– 2నుంచి వాటి నిర్వహణకు ఏర్పాట్లు చేయండి
– జిల్లాల అధికారులకు దిశా నిర్దేశం చేసిన మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. జిల్లాల పంచాయతీ అధికారులతో మంగళవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం జరుపుతున్న 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం గ్రామ సభలు నిర్వహించనున్న నేపథ్యంలో వాటి నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామ సభలు ప్రజల అభిప్రాయాలను నేరుగా తెలుసుకునే అత్యంత ముఖ్యమైన వేదికలని పేర్కొన్నారు. పాలనలో వారి భాగస్వామ్యాన్ని పెంపొందించడం, గ్రామస్థాయి సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారాలు కనుగొనడం, ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామ సభల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాలు, రైతులు, యువత, స్వయం సహాయక సంఘాల సభ్యులు, లబ్దిదారులు తప్పనిసరిగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో విస్తృత ప్రచారం చేపట్టి గ్రామస్థులందరూ హాజరయ్యేలా చూడాలన్నారు. సభల అజెండాను స్పష్టంగా ప్రజలకు తెలియజేసి రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి, గృహజ్యోతి, పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, మహిళా శక్తి వంటి పథకాలపై విస్తృతంగా జరగాలన్నారు. ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించిన నూతన పథకాల కోసం అర్హులను గుర్తించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి గ్రామ సభలో విధిగా ఫిర్యాదు బాక్సులను ఏర్పాటు చేసి ప్రజల అభ్యంతరాలు, ఫిర్యాదులను స్వీకరించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. గ్రామ సమస్యలను సమగ్రంగా గుర్తించి వాటి పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. అనంతరం సమావేశ వివరాలను నమోదు చేసి సమస్యలు, తీర్మానాలు, తీసుకున్న నిర్ణయాలపై నివేదికలను సమర్పించాలని స్పష్టం చేశారు. ప్రతి గ్రామానికి అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేయడంలో గ్రామ సభలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. గ్రామ సభలను పండగలా నిర్వహించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ దివ్యదేవరాజన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల
గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి టైడ్ గ్రాంట్స్ రూ.371.91 కోట్లు, యునైటెడ్ గ్రాంట్స్ రూ.247.94 కోట్లు కేంద్రం విడుదల చేసింది. కాగా, కేంద్రం నుంచి మరో రూ.వెయ్యి కోట్ల వరకు రావాల్సి ఉంది




