అంగన్‌వాడీ చిన్నారులకు విజయ పాలు

– దేశంలోనే తొలిసారి
– పైలట్‌ ప్రాజెక్టుగా ములుగు జిల్లా
– మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క

ములుగు, ప్రజాతంత్ర, నవంబర్‌ 17: రాష్ట్రంలోనే తొలిసారిగా ములుగు జిల్లా కేంద్రంలోని కృష్ణా కాలనీ అంగన్‌వాడీ కేంద్రంలో పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా ప్రీ స్కూల్‌ చిన్నారులకు 100 మి.లీ విజయ పాలను రోజూ అందించే కార్యక్రమాన్ని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని పిల్లల్లో పోషకాహార లోపాన్ని అధిగమించి పోషకాహార లోప రహిత తెలంగాణగా మార్చడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని తెలిపారు. అందులో భాగంగానే ఎక్కువ వెనుకబాటుతనంతో ఉన్న ములుగు జిల్లాను ఈ కార్యక్రమానికి పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతానికి అంగన్‌వాడీ టీచర్లు క్రియాశీల పాత్ర వహించాలని తెలిపారు. ముఖ్యంగా తల్లిదండ్రులను కలిసి అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను వివరించాలని సూచించారు. అలాగే కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేసేలా అంగన్‌వాడీలు అంకితభావంతో కృషి చేయాలన్నారు. అనంతరం వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడుతూ తల్లిదండ్రులను ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వారి నుండి ఆస్తులను జప్తు చేసి తల్లిదండ్రుల పేర మార్పిడి చేస్తామని హెచ్చరించారు. అనంతరం బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాలపై పోస్టర్లు ఆవిష్కరించారు. బాల్య వివాహాలు పిల్లల అభివృద్ధికి విఘాతం అని, వాటిని అడ్డుకుని ములుగును బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ విషయంలో సీడీపీవోలు, సూపర్వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఇతరులు కృషిచేయాలని సూచించారు. కలెక్టర్‌ టీఎస్‌ దివాకర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని మోడల్‌గా తీసుకొచ్చిన మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతానికి అందరూ కృషిచేయాలని సూచించారు. జిల్లా సంక్షేమ అధికారి తుల రవి మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాల గురించి వివరించారు. అనంతరం ములుగు సీడీపీవో కూచన శిరీష ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాల పంపిణీని ప్రారంభించి ప్రీ స్కూల్‌ చిన్నారులకు ఉచిత 100 మీ.లీ లీటర్ల పాలను అందించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్‌ మహేందర్‌ జీ, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బానోతు రవిచంద్ర, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రేగ కల్యాణి, ములుగు ‘ఆత్మ’ చైర్మన్‌, వివిధ ఐసీడీఎస్‌ ప్రాజెక్టు సీడీపీవోలు, డీసీపీవో ఓంకార్‌, డీఎంసీ రమాదేవి, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లు, డీసీపీయూ, సీహెచ్‌ఎల్‌, సఖి, డీహెచ్‌ఈడబ్ల్యూ తదితర విభాగాల సిబ్బంది, చిన్నారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page