర్టుల పట్ల కు ఏమాత్రం గౌరవం లేదు అనే విషయాన్ని సూచిస్తుంది. గతంలో సుప్రీంకోర్టు ’సతేంద్ర కుమార్‌ ‌యాంటిల్‌ ‌వర్సెస్‌ ‌సీబీఐ’ అనే కేసులో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వాట్సాప్‌ ‌లేదా ఇతర ఎలక్టాన్రిక్‌ ‌మార్గాల ద్వారా నోటీసులు పంపడం చట్టబద్ధమైన పద్ధతి కాదని, చట్టం నిర్దేశిరచిన రీతిలోనే నోటీసులు ఇవ్వాలని పేర్కొంది. వ్యక్తిగతంగా అందజేయాలి. కానీ మీరు కావాలనే చట్టాన్ని, సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారు. ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది’ అని లేఖలో సూచించారు. ’భవిష్యత్తు నోటీసులన్నీ ఎర్రవల్లికే పంపాలని చెప్పినప్పటికీ మీరు దాన్ని విస్మరించారు. కాబట్టి మీరు ఇచ్చిన రెండో నోటీసు చట్టబద్ధంగా అందలేదు, అది చెల్లదు. మీరు ఇచ్చిన నోటీసు నా రాజ్యాంగబద్ధ హక్కులను ఉల్లంఘించడమే. నేను మీ పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలోగానీ, పొరుగు పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలోగానీ నివసించడం లేదు. కాబట్టి మీకు నోటీసు ఇచ్చే అధికార పరిధి లేదు. ఈ నోటీసుతో నన్ను కట్టడి చేసే అధికారం లేదు. ఎలక్షన్‌ అఫిడవిట్‌లో, అసెంబ్లీ రికార్డులో ఉన్న అడ్రస్‌ ఆధారంగా ఎర్రవల్లిలో విచారించలేమని మీరు చెప్పడం సరికాదు. నోటీసిచ్చే సమయానికి వ్యక్తి ఎక్కడ నివసిస్తున్నారు అన్నదే ముఖ్యం’ అని పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *