హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 3: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన గ్రామ సభలు విజయవంతంగా పూర్తి కావడం పట్ల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క హర్షం వ్యక్తం చేశారు. గ్రామ స్థాయిలో ప్రజా పాలనను బలోపేతం చేసే దిశగా చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ సమన్వయంతో సహకరించారని ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ సభల్లో గ్రామ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, తాగునీటి సమస్యలు, పారిశుధ్యం, మౌలిక వసతులపై విస్తృతంగా చర్చలు జరగడం శుభపరిణామమని మంత్రి పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను స్వేచ్ఛగా వ్యక్తపరచారని, అధికారులు వాటిని శ్రద్ధగా స్వీకరించడం ప్రజాస్వామ్యానికి బలాన్ని చేకూర్చిందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామ ప్రజలకు, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ దివ్యదేవరాజన్, అన్ని స్థాయిలోని అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత శాఖల అధికారులకు మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు. గ్రామాభివృద్ధి కోసం ఇలాంటి ప్రజాపాలనా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని, ప్రజల భాగస్వామ్యంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. గ్రామ కేంద్రంగా అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించడం ద్వారా అభివృద్ధి పరిపూర్ణమవుతుందని పేర్కొన్నారు. ఇకపై గ్రామ సభల్లో వచ్చిన సూచనలు, సమస్యలను ప్రాధాన్యతతో ప్రభుత్వం పరిష్కరిస్తుందని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. గ్రామ స్థాయిలో పారదర్శకత, బాధ్యతాయుత పాలనను మరింత బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు.
ప్రణతీపుకాన్‌ను గెలిపిస్తే మరింత అభివృద్ధి : అసోంలో మంత్రి సీతక్క ప్రచారం
అసోం రాష్ట్రంలోని దిబ్రూగర్ జిల్లా నహర్కటియా నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క శుక్రవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుని కాంగ్రెస్ అభ్యర్థి ప్రణతీ ఫుకాన్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నహర్కటియా ప్రాంత అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. గతంలో ప్రజలకు సేవలందించిన అనుభవం ఉన్న నాయకురాలు ప్రణతీ ఫుకాన్‌ను గెలిపిస్తే నియోజకవర్గానికి మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించే శక్తి కాంగ్రెస్ పార్టీకే ఉందని, స్థానిక యువత, మహిళలు పెద్ద ఎత్తున కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
——————————————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.