– ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహణ
– పాల్గొన్న మంత్రులు, మండలి చైర్మన్, స్పీకర్
– స్థానిక చట్ట సభలే గ్రామ సభలు
– గ్రామ సభ తీర్మానం ద్వారానే పథకాల అమలు: మంత్రి సీతక్క
– సీఎం సందేశంతో ప్రారంభం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రామ సభలు మొదటి రోజు విజయవంతమయ్యాయి. గ్రామస్థాయిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు నిర్వహించిన ఈ గ్రామ సభలకు ప్రజలు విశేషంగా స్పందించి ఉత్సాహంగా పాల్గొన్నారు. పంచాయతీరాజ్ శాఖకు అందిన సమాచారం మేరకు గ్రామ సభలకు సుమారు 15 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. వివిధ శాఖలకు చెందిన 75వేల మంది అధికారులు పాల్గొని లబ్దిదారుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఊరుమడ్లలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలం బూరుగుపల్లిలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, వర్ధన్నపేట మండలం కొత్తపల్లిలో అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, నల్గొండ జిల్లా తిప్తర్తిలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం అలమైపేటలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా పతినిధులు, సీఎస్ రామకృష్ణారావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ దివ్య దేవరాజన్‌తోపాటు ఉన్నతాధికారులు పాల్గొని గ్రామస్థులతో ప్రత్యక్షంగా మమేకమయ్యారు. మహిళా సాధికారతకు ప్రతీకగా 3.76 లక్షల మంది మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులు సభల్లో చురుకుగా పాల్గొన్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులు 4.66 లక్షల మంది హాజరై తమ అనుభవాలను పంచుకున్నారు, మంత్రి సీతక్క ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 12,450 గ్రామ పంచాయతీల్లో ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించే వ్యవస్థను బలోపేతం చేశారు. లబ్ధిదారుల అభిప్రాయాలను తెలుసుకుని వారి సమస్యలను అధికారులు నమోదు చేశారు. పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం వంటి పథకాల వల్ల తమకు కలిగిన మేలు గురించి లబ్ధిదారులు భావోద్వేగంతో వివరించడం విశేషం. ఇప్పటికే అమలులో ఉన్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు, రాబోయే రోజుల్లో అమలు చేయబోయే పథకాలపై కూడా చర్చించారు. ఇంకా పథకాల లబ్ధి పొందని అర్హులైన పేదలు తమ దరఖాస్తులను గ్రామ పంచాయతీ కార్యదర్శి వద్ద సమర్పించవచ్చని తెలియజేశారు. గ్రామాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, కొత్త దరఖాస్తుల స్వీకరణలో గ్రామ సభలు కీలక వేదికగా నిలుస్తున్నాయని అధికారులు తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ములుగు జిల్లాలో పలు గ్రామ సభల్లో పాల్గొని సభల ఉద్దేశాన్ని వివరించి లబ్దిదారుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. పలు గ్రామాల్లో మహిళా భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. స్థానిక చట్ట సభలే గ్రామ సభలని, గ్రామ సభ తీర్మానం ద్వారానే పథకాలు అమలు జరుగుతాయని తెలిపారు. సమస్యలను పరిష్కరించుకుంటూ గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకుపోవడానికి గ్రామ సభలు దోహదపడతాయన్నారు. రంగారెడ్డి జిల్లా విఠాయిపల్లిలో ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్‌ను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ఆవిష్కరించారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, డోర్నకల్‌లో ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
చేపట్టిన, చేపట్టనున్న కార్యక్రమాలు
99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా మార్చి 6 నుంచి జూన్ 12వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నారు. మార్చి 6 నుంచి 15 వరకు పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. ఈనెల 6 నుంచి 11వ తేదీ వరకు ఆరోగ్యం, 13 నుంచి 18వ తేదీ వరకు రహదారి భద్రత అరైవ్- అలైవ్, 20 నుంచి 25వ తేదీ వరకు సంక్షేమ పథకాల అమలు, 27 నుంచి మే 2వ తేదీ వరకు పిల్లల భద్రత, నో డ్రగ్స్ ప్రచారం, 4 నుంచి 9వ తేదీ వరకు రైతు సంక్షేమం, 11 నుంచి 16వ తేదీ వరకు విద్య, ఉపాధి అవకాశాలు, 18 నుంచి 23వ తేదీ వరకు యువత, క్రీడలకు ప్రోత్సాహం, మే25 నుంచి 30 వరకు మహిళా శిశు సంక్షేమం, జూన్ 1 నుంచి 12 వరకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
సభల్లో సిఎం రేవంత్ సందేశం
గ్రామ సభల్లో అధికారులు ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపిస్తున్నారు. ఆర్ధిక సవాళ్లను అధిగమిస్తూ, గత పాలకుల తప్పిదాలను సరిచేస్తూ సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీపడకుండా మన ప్రభుత్వం పని చేస్తోంది. మేం పాలకులం కాదు.. సేవకులం అన్న భావనతో ప్రజల ఆకాంక్షలు, అవసరాలే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నాం. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటున్నాం. ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో ప్రజా పాలనకు ఆమోదం, మద్ధతు లభించాయి. మీరు ఇచ్చిన ఈ ఫలితాలు మా బాధ్యతను మరింత పెంచాయి. ప్రభుత్వ పథకాలు అంటే కాగితాలపై కాదు.. ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్నది మా సంకల్పం. ఆ ఉద్దేశంతోనే ‘ప్రజాపాలన- ప్రగతిప్రణాళిక‘ పేరుతో మార్చి 6 నుండి 99 రోజుల పాటు, గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు, అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా సాగాలి. ఊరు వాడ సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రతి అధికారి పని చేయాలి. తెలంగాణ రైజింగ్-2047‘ విజన్ తో ఆర్థికంగానే కాక, అన్నీ రంగాల్లో తెలంగాణను ప్రపంచంలో నెంబర్ వన్ గా నిలపాలన్నది మన సంకల్పం. ఈ సంకల్పంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి. క్యూర్,ప్యూర్, రేర్‌గా రాష్టాన్న్రి వర్గీకరించుకున్నాం. వాటి పరిధిలో సేవా, తయారీ, వ్యవసాయ రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా మనం ఎదగాలి. 99 రోజుల కార్యాచరణ ఒక సాధారణ కార్యక్రమం కాదు.. ఒక దీక్ష. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఒక్కటై… దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలి. ఇదే నా కల. ఆ కలను సాకారం చేయడంలో అందరి సహకారాన్ని కోరుకుంటూ మీ రేవంత్ రెడ్డి.. అన్న సందేశాన్ని విడుదల చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




